Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 10 Aug 2023 13:00 IST

1. మహిళా పోలీసుల దుస్తులు లాగడాన్ని ఎలా సమర్థించుకుంటారు?: చంద్రబాబు

అనంతపురం నగరంలోని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) స్టేషన్‌లో వైకాపాకు చెందిన ఓ కార్పొరేటర్‌ వీరంగం సృష్టించడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) తీవ్రంగా ఖండించారు. మహిళా పోలీసుల దుస్తులు లాగుతూ ఈడ్చుకెళ్లడాన్ని పోలీసు పెద్దలు, పాలకులు ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ఏపీలో పోలీసులకు కూడా రక్షణ లేని అరాచక పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

2. విశాఖలో పవన్‌ పర్యటనపై పోలీసుల ఆంక్షలు

వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అయితే ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. మొదట నిర్ణయించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో రావాలని కోరారు. విమానాశ్రయం నుంచి  పోర్టు రోడ్డులోనే రావాలని స్పష్టం చేశారు. పవన్‌ ఎక్కడా రోడ్‌షో నిర్వహించొద్దని.. బయటికొచ్చి అభివాదాలు కూడా చేయొద్దని సూచించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

3. గ్రూప్‌-2 వాయిదా వేయాల్సిందే.. అభ్యర్థుల నిరసన

గ్రూప్‌-2 పరీక్షలను (Group 2 Exams) వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు యత్నించారు. నాంపల్లిలోని తెజస కార్యాలయం నుంచి సుమారు 2 వేల మంది అభ్యర్థులు పెద్దఎత్తున ర్యాలీగా బయలుదేరి వచ్చారు. అభ్యర్థుల నినాదాలతో టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

4. బుద్వేల్‌ భూముల వేలం.. అత్యవసర విచారణకు బార్‌ అసోసియేషన్‌ అభ్యర్థన

నగరంలోని రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌ భూముల ఈ-వేలం నిలిపివేయాలంటూ దాఖలు చేసిన పిల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ కోరింది. ఈ మేరకు హైకోర్టును అభ్యర్థించింది. బుద్వేల్ భూములు హైకోర్టు నిర్మాణానికి కేటాయించాలంటూ ఇటీవల బార్‌ అసోసియేషన్‌ పిల్‌ దాఖలు చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

5. కీలక వడ్డీరేట్లు యథాతథమే

విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం ప్రకటించారు. రెపోరేటు (Repo rate)ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేట్‌ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

6. కడపలో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు

కడపలో భారీ వర్షం కురిసింది. గురువారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మురుగు కాలువలు పొంగి ప్రవహించాయి. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, అంబేడ్కర్‌ కూడలి, కోర్టు రోడ్డు, భరత్ నగర్, చెన్నై రోడ్డు, మృత్యుంజయ కుంట, గంజికుంట కాలనీ, అక్కయ్యపల్లి, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరదనీరు చేరింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

7. స్మృతి ఇరానీకి రాహుల్‌ ఫోబియా పట్టుకుంది: కాంగ్రెస్ ఎద్దేవా

అవిశ్వాసం తీర్మానంలో భాగంగా ప్రసంగం తర్వాత వెళ్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గాలిలో ముద్దు ఇచ్చారని భాజపా ఎంపీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మణిపుర్(Manipur) అంశంపై చర్చకు సుముఖంగా లేని భాజపా(BJP).. ఈ తరహా ఆరోపణలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ ఘాటుగా స్పందించింది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి రాహుల్‌ ఫోబియా పట్టుకొందని ఎద్దేవా చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

8. మూసేవాలా హత్య.. అమెరికాలో చిక్కిన నిందితుడు

ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala)హత్య కేసులో మరో కీలక నిందితుడిని అమెరికా (America)లో అదుపులోకి తీసుకున్నారు. సిద్ధూ హత్యకు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు ధర్మ్‌జోత్‌ సింగ్‌ అనే వ్యక్తి ఆయుధాలు సరఫరా చేసినట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ ద్వారా నిందితుడిని పట్టుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

9. తెల్లవారుజామున 4 గంటలకు మోదీ నుంచి ఫోన్‌: లోక్‌సభలో అమిత్‌ షా

పార్లమెంట్(Parliament) సమావేశాల్లో భాగంగా మణిపుర్(Manipur) అంశంపై వాడీవేడీ చర్చ జరుగుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah).. ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్తతలను చల్లార్చడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

10. ‘కనీస బ్యాలెన్స్‌’ ఛార్జీలు.. రూ.21వేల కోట్లు

ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ ఉంచని వినియోగదారులపై బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. దీంతో పాటు ఏటీఎం (ATM) లావాదేవీ ఛార్జీలు, ఎస్సెమ్మెస్ (SMS) ఛార్జీలు కూడా ఉంటాయి. ఇలా వసూలు చేసిన ఛార్జీల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఐదు ప్రధాన ప్రైవేట్‌ బ్యాంకులు కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్ము వివరాలను వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని