Sidhu Moose Wala: మూసేవాలా హత్య.. అమెరికాలో చిక్కిన నిందితుడు

ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala)హత్య కేసులో మరో నిందితుడిని అమెరికా (America)లో అదుపులోకి తీసుకున్నారు. 

Updated : 10 Aug 2023 11:43 IST

దిల్లీ: ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala)హత్య కేసులో మరో కీలక నిందితుడిని అమెరికా (America)లో అదుపులోకి తీసుకున్నారు. సిద్ధూ హత్యకు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు ధర్మ్‌జోత్‌ సింగ్‌ అనే వ్యక్తి ఆయుధాలు సరఫరా చేసినట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ ద్వారా నిందితుడిని పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..

ధర్మ్‌జోత్‌ సింగ్‌ కహ్లోన్‌ (Dharmanjot Singh Kahlon)అనే వ్యక్తి ఆయుధాలను సరఫరా చేస్తుంటాడు. సిద్ధూను హత్య చేసేందుకు లారెన్స్‌ గ్యాంగ్‌కి ఆయుధాలను అందించాడు. ఈ హత్య కేసులో మరో కీలక నిందితుడు సచిన్‌ బిష్ణోయ్‌ (Sachin Bishnoi)ను విచారించగా.. ధర్మ్‌జోత్‌ వివరాలు బయటకొచ్చాయి. అతడు అమెరికాలో తలదాచుకున్నాడని తెలుసుకున్న పోలీసులు ఆపరేషన్‌కు ప్లాన్‌ చేశారు. పంజాబ్‌, దిల్లీ పోలీసు శాఖలు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఏఎన్‌ఐ) సమష్టిగా నిందితుడిని పట్టుకునేందుకు పనిచేశాయి. కాలిఫోర్నియాలో కహ్లోన్‌ను అదుపులోకి తీసుకున్నారు. త్వరలో నిందితుడిని భారత్‌ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

అసత్యాలతో అత్యాచార నేరంలో ఇరికిస్తే నిందితుడిని కాపాడాల్సిందే

గతేడాది మే 29న సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సిద్ధూ మాన్సా జిల్లాల్లోని ఇంటి నుంచి బయటకు వచ్చాక.. కొందరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సిద్ధూ అక్కడికక్కడే మృతిచెందారు. వీఐపీ సంస్కృతికి తెరదించుతూ రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ హత్య చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అతడి హత్య వెనుక గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్‌ హస్తం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు పలువురిని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు గతేడాది జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, మరో ఇద్దరు జైలులో జరిగిన ఘర్షణలో మరణించారు. ఈ కేసుతో సంబంధమున్న మరో నిందితుడు సచిన్‌ బిష్ణోయ్‌ని దిల్లీ పోలీస్‌ ప్రత్యేక విభాగం అజర్‌బైజాన్‌లో అదుపులోకి తీసుకొని దేశానికి రప్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని