Congress: స్మృతి ఇరానీకి రాహుల్‌ ఫోబియా పట్టుకుంది: కాంగ్రెస్ ఎద్దేవా

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, భాజపా ఎంపీలు చేసిన విమర్శలను శివసేన(యూబీటీ) తోసిపుచ్చింది. ఆయన చర్యలో ఎలాంటి దురుద్దేశం కనిపించలేదని చెప్పారు. 

Published : 10 Aug 2023 12:02 IST

దిల్లీ: అవిశ్వాసం తీర్మానంలో భాగంగా ప్రసంగం తర్వాత వెళ్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గాలిలో ముద్దు ఇచ్చారని భాజపా ఎంపీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మణిపుర్(Manipur) అంశంపై చర్చకు సుముఖంగా లేని భాజపా(BJP).. ఈ తరహా ఆరోపణలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ ఘాటుగా స్పందించింది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి రాహుల్‌ ఫోబియా పట్టుకొందని ఎద్దేవా చేసింది. కమలం పార్టీ ఎంపీల విమర్శల నేపథ్యంలో శివసేన(యూబీటీ) నేత ప్రియాంకా చతుర్వేది(Priyanka Chaturvedi) రాహుల్ చర్యను సమర్థించారు.

‘నేను విజిటర్స్‌ గ్యాలరీలో ఉన్నాను. ఆయన ఆత్మీయంగా ఆ సంజ్ఞ చేశారు. దానిలో ఎలాంటి దురుద్దేశం కనిపించలేదు. ఆ ప్రేమను వారు (భాజపాను ఉద్దేశించి) స్వీకరించలేరు. దానిని వారు ఎందుకు చెడుగా చూస్తున్నారు..? మీరు విద్వేషానికి అలవాడు పడ్డారు. అందుకే ఆ ప్రేమను అంగీకరించలేకపోతున్నారు’ అని చతుర్వేది(Priyanka Chaturvedi) విమర్శించారు. 

సభలో మణిపుర్‌ వార్‌

రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) గాలిలో ముద్దు ఇవ్వడంపై బుధవారం భాజపా మహిళా ఎంపీలతో కలిసి స్మృతి ఇరానీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ‘ఆయన మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ ప్రవర్తన తెలియజేస్తోంది. ఇది అసభ్యకరమైంది’ అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫిర్యాదుపై 20 మంది మహిళా సభ్యులు సంతకాలు చేశారు. 

దీనిపై కాంగ్రెస్ ఎంపీ మాణికం మాట్లాడుతూ.. స్మృతి ఇరానీ(Smriti Irani) రాహుల్‌ ఫోబియాతో బాధపడుతున్నారని వ్యంగ్యంగా స్పందించారు. దాన్నుంచి ఆమె బయటపడాలని సూచించారు. అలాగే రాహుల్ ఎప్పుడు మహిళలతో మర్యాదపూర్వకంగానే ప్రవర్తిస్తారని మరో ఎంపీ గీతా కోడా అన్నారు. భాజపా నేతలు పార్లమెంట్‌లో మణిపుర్ అంశాన్ని మాట్లాడాలనుకోవడం లేదని, రాహుల్ గాంధీ సభలో ఉండకూడదని కోరుకుంటున్నారని అన్నారు. అందుకే వారు ఈ అసభ్యకరమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని