Amit Shah: తెల్లవారుజామున 4 గంటలకు మోదీ నుంచి ఫోన్‌: లోక్‌సభలో అమిత్‌ షా

మణిపుర్ అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. దీనిపై జరిగిన చర్చలో భాగంగా కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah).. విపక్షాల డిమాండ్లకు సమాధానం ఇచ్చారు. 

Updated : 10 Aug 2023 10:55 IST

దిల్లీ: పార్లమెంట్(Parliament) సమావేశాల్లో భాగంగా మణిపుర్(Manipur) అంశంపై వాడీవేడీ చర్చ జరుగుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah).. ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్తతలను చల్లార్చడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారని చెప్పారు. 

‘ఈ దేశం మొత్తానికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రధాని మోదీ మణిపుర్‌(Manipur) గురించి అస్సలు ఆలోచించడం లేదని కొందరు విమర్శలు చేస్తున్నారు. మణిపుర్‌లో ఘర్షణల విషయం తెలియగానే మోదీ తెల్లవారుజామున నాలుగింటికి ఒకరోజు ఫోన్ చేశారు. మరుసటి రోజు ఉదయం ఆరున్నరకు ఫోన్‌ చేశారు. మూడురోజుల పాటు నిమిషం తీరిక లేకుండా మేం పనిచేశాం. 16 వీడియో కాన్ఫరెన్సుల్లో పాల్గొన్నాం. అలాగే 36,000 మంది కేంద్ర బలగాల సిబ్బందిని పంపించాం. వైమానిక దళాన్ని ఉపయోగించాం. ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీని బదిలీ చేశాం. సూరత్‌ నుంచి ఒక సలహాదారును పంపాం. ఇవన్నీ కేంద్రం మే నాలుగునే చేసింది’ అని వెల్లడించారు. మైతేయ్‌లకు ఎస్టీ హోదా విషయంలో ఆందోళనకు గురైన గిరిజన ప్రాంత ప్రజలు చురాచాంద్‌పుర్‌లో నిర్వహించిన సంఘీభావ ర్యాలీ హింసాత్మకంగా మారిన 24 గంటల్లోనే కేంద్రం ఈ చర్యలన్నీ తీసుకుందని అమిత్‌ షా పేర్కొన్నారు.  

సభలో మణిపుర్‌ వార్‌

అలాగే ఆర్టికల్‌ 356 కింద మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిని అమిత్‌ షా తోసిపుచ్చారు. ‘ఆర్టికల్ 356 ఎందుకు అమలు చేయట్లేదని వారు అడుగుతున్నారు. హింసాత్మక ఘటనల సమయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సహకరించనప్పుడు మాత్రమే ఈ నిబంధనను అమలు చేస్తారు. ప్రస్తుతం మాకు ఆ సమస్య ఏమీ లేదు’ అని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్ సింగ్‌ను ఎందుకు తొలగించడం లేదని విపక్షాలు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఆయన కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయనప్పుడు అలాంటి అవసరం ఉంటుంది. మణిపుర్ సీఎం మాకు సహకరిస్తున్నారు’ అని తెలిపారు.

ఇదిలా ఉంటే.. మణిపుర్‌లో శాంతిస్థాపన నిమిత్తం అమిత్‌ షా(Amit Shah) జూన్‌లో నాలుగురోజుల పాటు పర్యటించారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజాసంఘాల నేతలతో సమావేశమయ్యారు. కమిటీలను ఏర్పాటు చేశారు. కానీ, ఆ తర్వాత కూడా హింస ఆగలేదు. మరీ ముఖ్యంగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన వీడియో వెలుగులోకి వచ్చి తీవ్ర సంచలనం సృష్టించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని