RBI Rates: కీలక వడ్డీరేట్లు యథాతథమే

వరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లలో ఆర్‌బీఐ (RBI) ఎలాంటి మార్పులు చేయలేదు. రెపోరేటు (Repo rate)ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు

Updated : 10 Aug 2023 10:48 IST

ముంబయి: విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం ప్రకటించారు. రెపోరేటు (Repo rate)ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేట్‌ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి.

గత జూన్‌ సమావేశంలోనూ రెపో రేటు (Repo rate)ను ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా కొనసాగించారు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం వరుసగా ఇది మూడోసారి. అంతకుముందు  ద్రవ్యోల్బణాన్ని (Inflation) నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్ల మేర ఆర్‌బీఐ పెంచింది.

ఈ సందర్భంగా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మాట్లాడుతూ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణను కొనసాగించాలని పరపతి విధాన కమిటీ నిర్ణయించినట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు. ద్రవ్యోల్బణంపై ఎంపీసీ దృష్టి సారించిందని, అయితే ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యిత పరిధి అయిన 4 శాతం ఎగువనే ఉందని తెలిపారు. కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. జూన్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం కాస్త పెరిగి 4.81శాతంగా నమోదైంది.

వృద్ధి రేటు 6.5శాతం..

ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును గత అంచనాలను అనుగుణంగా 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించినట్లు దాస్ తెలిపారు. వాణిజ్య రంగంలో వనరుల ప్రవాహం గతేడాది రూ.5.7లక్షల కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది అది రూ.7.5లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించారు. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా మారుతున్నాయని చెప్పారు. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ.. ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగేందుకు వృద్ధి పథంలోనే పయనిస్తోందని ఆర్‌బీఐ గవర్నర్‌ వెల్లడించారు.

ద్రవ్యోల్బణ అంచనాలు..

టమాటాలు, పప్పుధాన్యాల ధరలు విపరీతరంగా పెరగడంతో ఈ ఏడాది రిటైల్‌ ద్రవ్యల్బోణ అంచనాలను ఆర్‌బీఐ సవరించింది. గతంలో ఈ అంచనాలు 5.1శాతంగా ఉండగా.. ఇప్పుడు దాన్ని 5.4శాతానికి పెంచింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6.2శాతం, మూడో త్రైమాసికంలో 5.7శాతం, నాలుగో త్రైమాసికంలో 5.2శాతం ఉండనున్నట్లు అంచనా వేసింది.

ఎంపీసీ సమావేశంలో ఇతర కీలకాంశాలు..

  • రూ.2వేల నోట్ల ఉపసంహరణ, కేంద్రానికి డివిడెంట్‌తో మిగులు ద్రవ్యం పెరిగింది.
  • దేశ ఆర్థిక రంగం స్థిరంగా కోలుకుంటోంది. సవాళ్ల నుంచి ఈ రంగాన్ని కాపాడేందుకు ఆర్‌బీఐ కృతనిశ్చయంతో ఉంది.
  • ఈ ఏడాది ఏప్రిల్‌- మే కాలంలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 5.5 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. గతేడాది ఇదే కాలంలో ఈ ఎఫ్‌డీఐలు 10.6 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.
  • ఈ ఏడాది జనవరి నుంచి రూపాయి విలువ స్థిరంగా కొనసాగుతోంది. విదేశీ మారక నిల్వలు 600 బిలియన్‌ డాలర్లను దాటాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని