Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Sep 2023 13:09 IST

1. చంద్రబాబు హక్కులకు భంగం కలిగించారు: సిద్ధార్థ లూథ్రా వాదనలు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో కేసులు రాజకీయ ప్రేరేపితమని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఏసీబీ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని.. ఆయన హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్‌ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్‌ చేశారని చెప్పారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సీఐడీ అధికారుల ఫోన్‌ సంభాషణలను కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని సిద్ధార్థ లూథ్రా కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కక్ష సాధింపు రాజకీయాలకు వేదికగా ఏపీ: సీపీఐ రామకృష్ణ

చంద్రబాబు అరెస్ట్‌ (Chandrababu Arrest) నేపథ్యంలో రేపు విజయవాడలో అన్ని పక్షాలతో సమావేశం నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) తెలిపారు. తర్వాత చంద్రబాబును కలిసి సంఘీభావం తెలుపుతామని చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కక్షసాధింపు రాజకీయాలకు రాష్ట్రం వేదికగా మారిందని ఆక్షేపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చంద్రబాబు అరెస్ట్‌.. రిమాండ్ రిపోర్టులో సీఐడీ ఏం పేర్కొందంటే..

తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో రిమాండు రిపోర్టును సమర్పించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో చంద్రబాబును ప్రధాన కుట్రదారుగా రిపోర్టు పేర్కొంది. అంతేకాకండా వివిధ అక్రమాల్లో ఆయన పాత్ర ఉందంటూ.. విచారణ చేసేందుకు  15 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీకి ఇవ్వాలని కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 200 గంటలు.. 300 సమావేశాలు.. 15 ముసాయిదాలు.. దిల్లీ డిక్లరేషన్‌ వెనుక భారీ కసరత్తు

జీ20 శిఖరాగ్ర సదస్సులో నేతల మధ్య కుదిరిన దిల్లీ డిక్లరేషన్‌ (G20 Declaration)పై ఏకాభిప్రాయం సాధించడానికి భారత దౌత్యవేత్తల బృందం విశేష కృషి చేసినట్లు షెర్పా అమితాబ్‌ కాంత్‌ ఆదివారం తెలిపారు. దాదాపు 200 గంటల పాటు నిరంతర చర్చలు జరిపినట్లు వెల్లడించారు. అదనపు కార్యదర్శులైన ఈనం గంభీర్, కె.నాగరాజు నాయుడుతో కూడిన దౌత్యవేత్తల బృందం 300 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత్ - పాక్‌ పోరు.. ఆ ఇద్దరూ ఉంటారా..? వాతావరణం ఎలా ఉండనుందంటే?

ఆసియా కప్‌లో (Asia Cup 2023) కీలక పోరు. సూపర్-4లో విజేతలుగా నిలిచే రెండు జట్లు ఫైనల్‌కు చేరతాయి. ఇక్కడ కూడానూ పాయింట్లు, రన్‌రేట్‌ కీలకం. కానీ, భారత్‌ను మాత్రం వర్షం వెంటాడుతూనే ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పాకిస్థాన్‌తో సూపర్-4లో టీమ్‌ఇండియా (IND vs PAK) తలపడనుంది. కానీ, కొలంబో వేదికగా జరగనున్న మ్యాచ్‌కూ వరుణుడు ముప్పు పొంచి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎట్టకేలకు ఓటీటీలోకి ‘భోళా శంకర్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

సోదరి సెంటిమెంట్‌ నేపథ్యంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భోళా శంకర్‌’ (Bhola Shankar ott Release). మెహర్‌ రమేశ్‌ దర్శకుడు. ఇందులో చిరంజీవి సోదరిగా నటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) కీలక పాత్ర పోషించారు. తమన్నా కథానాయిక. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. కాగా, ఇప్పుడీ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సెప్టెంబర్‌ 15 నుంచి ఇది సినీ ప్రియులకు అందుబాటులో ఉండనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తప్పుడు కేసులు పెడితే ప్రజలు నమ్మేస్థితిలో లేరు: అచ్చెన్నాయుడు

రాజకీయ కక్షలతో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడమే సీఎం జగన్‌ పని అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టి ఆయన ఆనందపడుతున్నారని వ్యాఖ్యానించారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో విశాఖలో అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మొరాకోలో ఎటు చూసినా శవాల దిబ్బలే.. 

మొరాకోలో శనివారం వచ్చిన తీవ్ర భూకంపం(Morocco earthquake)లో మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కూలిపోయిన నిర్మాణాల శకలాలను వెలికి తీసేకొద్దీ  మృతదేహాలు వెలుగు చూస్తున్నాయి. ఆదివారం ఉదయం నాటికి మృతుల సంఖ్య 2,012కు చేరింది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. ఓ ఫ్రెంచివాసిని తాజాగా గుర్తించారు. మరో 1404 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అక్షర్‌ధామ్‌లో రిషి సునాక్‌ ప్రత్యేక పూజలు

జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం దిల్లీకి వచ్చిన బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) ఆదివారం ఉదయం అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట సతీమణి అక్షతా మూర్తి కూడా ఉన్నారు. ఆయన రాక నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో దిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది: కన్నా లక్ష్మీనారాయణ

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం అంటూ వైకాపా ప్రభుత్వం చంద్రబాబు (Chandrababu) మీద పెట్టిన అక్రమ కేసులు కోర్టులో నిలబడవని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ (kanna lakshminarayana) అన్నారు. 2021లో ఎఫ్‌ఐఆర్‌ లో కూడా చంద్రబాబు పేరు లేదని... ఇప్పుడు రిమాండ్‌ రిపోర్టులో మళ్లీ చంద్రబాబు పేరు చేర్చారని మండిపడ్డారు. కేవలం ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధించడం సీఎం జగన్‌ నైజమని ధ్వజమెత్తారు. ప్రజా కోర్టులో వైకాపా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఏపీలో అంబేడ్కర్‌ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని