Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 04 May 2023 17:03 IST

1. సీఎంకు బాధ్యత ఉండక్కర్లేదా.. రైతుల వద్దకు ఎందుకు రారు?: చంద్రబాబు

రాష్ట్రంలో రైతుల బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటలో గురువారం ఆయన పర్యటించారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా మొలకలు వచ్చిన ధాన్యాన్ని చంద్రబాబుకు చూపిస్తూ.. రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. టికెటూ నాకే.. గెలుపూ నాదే: ఎమ్మెల్యే రాజయ్య

భారాస పార్టీ తరఫున ఈసారి టికెట్ ఖాయమని.. మళ్లీ గెలుపు కూడా తనదేనని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు రూమర్లేనని రాజయ్య కొట్టిపారేశారు. ఆ వార్తలకు కార్యకర్తలు ఎవరూ కంగారు పడొద్దని.. అయోమయానికి గురి కావొద్దని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. న్యాయవాది సలహా మేరకు లొంగిపోతా: ఎర్ర గంగిరెడ్డి

సీబీఐ కోర్టులో ఎప్పుడు లొంగిపోవాలనే విషయంపై తన న్యాయవాదితో చర్చిస్తున్నట్లు వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి తెలిపారు. తన న్యాయవాది సలహా మేరకు లొంగిపోనున్నట్లు చెప్పారు. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులివ్వరు: తలసాని

నంది అవార్డుల వివాదంపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. సినీ పరిశ్రమ నుంచి ఎవరూ సర్కారుకు ప్రతిపాదన పంపలేదని తెలిపారు. పురస్కారాలు ఇవ్వాలని ఎవరూ అడగలేదని స్పష్టం చేశారు. అయినా.. ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులు ఇవ్వరని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంది అవార్డులు ఇస్తామని ఆయన ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఓటమిని నిశ్శబ్దంగా అంగీకరించాల్సిందే: సెహ్వాగ్‌

ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) మ్యాచ్‌ల మజా కంటే గంభీర్ - విరాట్ వాగ్వాదం హైలైట్‌గా నిలిచింది. ఒకరినొకరు కవ్వించుకుంటూ చేసిన హంగామా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, వీరిద్దరిపై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జరిమానా విధించింది. లఖ్‌నవూ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీపై ఆర్‌సీబీ విజయం సాధించడంతో ఈ వివాదానికి దారితీసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. EPFO కీలక నిర్ణయం.. 1.16% అదనపు చెల్లింపు యజమాని వాటా నుంచే..

ఉద్యోగుల పింఛను పథకం (EPS - 95) కింద అధిక పింఛను (Higher Pension)కు ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగులు... రూ.15 వేలకు మించిన వేతనంపై 1.16% అదనంగా చెల్లించాలన్న నిబంధనపై EPFO వెనక్కి తగ్గింది. ఈ మొత్తాన్ని యజమాని వాటా నుంచే సమీకరించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆ రోజు మోదీని కలిసి స్పష్టంగా చెప్పేశా: పవార్‌

ఎన్‌సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తన మద్దతుదారులకు షాకిచ్చారు శరద్ పవార్(Sharad Pawar). ఆ సమయంలోనే విడుదల చేసిన ఆయన ఆత్మకథ నుంచి పలు రాజకీయ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. భాజపాతో పొత్తు విషయంలో 2019లో ప్రధాని మోదీ(Modi)కి తాను ఇచ్చిన స్పష్టతను పవార్‌ అందులో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 9 వరకు గోఫస్ట్‌ సర్వీసుల రద్దు.. 15 వరకు టికెట్ల విక్రయాలు బంద్‌!

ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటున్న గోఫస్ట్‌ ఎయిర్‌వేస్‌ (Go First) సంస్థ మరిన్ని సర్వీసులను రద్దు చేసింది. తొలుత మే 3, 4, 5 తేదీల్లో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ.. తాజాగా 9వ తేదీ వరకు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆపరేషనల్‌ కారణాల వల్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మా పతకాలను వెనక్కి ఇచ్చేస్తాం: హెచ్చరించిన రెజ్లర్లు

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ (Brij Bhushan)కు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతోన్న రెజ్లర్ల (Wrestlers Protest)పై దిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంపై క్రీడాకారులు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాగైతే తమకు వచ్చిన పద్మశ్రీలతోపాటు ఇతర పతకాలను, అవార్డులను వెనక్కి ఇచ్చేస్తామని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఊడుతున్న ఐటీ కొలువులు.. కాగ్నిజెంట్‌లో 3,500 మందికి ఉద్వాసన!

అంతర్జాతీయంగా ఐటీ సంస్థల్లో కోతలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ప్రముఖ సంస్థ కాగ్నిజెంట్‌ (Cognizant) 3,500 మందికి ఉద్వాసన (Layoffs) పలికేందుకు సిద్ధమైంది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా త్వరలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు పింక్‌ స్లిప్స్‌ ఇవ్వనున్నట్లు కంపెనీ సీఈఓ ఎస్‌.రవి కుమార్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని