Go First: 9 వరకు గోఫస్ట్‌ విమానాల రద్దు.. దివాలా పిటిషన్‌పై NCLT ఆదేశాలు రిజర్వ్‌

గోఫస్ట్‌ విమాన సంస్థ మే 9 వరకు సర్వీసులను రద్దు చేసింది. దివాలా పరిష్కారం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ తన తీర్పును రిజర్వ్‌ చేసింది.

Updated : 04 May 2023 19:34 IST

దిల్లీ: స్వచ్ఛంద దివాలా పరిష్కారం కోరుతూ గోఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ (Go First) దాఖలు చేసిన పిటిషన్‌పై ది నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) తన ఆదేశాలను రిజర్వ్‌ చేసింది. వాడియా గ్రూప్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్‌ రామలింగం సుధాకర్‌ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల బెంచ్‌ గురువారం విచారణ చేపట్టింది. నగదు చెల్లింపుల బాధ్యత విషయంలో మారటోరియం కోరుతూ మధ్యంతర ఆదేశాలివ్వాలని గోఫస్ట్‌ అభ్యర్థించింది. అలాగే కఠిన చర్యలు తీసుకోకుండా డీజీసీను సైతం ఆదేశించాలని కోరింది. అయితే, దివాలా పరిష్కార ప్రక్రియ విషయంలో మారటోరియంపై విమాన లీజుదారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. తమ వాదనలు వినకుండా ముందుకెళ్లకూడదని కోరారు. ఈ నేపథ్యంలో తన ఆదేశాలను బెంచ్‌ రిజర్వ్‌లో పెట్టింది.

మరోవైపు గోఫస్ట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ మరిన్ని సర్వీసులను రద్దు చేసింది. తొలుత మే 3, 4, 5 తేదీల్లో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ.. తాజాగా 9వ తేదీ వరకు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆపరేషనల్‌ కారణాల వల్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఆయా తేదీల్లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి పూర్తి టికెట్‌ సొమ్మును వాపసు చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. దాదాపు రూ.350 కోట్ల మేర సొమ్మును రిఫండ్‌ చేయాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  మే 15 వరకు టికెట్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ డీజీసీఏకు (DGCA) వెల్లడించింది. ఈ నేపథ్యంలో పూర్తి టికెట్‌ సొమ్మును రిఫండ్‌ చేయాలని ఆదేశించినట్లు డీజీసీఏ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని