Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 07 May 2023 17:06 IST

1. కాసుల కోసం కక్కుర్తి.. ఏ తల్లికి రాకూడదీ దుస్థితి!

జిల్లా కేంద్రమైన కామారెడ్డిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాలు చేయలేదని, బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము ఇవ్వలేదని కన్నతల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు నిరాకరించిన ఘటన కామారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం జరిగింది. దీంతో అయిన వారు ఉన్నప్పటికీ కిష్టవ్వ అనాథగా మిగిలిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీ విద్యార్థులు ప్రాణ భయంతో ఉన్నారు.. తక్షణమే తీసుకురండి: నారా లోకేశ్‌

మణిపుర్‌లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో అక్కడి ఎన్‌ఐటీలో చదువుతున్న ఏపీ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఆ విద్యార్థులను తక్షణమే రాష్ట్రానికి తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఓఆర్‌ఆర్‌ నిర్వహణ ప్రైవేటుకు ఎందుకు కట్టబెట్టారు?: కిషన్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఓఆర్‌ఆర్‌ నిర్వహణను ప్రైవేట్‌ కంపెనీకి కట్టబెట్టారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఓఆర్‌ఆర్‌పై ఏటా ఆదాయం పెరుగుతుందే తప్ప తగ్గదని చెప్పారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు

తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సిరాజ్‌పై మా ‘మాస్టర్‌ ప్లాన్’అదే: డేవిడ్ వార్నర్

ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరుపై దిల్లీ క్యాపిటల్స్‌ (DC vs RCB) ప్రతీకార విజయం నమోదు చేసింది. ఆర్‌సీబీ నిర్దేశించిన 182 పరుగుల టార్గెట్‌ను కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలోనే ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఫిలిప్ సాల్ట్ (87: 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరవిహారం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అన్ని పనులూ ఒక్కరే చేస్తే ఆందోళనకరమే.. ఏఐపై వారెన్‌ బఫెట్

సాంకేతిక రంగంలో ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం కృత్రిమ మేధ (AI). ఓపెన్‌ ఏఐ చాట్‌జీపీటీ (OpenAI ChatGPT), గూగుల్ బార్డ్‌ (Google Bard), మైక్రోసాఫ్ట్‌ బింగ్ చాట్‌ (Microsoft Bing Chat)లు యూజర్లకు అందుబాటులోకి రావడంతో వీటి వినియోగంపై చర్చ ప్రారంభమైంది. మరోవైపు, ఏఐతో మానవాళి మనుగడకు ప్రమాదం అంటూ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వంటి వారు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత్‌లోకి రష్యా చమురు వరద.. ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి ఒపెక్‌ క్రూడ్‌!

భారత ముడి చమురు (Crude oil) దిగుమతుల్లో ఒపెక్‌ (OPEC) దేశాల వాటా క్రమంగా తగ్గుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఏప్రిల్‌ నెలలో మొత్తం దిగుమతుల్లో ఒపెక్‌ దేశాల వాటా 46 శాతానికి చేరింది. చౌకగా లభిస్తున్న రష్యా చమురును (Russian oil) మన దేశం భారీగా దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణం. ఎనర్జీ కార్గో ట్రాకర్‌ వొర్టెక్సా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నాపై ఒక్క ఆరోపణ నిరూపించినా ఉరేసుకొంటాను..: బ్రిజ్‌ భూషణ్‌ సవాలు

తనపై క్రీడాకారులు చేస్తున్న వాటిలో ఒక్క ఆరోపణ నిరూపించినా ఉరేసుకొంటానని రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సవాలు చేశారు. దేశానికి చెందిన టాప్‌ రెజ్లర్లు భజరంగ్‌ పునియా, వినేష్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌ తదితరులు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌ వద్ద కొన్నాళ్లుగా ధర్నాలు చేస్తున్నారు. దీనిపై భూషణ్‌ స్పందిస్తూ.. ఒక్క ఆరోపణ నిరూపించినా ఉరేసుకొంటానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మణిపుర్‌లో డ్రోన్లతో సైన్యం నిఘా..!

మణిపుర్‌(Manipur)లో జాతుల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా చురాచాంద్‌పుర్‌(Churachandpur)లో విధించిన కర్ఫ్యూను నేడు తాత్కాలికంగా మూడు గంటలపాటు సడలించారు. మణిపుర్‌లో పరిస్థితిపై రక్షణశాఖ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘సైన్యం గగనతల నిఘా వ్యవస్థను పెంచింది. ఇందుకోసం ఇంఫాల్‌ లోయలో డ్రోన్లను, హెలికాప్టర్లను మోహరించాం’’ అని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నా జర్నీ ఇక్కడే ప్రారంభమైంది.. సొంత మైదానంలో చరిత్ర సృష్టించడంపై కోహ్లీ

దిల్లీ(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు(Royal Challengers Bangalore) ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) చరిత్ర సృష్టించాడు. దిల్లీపై 46 బంతుల్లో విరాట్‌ 55 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌ చరిత్రలో 7 వేల పరుగులు దాటిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. ఈ మైలురాయిని కోహ్లీ.. తన సొంత మైదానంలో సాధించడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని