Manipur: మణిపుర్‌లో డ్రోన్లతో సైన్యం నిఘా..!

హింసతో రగిలిపోతున్న మణిపుర్‌లో సైన్యం నిఘాను మరింత పెంచింది. డ్రోన్లను రంగంలోకి దించింది. దీంతోపాటు నేడు కూడా కర్ఫ్యూను కొంతసేపు సడలించారు.

Published : 07 May 2023 14:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మణిపుర్‌(Manipur)లో జాతుల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా చురాచాంద్‌పుర్‌(Churachandpur)లో విధించిన కర్ఫ్యూను నేడు తాత్కాలికంగా మూడు గంటలపాటు సడలించారు. మణిపుర్‌లో పరిస్థితిపై రక్షణశాఖ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘సైన్యం గగనతల నిఘా వ్యవస్థను పెంచింది. ఇందుకోసం ఇంఫాల్‌ లోయలో డ్రోన్లను, హెలికాప్టర్లను మోహరించాం’’ అని వెల్లడించారు.

కర్ఫ్యూ ఉదయం 7 గంటల నుంచి కొద్దిసేపు ఎత్తేయడంతో పెద్ద ఎత్తున ప్రజలు నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు వీధుల్లోకి వచ్చారు. తిరిగి ఉదయం 10 గంటలకు కర్ఫ్యూ మొదలైంది. ఈ సందర్భంగా సైన్యం, అస్సాం రైఫిల్స్‌ ఫ్లాగ్‌ మార్చ్‌ను నిర్వహించాయి. ఇప్పటికే దాదాపు 10 వేల మందికిపైగా సైనికులు, పారా మిలటరీ సిబ్బంది, కేంద్ర పోలీసు బలగాలను మణిపుర్‌లో మోహరించారు. శనివారం సాయంత్రం కూడా 3 గంటల నుంచి 5 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలతో చర్చలు జరిపిన తర్వాత చురాచాంద్‌పుర్‌ జిల్లాలో పరిస్థితి కొంత మెరుగైంది’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ పేర్కొన్నారు. మే 3వ తేదీన ఈ రాష్ట్రంలో అల్లర్లను అదుపు చేయడానికి కర్ఫ్యూను విధించారు. ఈ అల్లర్ల కారణంగా కనీసం 13,000 మంది నిర్వాసితులు కాగా.. 54 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని