Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు

తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

Published : 07 May 2023 16:21 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని పేర్కొంది. శనివారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో కొనసాగుతూ, సగటు సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు ఉందని వివరించింది.

దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో 9వ తేదీన వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత దాదాపు ఉత్తరం దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రం వైపునకు కదులుతూ తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనంగా మారిన తర్వాత ఈ తుపాను దిశ, వేగం, తీవ్రత, ప్రయాణించే మార్గం తెలుస్తాయని పేర్కొంది. దీని ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 9వ తేదీ నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వెల్లడించింది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 నుంచి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని