Crude oil: భారత్‌లోకి రష్యా చమురు వరద.. ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి ఒపెక్‌ క్రూడ్‌!

దేశంలోకి రష్యా చమురు పోటెత్తుతోంది. ఏప్రిల్‌ నెలలో దేశ మొత్తం చమురు అవసరాల్లో ఆ దేశ వాటా 36 శాతంగా నమోదైంది. అదే సమయంలో ఒపెక్‌ దేశాల వాటా 46 శాతానికి పడిపోయింది.

Published : 07 May 2023 14:44 IST

దిల్లీ: భారత ముడి చమురు (Crude oil) దిగుమతుల్లో ఒపెక్‌ (OPEC) దేశాల వాటా క్రమంగా తగ్గుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఏప్రిల్‌ నెలలో మొత్తం దిగుమతుల్లో ఒపెక్‌ దేశాల వాటా 46 శాతానికి చేరింది. చౌకగా లభిస్తున్న రష్యా చమురును (Russian oil) మన దేశం భారీగా దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణం. ఎనర్జీ కార్గో ట్రాకర్‌ వొర్టెక్సా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

చమురు ఎగుమతి చేసే దేశాల ఆర్గనైజేషన్‌ను ఒపెక్‌గా (OPEC) వ్యవహరిస్తారు. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. చమురు దిగుమతులపై ప్రధానంగా ఆధారపడే మన దేశం.. మొదటి నుంచీ ఈ దేశాల నుంచే క్రూడాయిల్‌ను (Crude oil) కొనుగోలు చేస్తూ వస్తోంది. 2022 ఏప్రిల్‌లో మన దేశ మొత్తం చమురు దిగుమతుల్లో ఈ వాటా 72 శాతంగా ఉండేది. ఏడాది తిరగక ముందే ఈ వాటా 46 శాతానికి చేరింది. ఓ దశలో మన దేశ చమురు అవసరాలను 90 శాతం వరకు ఈ దేశాలే తీర్చేవి.

రష్యా ఎంట్రీతో మారిన సీన్‌

ఉక్రెయిన్‌పై సైనిక చర్య కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో ఆదాయం కోసం తక్కువ ధరకే మాస్కో క్రూడాయిల్‌ను (Crude oil) విక్రయించడం మొదలు పెట్టింది. దీంతో భారత్‌, చైనా భారీ ఎత్తున చమురును దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాయి. ఈ మొత్తాన్ని క్రమక్రమంగా పెంచుకుంటున్నాయి. ఒకప్పుడు మన దేశ చమురు దిగుమతిలో ఒక్క శాతం వాటా కూడా లేని రష్యా.. ఇప్పుడు భారత్‌కు అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా అవతరించింది.

ఏప్రిల్‌ నెలలో ఇరాక్‌, సౌదీ అరేబియా దేశాల నుంచి భారత్‌కు అయిన చమురు దిగుమతుల కంటే రష్యా వాటానే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం భారత చమురు అవసరాల్లో 36 శాతం ఒక్క రష్యానే తీరుస్తోంది. ఏప్రిల్‌లో భారత్‌ సగటున 4.6 మిలియన్‌ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోగా.. అందులో ఒపెక్‌ దేశాలు 2.1 మిలియన్‌ బ్యారెళ్లు ఎగుమతి చేయగా.. రష్యా 1.67 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురును భారత్‌కు ఎగుమతి చేసింది. రష్యా చమురు విషయంలో భారత్‌ మరో రికార్డును నెలకొల్పిందని వొర్టెక్సా పేర్కొంది. రష్యా చమురు విషయంలో భారత్‌కు చైనా నుంచి గట్టి పోటీ ఎదురవుతోందని విశ్లేషించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని