Kishan Reddy: ఓఆర్‌ఆర్‌ నిర్వహణ ప్రైవేటుకు ఎందుకు కట్టబెట్టారు?: కిషన్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఓఆర్‌ఆర్‌ నిర్వహణను ప్రైవేట్‌ కంపెనీకి కట్టబెట్టారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

Published : 07 May 2023 15:11 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఓఆర్‌ఆర్‌ నిర్వహణను ప్రైవేట్‌ కంపెనీకి కట్టబెట్టారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఓఆర్‌ఆర్‌పై ఏటా ఆదాయం పెరుగుతుందే తప్ప తగ్గదని చెప్పారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే నగరం హైదరాబాద్‌.  ఓఆర్‌ఆర్‌ నిర్వహణకు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా కంపెనీని భారాస ప్రభుత్వం ఎంపిక చేసింది. వస్తున్న ఆదాయాన్ని తక్కువ చేసి ప్రైవేట్ సంస్థకు ఎందుకు కట్టబెట్టారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టును ఎందుకు ప్రైవేటుపరం చేస్తున్నారు? ముప్పై సంవత్సరాలకు ఎందుకు లీజుకు ఇస్తున్నారు?

టెండర్ల ప్రక్రియను తూతూ మంత్రంగా చేసి ఐఆర్‌బీ కంపెనీకి కట్టబెట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకమని సీఎం కేసీఆర్‌ కుటుంబం గొప్పలు చెప్పింది. రూ.వేల కోట్ల ప్రభుత్వ ఆదాయాన్ని ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేస్తోంది. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌కు ఇది విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వానికి ఓఆర్‌ఆర్‌ బంగారు బాతులాంటిది.  కేసీఆర్‌ తన స్వార్థప్రయోజనాల కోసం దాన్ని చంపేశారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీనిపై విచారణ జరిపిస్తాం’’ అని కిషన్‌రెడ్డి అన్నారు. 

చర్చల ద్వారానే ‘మణిపుర్‌’ సమస్యకు పరిష్కారం: కిషన్‌రెడ్డి

మణిపుర్‌లో ఘర్షణలు, హింసపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని.. హింసతో సాధించేదేమీ లేదన్నారు. మణిపుర్‌లో అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.5,500 కోట్లు ఖర్చు చేసిందన్నారు. మణిపుర్‌ యువత హింసను పక్కన పెట్టి అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని