Warren Buffett: అన్ని పనులూ ఒక్కరే చేస్తే ఆందోళనకరమే.. ఏఐపై వారెన్‌ బఫెట్

ప్రముఖ ఇన్వెస్టర్‌, ప్రపంచలో కుబేరుల్లో ఒకరైన వారెన్‌ బఫెట్‌ (Warren Buffett) ఏఐ (AI) పనితీరు తనను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. మరోవైపు ఏఐని కనుగొనడాన్ని ఆయన అణుబాంబు తయారీతో పోల్చారు.  

Updated : 07 May 2023 18:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతిక రంగంలో ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం కృత్రిమ మేధ (AI). ఓపెన్‌ ఏఐ చాట్‌జీపీటీ (OpenAI ChatGPT), గూగుల్ బార్డ్‌ (Google Bard), మైక్రోసాఫ్ట్‌ బింగ్ చాట్‌ (Microsoft Bing Chat)లు యూజర్లకు అందుబాటులోకి రావడంతో వీటి వినియోగంపై చర్చ ప్రారంభమైంది. మరోవైపు, ఏఐతో మానవాళి మనుగడకు ప్రమాదం అంటూ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వంటి వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రముఖ ఇన్వెస్టర్, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్‌ బఫెట్‌(Warren Buffett) సైతం ఏఐ గురించి తన అభిప్రాయం వెలిబుచ్చారు. 

బెర్క్‌షైర్‌ హాత్‌వే (Berkshire Hathaway) వార్షిక సమావేశంలో మాట్లాడుతూ.. తన స్నేహితుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) చాట్‌జీపీటీని తనకు పరిచయం చేసినట్లు చెప్పారు. చాట్‌జీపీటీ సామర్థ్యం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. అదేసమయంలో ఆ సాంకేతికత పనితీరు తనకు ఆందోళన కలిగించిందని అన్నారు. ఏఐని కనుగొనడాన్ని అణుబాంబు తయారీతో పోల్చారు.

‘‘అన్ని పనులు ఒక్కరే చక్కబెట్టడం అనేది నన్ను కొంత ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే దాని వల్ల మనం కొత్తగా ఏది కనిపెట్టలేం. మంచి కోసమని మనం ఏదైనా కనిపెడితే.. దానితో ఎలాంటి దుష్పప్రయోజనాలు ఉంటాయనేది రెండో  ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబు ప్రయోగంతో చూశాం. మనం ఏదైనా చేస్తే.. అది రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచానికి మేలు చేసేదై ఉండాలి. ఏఐ ప్రపంచం మొత్తాన్ని మారుస్తుందని నమ్ముతున్నా. మనిషి ఎలా ఆలోచిస్తాడు? ఎలా ప్రవర్తిస్తాడు? అనే రెండు విషయాలను మాత్రం అది ఎప్పటికీ చేయలేదు’’ అని బఫెట్‌ అన్నారు. 

కొద్దిరోజుల క్రితం గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ (Godfather of AI) గా గుర్తింపు పొందిన జాఫ్రీ హింటన్‌ (Geoffrey Hinton) సైతం ఏఐతో మానవాళి మనుగడకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. ఈ క్రమంలో ఏఐ గురించి మరింత స్వేచ్ఛగా మాట్లాడేందుకు గూగుల్‌ (Google)కు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, ఏఐ మనుషుల్ని, ఉద్యోగుల్ని భర్తీ చేయలేదని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. అంతకుముందు చాట్‌జీపీటీలతో భవిష్యత్‌లో మానవాళి మనుగడకే ప్రమాదం తలెత్తవచ్చనే ఆందోళనతో వాటి అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సహా పలువురు నిపుణులు ‘పాజ్‌ జియాంట్‌ ఏఐ ఎక్స్‌పెరిమెంట్స్‌’ పేరిట ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని