Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 08 May 2023 17:10 IST

1. తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఇంటర్‌ పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ ఫలితాల(TS Inter Results)ను మే 9న (మంగళవారం) విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఫలితాలను రేపు ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. హైదరాబాద్‌కు అందమైన ఆధ్యాత్మిక కేంద్రం వస్తోంది: కేసీఆర్‌

కరోనా సమయంలో హరేకృష్ణ ఫౌండేషన్‌ ప్రజలకు ఎన్నో సేవలు అందించిందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. నగర శివారు నార్సింగి వద్ద హరేకృష్ణ మూవ్‌మెంట్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 400 అడుగుల ఎత్తుగల ‘హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌’ (ఆలయం) నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. భూమిపూజ అనంతరం నిర్మాణ శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. మణిపుర్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న తెలంగాణ విద్యార్థులు

మణిపుర్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్‌ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో విద్యార్థులను మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌ నుంచి శంషాబాద్‌ తీసుకొచ్చారు.  ఆయా విద్యార్థులను ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక బస్సుల్లోవారి స్వస్థలాలకు పంపారు.  తొలుత ఆదివారం సాయంత్రానికి వారిని తీసుకురావాల్సి ఉండగా.. అక్కడి పరిస్థితులు అనుకూలించక తరలింపు సోమవారానికి వాయిదా పడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఆనంద నిలయం దృశ్యాలు.. పోస్టు చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు: తితిదే సీవీఎస్‌ఓ

తిరుమల ఆనంద నిలయం దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీవీఎస్‌ఓ) నరసింహ కిషోర్‌ వెల్లడించారు. తితిదే నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంలోకి ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకెళ్లడం, వీడియో చిత్రీకరించడం చట్టపరంగా నేరం అనే విషయం భక్తులందరికీ తెలుసని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తాం.. జేపీఎస్‌లకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్‌) సమ్మె వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు సాయంత్రం 5 గంటల వరకు జేపీఎస్‌లు విధుల్లో చేరాలని అదేశాలు జారీ చేసింది. ఒకవేళ విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ సుల్తానియా నోటీసులు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. గ్యాంగ్‌స్టర్‌ హత్య.. జైల్లో ఆ నాలుగు కత్తులు ఎక్కడివి..?

దేశ రాజధాని దిల్లీలోని తిహాడ్‌ జైల్లో (Tihar Jail) గ్యాంగ్‌స్టర్‌ టిల్లు తాజ్‌పురియా (Tillu Tajpuriya) హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు.. జైలు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. దాడికి అడ్డుకునేందుకు జైలు సిబ్బంది ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించింది. జైల్లోకి నాలుగు కత్తులు ఎలా వచ్చాయని అడిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. స్విగ్గీ, జొమాటోకు పోటీగా ONDC.. తక్కువకే ఫుడ్‌ ఆర్డర్‌!

దేశీయంగా ఫుడ్‌ డెలివరీ (Food delivery) విభాగంలో స్విగ్గీ, జొమాటో మధ్య పోటీ అందరికీ తెలిసిందే. ఈ విషయంలో వేరే కంపెనీలు వచ్చినా ఈ రెండింటిదే హవా. తమదైన ఆఫర్లతో ఈ రెండు కంపెనీలు అంతగా యూజర్లను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అలాంటి ఈ కంపెనీలకు ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ONDC) వేదిక సవాలు విసురుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. రాజస్థాన్‌లో భారీగా లిథియం నిక్షేపాలు.. JK కంటే అధికం!

దేశంలో మరోసారి భారీగా లిథియం నిక్షేపాలు (lithium reserves) వెలుగు చూశాయి. రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లా డెగానా మున్సిపాలిటీ పరిధిలో ఈ నిల్వలను గుర్తించినట్లు రాజస్థాన్‌ ప్రభుత్వ అధికారులు, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (GSI)కు చెందిన అధికార వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని గుర్తించిన 59 లక్షల టన్నుల లిథియం నిల్వల కంటే ఇక్కడ అధికంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

9. అదంతా సందీప్‌ శర్మకు తెలుసు.. మరీ ఎక్కువగా ఆలోచించడం లేదు: సంజూ

ఒకే ఒక్క నో బాల్‌ మ్యాచ్‌ను పూర్తిగా మార్చేసింది. ఐపీఎల్ చరిత్రలో (IPL) సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అద్భుత విజయం అందించగా.. సొంత మైదానంలో రాజస్థాన్‌ రాయల్స్‌కు (RR vs SRH) చుక్కెదురైంది. ఆదివారం జైపుర్‌ వేదికగా రాజస్థాన్‌ - హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి బంతిని సందీప్‌ శర్మ ‘నో బాల్’గా వేశాడు. సన్‌రైజర్స్ బ్యాటర్ అబ్దుల్ సమద్ చక్కని సిక్స్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. బంగారు గనిలో అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి

దక్షిణ అమెరికా దేశమైన పెరు(Peru)లో ఘోరం జరిగింది. బంగారు గనిలో అగ్నిప్రమాదం సంభవించడంతో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వారంతా నైట్‌ షిఫ్ట్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు. అరిక్విపా నగరానికి సమీపంలోని గనిలో అగ్నిప్రమాదం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రాథమిక సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించడంతో మంటలు వ్యాపించాయని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని