Hyderabad: మణిపుర్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న తెలంగాణ విద్యార్థులు

మణిపుర్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్‌ చేరుకున్నారు.

Updated : 08 May 2023 15:36 IST

హైదరాబాద్‌: మణిపుర్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్‌ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో విద్యార్థులను మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌ నుంచి శంషాబాద్‌ తీసుకొచ్చారు.  ఆయా విద్యార్థులను ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక బస్సుల్లోవారి స్వస్థలాలకు పంపారు.  తొలుత ఆదివారం సాయంత్రానికి వారిని తీసుకురావాల్సి ఉండగా.. అక్కడి పరిస్థితులు అనుకూలించక తరలింపు సోమవారానికి వాయిదా పడింది.

మణిపుర్‌లో అల్లర్లు, హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో అక్కడి ఐఐటీతో పాటు ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను, తెలంగాణవాసుల్ని సురక్షితంగా తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం శనివారమే అప్రమత్తమైంది. బాధితుల సహాయార్థం దిల్లీలోని తెలంగాణభవన్‌తో పాటు హైదరాబాద్‌లోనూ ప్రత్యేక కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌లు మణిపుర్‌ ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థులతో పాటు తెలంగాణవాసులు సుమారు 250 మంది ఉన్నట్లు గుర్తించారు. వారిని తరలించేందుకు ఆదివారం ఉదయం ప్రత్యేక విమానాన్ని పంపి సోమవారం మధ్యాహ్నానికి తీసుకొచ్చారు.

భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చూస్తాం: మంత్రి మల్లారెడ్డి

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ తీసుకొచ్చామని చెప్పారు. వారిని బస్సుల్లో స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.  విద్యార్థుల చదువులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని మంత్రి చెప్పారు. మణిపుర్‌లో పరిస్థితులు సాధారణ స్థాయికి రాకపోతే వాళ్ల చదువులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడే ఏదో ఒక ఏర్పాటు చేస్తామని తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని