TTD: ఆనంద నిలయం దృశ్యాలు.. పోస్టు చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు: తితిదే సీవీఎస్‌ఓ

తిరుమల ఆనంద నిలయం దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన ఘటనపై తితిదే సీవీఎస్‌ఓ స్పందించారు. సీసీటీవీల ద్వారా భక్తుడిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated : 08 May 2023 15:40 IST

తిరుమల: తిరుమల ఆనంద నిలయం దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీవీఎస్‌ఓ) నరసింహ కిషోర్‌ వెల్లడించారు. తితిదే నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంలోకి ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకెళ్లడం, వీడియో చిత్రీకరించడం చట్టపరంగా నేరం అనే విషయం భక్తులందరికీ తెలుసని అన్నారు. ఈ మేరకు ఘటనపై స్పందిస్తూ సీవీఎస్‌ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘ఆదివారం రాత్రి తిరుమలలో ఉరుములతో కూడిన వర్షం కురవడంతో దాదాపు రెండు గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో సదరు భక్తుడు లోపలికి తీసుకెళ్లిన పెన్‌ కెమెరాతో వీడియో చిత్రీకరించినట్లు అనుమానిస్తున్నాం. శ్రీవారి ఆలయంలో పాటించాల్సిన నిబంధనల గురించి భక్తులందరికీ తెలుసు. అయినప్పటికీ ఇలా చేయడం బాధాకరం. సీసీటీవీల ద్వారా భక్తుడిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాం. తితిదే ఈవో ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం’’ అని సీవీఎస్‌ఓ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు