RR vs SRH: అదంతా సందీప్‌ శర్మకు తెలుసు.. మరీ ఎక్కువగా ఆలోచించడం లేదు: సంజూ

ఈ సీజన్‌ రాజస్థాన్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను (RR vs SRH) ఘోరంగా ఓడించింది. అదీనూ ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇప్పుడు తమ సొంతమైదానంలో (జైపుర్‌) మాత్రం ఓటమిపాలైంది.

Published : 08 May 2023 11:29 IST

ఇంటర్నెట్ డెస్క్: ఒకే ఒక్క నో బాల్‌ మ్యాచ్‌ను పూర్తిగా మార్చేసింది. ఐపీఎల్ చరిత్రలో (IPL) సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అద్భుత విజయం అందించగా.. సొంత మైదానంలో రాజస్థాన్‌ రాయల్స్‌కు (RR vs SRH) చుక్కెదురైంది. ఆదివారం జైపుర్‌ వేదికగా రాజస్థాన్‌ - హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి బంతిని సందీప్‌ శర్మ ‘నో బాల్’గా వేశాడు. సన్‌రైజర్స్ బ్యాటర్ అబ్దుల్ సమద్ చక్కని సిక్స్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ క్రమంలో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగు పర్చుకుందామని భావించిన రాజస్థాన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆఖరి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించడంతోపాటు చివరి బంతి నోబాల్‌ కావడంపై రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ స్పందించాడు. 

‘‘ఐపీఎల్‌ మ్యాచ్‌లు అంటే ఇలానే ఉంటాయి. చివరి వరకు గెలిచేశామనే భ్రమలో ఉండకూడదు. ఫలితం ఎప్పుడైనా ఠక్కున మారిపోతుంది. ప్రత్యర్థి జట్టు కూడా విజయం కోసం పోరాడం సహజమే. సందీప్ శర్మపై నాకు నమ్మకం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్న మ్యాచ్‌ను (చెన్నైతో) సందీప్ గెలిపించాడు. అయితే, చివరి బంతి నో బాల్‌గా పడటంతో విజయం మా నుంచి దూరమైంది. కానీ, నో బాల్‌ గురించి మరీ ఎక్కువగా ఆలోచించడం లేదు. సందీప్ శర్మకు ఎలా బౌలింగ్‌ చేయాలో తెలుసు. చివర్లో మేం గెలిచినట్లు కాస్త సంబరం పడ్డాం కానీ, అయితే ఒకే ఒక్క బంతితో ఫలితం తారుమారు అయిపోయింది’’ అని సంజూ పేర్కొన్నాడు. 

రిషభ్‌ పంత్ తర్వాత యశస్వి

ప్రస్తుత సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రాజస్థాన్‌ యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్ హైదరాబాద్‌పైనా దూకుడుగానే ఆడాడు. కేవలం 18 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 35 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్‌లో 477 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో రెండో స్థానానికి చేరాడు. ఈ క్రమంలో తక్కువ వయసులోనే ఐపీఎల్‌లో వెయ్యి పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా అవతరించాడు. జైస్వాల్ 21 ఏళ్ల 130 రోజుల వయసులో 1000 పరుగుల మార్క్‌ను తాకాడు. రిషభ్‌ పంత్ 20 ఏళ్ల 218 రోజుల వయసులోనే ఈ ఫీట్‌ను సాధించి తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక దిల్లీ బ్యాటర్ పృథ్వీ షా (21 ఏళ్ల 130 రోజులు) మూడో స్థానంలో ఉన్నాడు. 

నాలుగులోనే రాజస్థాన్‌

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో (10 పాయింట్లు) ఉన్నప్పటికీ.. మిగతా మూడు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తేనే ఫ్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్‌కు (8 పాయింట్లు) కూడా ఛాన్స్‌లు మిగిలే ఉన్నాయి. చివరి నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి ఇతర జట్ల ఫలితాలను బట్టి ఎస్‌ఆర్‌హెచ్‌కు అవకాశం ఉంది.  గుజరాత్ (16 పాయింట్లు), చెన్నై (13 పాయింట్లు), లఖ్‌నవూ (11 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని