Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 23 Apr 2023 17:04 IST

1. ఆ భయంతోనే రేవంత్‌ కన్నీళ్లు: బండి సంజయ్‌ ఎద్దేవా

పదవి పోతుందేమోనన్న భయంతోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలతో ఆయన సతమతమవుతున్నారని విమర్శించారు. సంఘ సంస్కర్త మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి భాజపా నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. అందులో నాకు పెట్టుబడులు లేవు.. నిరూపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తా: బాలినేని

సినీరంగంలో పెట్టుబడుల ఆరోపణలపై ఏపీ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలో పెట్టుబడులున్నట్లు బాలినేనిపై విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ ఇటీవల ఐటీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.  ఈ నేపథ్యంలో బాలినేని స్పందిస్తూ వివరణ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రఘునందన్‌రావు వస్తే.. దగ్గరుండి సర్వే చేయిస్తా: మంత్రి నిరంజన్‌రెడ్డి

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 160 ఎకరాల్లో ఏర్పాటు చేసుకున్న ఫాంహౌస్‌లో ప్రభుత్వ, ఆర్డీఎస్‌ కోసం సేకరించిన భూములు ఉన్నాయని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన ఆరోపణలపై మంత్రి నిరంజన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆధారాల్లేకుండా తనపై అభాండాలు మోపడం సరికాదని మండిపడ్డారు. సాక్ష్యాధారాలుంటే చూపించాలని సవాల్‌ విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఎన్నిక ఫలితాల వివాదం.. స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు పగులకొట్టిన అధికారులు

జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్‌ రూమ్‌ను ఎన్నికల అధికారులు తెరిచారు. హైకోర్టు ఆదేశాలతో జగిత్యాలలోని వీఆర్‌కే కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌ తాళాలు పగలకొట్టి అందులోని రికార్డులను సేకరించారు. లెక్కింపునకు సంబంధించిన రికార్డులను అధికారులు న్యాయస్థానానికి తరలించారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఆర్‌సీబీలో సిరాజ్‌దే ‘ఇంపాక్ట్‌’ పాత్ర: ఇర్ఫాన్

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) విజయాల్లో పేసర్ మహమ్మద్ సిరాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు. సిరాజ్‌ ప్రదర్శనపై పఠాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. పవర్‌ప్లే ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ వేస్తున్న సిరాజ్‌.. సరైన సమయంలో వికెట్లు తీసి జట్టుకు అండగా నిలుస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. సెలబ్రిటీలకు ట్విటర్‌ ‘బ్లూ టిక్‌’ మళ్లీ వచ్చేసింది.. మరి వీరంతా డబ్బులు చెల్లించారా?

ఇటీవల సినీ, రాజకీయ, క్రీడలతో సహా పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఖాతాల ‘బ్లూ టిక్‌’ (Twitter Blue Tick)ను ట్విటర్‌ తొలగించింది. కేవలం ‘ట్విటర్‌ బ్లూ’ సర్వీస్‌లకు డబ్బులు చెల్లించిన వారికి మాత్రమే బ్లూ చెక్‌మార్క్‌ ఇచ్చింది. దీంతో చాలా మంది సెలబ్రిటీలు బ్లూ టిక్‌ను కోల్పోయారు. అయితే, ట్విటర్‌ యజమాని ఎలాన్ మస్క్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. అమృత్‌పాల్‌కు అన్ని దారులు మూసేశాం: ఐజీపీ సుఖ్‌చైన్‌ సింగ్‌ గిల్‌

అమృత్‌పాల్‌(Amritpal Singh)పై జారీ చేసిన నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ వారెంట్‌ను నేటి ఉదయం అమలు చేశామని పంజాబ్‌ (Punjab) ఐజీపీ సుఖ్‌చైన్‌ సింగ్‌ గిల్‌ పేర్కొన్నారు. ఉదయం 6.45 సమయంలో రోడె గ్రామంలోని గురుద్వారాలో అరెస్టు చేశామని ఆయన చెప్పారు. ఇందుకోసం పంజాబ్‌ పోలీసులు, ఇంటెలిజెన్స్‌ విభాగం సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. పూంచ్‌ ఘటనలో ఉగ్రవాదుల కోసం వేట తీవ్రం

పూంచ్‌ ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరుల కోసం సైన్యం వేటను మరింత తీవ్రం చేసింది. ఆర్మీ నార్తన్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ఆదివారం స్వయంగా ఉదమ్‌పూర్‌లోని కమాండ్‌ ఆసుపత్రిని సందర్శించారు. ఉగ్రదాడిలో గాయపడిన సైనికుడితో ఆయన మాట్లాడారు. ఇప్పటికే దాడి జరిగిన ప్రదేశాన్ని కూడా ద్వివేది పరిశీలించారు. ఆ ప్రాంతంలో భద్రతా పరిస్థితిని, దళాలు చేపట్టిన కూంబింగ్‌ ఆపరేషన్‌ను ఆయన సమీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. భారత్‌ పర్యటనకు చైనా రక్షణ మంత్రి

చైనా(China) రక్షణ మంత్రి లీషాంగ్‌ఫూ, రష్యా(Russia) డిఫెన్స్‌ మినిస్టర్‌ సెర్గీ షోయగులు భారత్‌లో పర్యటించనున్నారు. వీరు వచ్చే వారం న్యూదిల్లీలో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌(SCO) మీటింగ్‌లో పాల్గొనున్నారు. ఈ విషయాన్ని ఆయా దేశాలు ధ్రువీకరించాయి. ఎస్‌సీవో రక్షణ మంత్రుల సమావేశం ఏప్రిల్‌ 27, 28 తేదీల్లో భారత్‌లో జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

10. ‘15- 20 రోజుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది..!’

మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. అజిత్‌ పవార్‌ (Ajit Pawar) తన మద్దతుదారులతో కలిసి భాజపా (BJP)లో చేరతారనే ఊహాగానాలకు తోడు.. ముఖ్యమంత్రి పదవి ఇప్పుడే చేపట్టాలనుందంటూ ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని