Dharmapuri: ఎన్నిక ఫలితాల వివాదం.. స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు పగులకొట్టిన అధికారులు

జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్‌ రూమ్‌ తాళం చెవిని అధికారులు పగలకొట్టారు. అందులోని రికార్డులను హైకోర్టుకు తరలించారు.

Published : 23 Apr 2023 15:12 IST

ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్‌ రూమ్‌ను ఎన్నికల అధికారులు తెరిచారు. హైకోర్టు ఆదేశాలతో జగిత్యాలలోని వీఆర్‌కే కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌ తాళాలు పగలకొట్టి అందులోని రికార్డులను సేకరించారు. లెక్కింపునకు సంబంధించిన రికార్డులను అధికారులు న్యాయస్థానానికి తరలించారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌ మాట్లాడారు. ‘‘కలెక్టర్‌ సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరిచారు. స్ట్రాంగ్‌రూమ్‌లోని 4 ట్రంకుపెట్టెల తాళంచెవులు కూడా లేవు. వాటి తాళాలు కూడా పగలకొట్టారు. ఈ రికార్డులన్నింటినీ అధికారులు హైకోర్టుకు అందజేస్తారు. మాకు కోర్టులపై నమ్మకం ఉంది. తప్పక న్యాయం జరుగుతుంది’’ అని అన్నారు.

నాలుగున్నరేళ్లుగా లక్ష్మణ్‌ పోరాటం..

ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితాలపై 2018 నుంచి వివాదం కొనసాగుతోంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై దాదాపు నాలుగున్నరేళ్లుగా లక్ష్మణ్‌ పోరాటం చేస్తున్నారు. లక్ష్మణ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది. స్ట్రాంగ్‌ రూం తెరవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు.. ఈనెల 10న జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం) భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంను జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా సమక్షంలో తెరిచేందుకు ఏర్పాట్లు చేయగా తాళం చెవులు దొరకలేదు. మూడు గదుల్లో రెండోగది తాళం తెరచుకోవడంతో, అందులో పరిశీలించి వీడియో చిత్రీకరించారు.

మిగతా రెండు గదుల తాళాలు దొరక్కపోవడంతో మరమ్మతులు చేసే వ్యక్తిని పిలిపించడం లేదా పగలగొట్టాలని భావించారు. ఇందుకు కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అంగీకరించలేదు. దీంతో తెరిచిన గదితోపాటు మిగతా రెండు గదులకు అధికారులు సీల్‌ వేశారు. మూడు స్ట్రాంగ్‌ రూంలలో కేవలం ఒక గది మాత్రమే తెరుచుకుంది. అందులో 108 నుంచి 269 పోలింగ్‌ కేంద్రాల ఓటింగ్‌ యంత్రాలు భద్రంగా ఉన్నాయి. మిగతా రెండు గదుల తాళాలు తెరచుకోలేదు. దీనిపై జిల్లా కలెక్టర్‌ న్యాయస్థానానికి నివేదించారు. స్పందించిన హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రంగంలోకి దిగి స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు పగలకొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని