Poonch: పూంచ్‌ ఘటనలో ఉగ్రవాదుల కోసం వేట తీవ్రం

పూంఛ్‌ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిపై సైన్యం ఆపరేషన్‌ను తీవ్రతరం చేసింది. దాదాపు 16 మందిని అదుపులోకి తీసుకొంది. ఘటనా స్థలం నుంచి మరికొన్ని తూటాలను స్వాధీనం చేసుకొంది.  

Published : 23 Apr 2023 15:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పూంఛ్‌ ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరుల కోసం సైన్యం వేటను మరింత తీవ్రం చేసింది. ఆర్మీ నార్తన్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ఆదివారం స్వయంగా ఉదమ్‌పూర్‌లోని కమాండ్‌ ఆసుపత్రిని సందర్శించారు. ఉగ్రదాడిలో గాయపడిన సైనికుడితో ఆయన మాట్లాడారు. ఇప్పటికే దాడి జరిగిన ప్రదేశాన్ని కూడా ద్వివేది పరిశీలించారు. ఆ ప్రాంతంలో భద్రతా పరిస్థితిని, దళాలు చేపట్టిన కూంబింగ్‌ ఆపరేషన్‌ను ఆయన సమీక్షించారు. 

మరోవైపు ఉగ్రదాడి జరిగిన ప్రదేశం నుంచి మరిన్ని తూటాలను స్వాధీనం చేసుకొన్నారు.  పూంఛ్‌ - రాజౌరీ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను ఆదివారం ఉదయం నుంచి పునరుద్ధరించారు. ఈ మార్గాన్ని గురువారం నుంచి మూసివేసిన విషయం తెలిసిందే. దాడి జరిగిన వెంటనే ఈ మార్గంలోని ట్రాఫిక్‌ను పూర్తిగా మళ్లించారు. వెంటనే ఇక్కడ సైనిక ఆపరేషన్‌ మొదలుపెట్టారు. మొత్తం 14-16 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారిలో ఇక్బాల్‌-ముదిఫా, సలీం దిన్‌ - రషీదా అనే రెండు జంటలను కూడా అదుపులోకి తీసుకొన్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. 

ఈ ప్రాంతంలో జమ్మూ కశ్మీర్‌ ఘజ్నవీ ఫోర్స్‌ (జేకేజీఎఫ్‌) అనే ఉగ్రసంస్థ చురుగ్గా ఉంది. దాని కమాండర్‌ రఫీక్‌ అహ్మద్‌ అలియాస్‌ రఫీక్‌ నాయక్‌ ఈ ప్రాంతానికి చెందినవాడే. రాజౌరీ, పూంఛ్‌ జిల్లాల్లో కనీసం మూడు నుంచి నాలుగు ఉగ్రముఠాలు చురుగ్గా పనిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

గురువారం భింబర్‌ గలీ నుంచి సాంగియోట్‌కు ఇఫ్తార్‌ విందు కోసం పండ్లను తీసుకెళుతున్న సైనిక వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మరణించారు. ఈ దాడికి పీఏఎఫ్‌ఎఫ్‌ అనే సంస్థ బాధ్యత తీసుకొన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, సైన్యం మాత్రం జైషే, లష్కరే సంస్థల క్షేత్రస్థాయి ఉగ్రవాదులు కలిసి దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు కనీసం ఏడాది నుంచి ఉన్నట్లు సైన్యం భావిస్తోంది. దీంతో వారికి ఇక్కడి భౌగోళిక పరిస్థితులపై పూర్తిగా అవగాహన ఉందని పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని