Twitter Blue Tick: సెలబ్రిటీలకు ట్విటర్‌ ‘బ్లూ టిక్‌’ మళ్లీ వచ్చేసింది.. మరి వీరంతా డబ్బులు చెల్లించారా?

శుక్రవారం ట్విటర్‌ బ్లూ టిక్‌ కోల్పోయిన అనేక మంది సెలబ్రిటీలు ఆదివారం తిరిగి వాటిని పొందారు. మరి వీరంతా ట్విటర్‌ బ్లూ సేవలను డబ్బులు చెల్లించారా.. లేదా.. తెలియదు.

Published : 23 Apr 2023 15:26 IST

వాషింగ్టన్‌: ఇటీవల సినీ, రాజకీయ, క్రీడలతో సహా పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఖాతాల ‘బ్లూ టిక్‌’ (Twitter Blue Tick)ను ట్విటర్‌ తొలగించింది. కేవలం ‘ట్విటర్‌ బ్లూ’ సర్వీస్‌లకు డబ్బులు చెల్లించిన వారికి మాత్రమే బ్లూ చెక్‌మార్క్‌ ఇచ్చింది. దీంతో చాలా మంది సెలబ్రిటీలు బ్లూ టిక్‌ను కోల్పోయారు. అయితే, ట్విటర్‌ యజమాని ఎలాన్ మస్క్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్లూ టిక్‌ (Twitter Blue Tick)ను ఇచ్చే విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

కనీసం 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల ఖాతాలకు బ్లూ టిక్‌ (Twitter Blue Tick)ను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం బ్లూ చెక్‌మార్క్‌ కోల్పోయిన చాలా మంది ప్రముఖుల ఖాతాల్లో ఆదివారం తిరిగి అది కనిపించడం గమనార్హం. బాలీవుడ్ తారలు షారుక్‌ ఖాన్‌, అలియా భట్‌, క్రికెటర్లు కోహ్లీ, ధోనీ సహా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, బిలియనీర్‌ బిల్‌ గేట్స్‌, రాజకీయ ప్రముఖులు రాహుల్‌ గాంధీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటి వారి ట్విటర్‌ ఖాతాలన్నింటికీ ఇప్పుడు బ్లూ టిక్‌ మార్క్‌ ఉండడం గమనార్హం. వీరంతా రెండు రోజుల క్రితం బ్లూ చెక్‌ మార్క్‌ కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు. అయితే, వీరంతా డబ్బులు చెల్లించి ట్విటర్‌ బ్లూ సేవలను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారా? అనే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు.

మరోవైపు దివంగతులైన కొందరు ప్రముఖుల ఖాతాలకు సైతం బ్లూ టిక్‌ (Twitter Blue Tick) తిరిగి రావడం గమనార్హం. పైగా వారు ట్విటర్‌ బ్లూను సబ్‌స్క్రైబ్‌ చేసుకొని డబ్బులు చెల్లించారని టిక్‌పై క్లిక్‌ చేసినప్పుడు కనిపిస్తోంది. ఇలా బ్లూ టిక్‌ పొందిన వారిలో దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌, ప్రముఖ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌, రిషి కపూర్‌, గాయకుడు మైకేల్‌ జాక్స్‌, బాస్కెట్‌బాల్‌ ఆటగాడు కోబే బ్రయంట్‌, క్రికెటర్‌ షేన్‌ వార్న్ వంటి ప్రముఖుల ఖాతాలు ఉన్నాయి. అయితే, ట్విటర్‌ సహ- వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సేకు ట్విటర్‌లో 6.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కానీ, ఆయన ఖాతాలో మాత్రం ఇప్పటికీ బ్లూ టిక్‌ కనిపించడం లేదు.

కొంతమంది ట్విటర్‌ ఖాతాలను తానే వ్యక్తిగతంగా చెల్లించి ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ సేవలను అందిస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ చెప్పారు. లెబ్రాన్‌ జేమ్స్‌, విలియం శాట్నర్‌, స్టీఫెన్‌ కింగ్‌ వంటి వారి ఖాతాలకు తానే స్వయంగా డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. వీరంతా తాము ట్విటర్‌ బ్లూను సబ్‌స్క్రైబ్‌ చేసుకోబోమని బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని