Amritpal Singh: అమృత్‌పాల్‌కు అన్ని దారులు మూసేశాం: ఐజీపీ సుఖ్‌చైన్‌ సింగ్‌ గిల్‌

అమృత్‌పాల్‌ (Amritpal Singh) అరెస్టుపై పంజాబ్‌ పోలీసులు వివరాలు వెల్లడించారు. అతడు లొంగిపోలేదని.. తామే అరెస్టు చేశామని ఐజీపీ పేర్కొన్నారు. గురుద్వారా పవిత్రతను కాపాడేందుకు తాము లోపలికి వెళ్లలేదని వివరణ ఇచ్చారు. 

Updated : 23 Apr 2023 12:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమృత్‌పాల్‌(Amritpal Singh)పై జారీ చేసిన నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ వారెంట్‌ను నేటి ఉదయం అమలు చేశామని పంజాబ్‌ (Punjab) ఐజీపీ సుఖ్‌చైన్‌ సింగ్‌ గిల్‌ పేర్కొన్నారు. ఉదయం 6.45 సమయంలో రోడె గ్రామంలోని గురుద్వారాలో అరెస్టు చేశామని ఆయన చెప్పారు. ఇందుకోసం పంజాబ్‌ పోలీసులు, ఇంటెలిజెన్స్‌ విభాగం సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టాయన్నారు. పంజాబ్‌ పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం ఆధారంగానే ఈ అరెస్టు జరిగిందన్నారు. రోడెలోని గురుద్వారా పవిత్రతకు భంగం వాటిల్లకూడదని తాము లోపలకు ప్రవేశించలేదని వివరించారు. అతడిని డిబ్రూగఢ్‌కు తరలించి ఈ కేసులో చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని వెల్లడించారు. అతడు లొంగిపోయాడనే ప్రచారాన్ని ఐజీపీ తోసిపుచ్చారు. అతడి గురించి ఎవరు ఏమి చెబుతున్నారో తమకు సమాచారం లేదన్నారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాలు అత్యంత సమన్వయంతో ఈ ఆపరేషన్‌ నిర్వహించినట్లు వెల్లడించారు.

అమృత్‌పాల్‌ అరెస్టు ఆపరేషన్‌ను నిన్న రాత్రి నుంచి పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ స్వయంగా పర్యవేక్షించినట్లు సమాచారం. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోలీసులు అమృత్‌పాల్‌ను చుట్టుముట్టినట్లు సీఎంకు సమాచారం అందిందని ఆంగ్లపత్రికల కథనాలు పేర్కొన్నాయి. 

మరోవైపు అస్సాంలోని డిబ్రూగఢ్‌ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే మోహన్‌బారీ విమానాశ్రయం భద్రతా దళాలతో నిండిపోయింది. అమృత్‌పాల్‌ను ప్రత్యేక విమానంలో పంజాబ్‌ నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు. విమానాశ్రయంలో ప్రత్యేక పోలీసు బృందాలు అతడిని తమ ఆధీనంలోకి తీసుకుని డిబ్రూగఢ్‌ సెంట్రల్‌ జైలుకు తరలిస్తాయి. ఈ తరలింపు నేపథ్యంలో  వివిధ అంచెల భద్రతను కల్పించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు