Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 24 Mar 2024 16:59 IST

1. వైకాపాను వీడి కాంగ్రెస్‌లో చేరిన చింతలపూడి ఎమ్మెల్యే

మరో ఎమ్మెల్యే వైకాపాను వీడారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఆదివారం వైకాపాను వీడి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల.. కాంగ్రెస్‌ కండువా కప్పి ఎలీజాను పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ ఉదయం తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ భాజపాలో చేరిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఆశావహుల చివరి ప్రయత్నాలు.. చంద్రబాబు నివాసానికి క్యూ కట్టిన నేతలు

తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసం వద్ద ఆశావహుల సందడి నెలకొంది. ఆఖరి జాబితాలో చోటు దక్కించుకునేందుకు ఆశావహులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎం.ఎస్‌ రాజుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు నివాసానికి మందకృష్ణ మాదిగ వచ్చారు. డేగల ప్రభాకర్‌ను వెంటబెట్టుకొని వచ్చిన గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ చంద్రబాబును కలిశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ఈవీలతో సిద్ధమవుతున్న వాహన తయారీ సంస్థలు

దేశీయ వాహన తయారీ సంస్థలు వివిధ రకాల విద్యుత్తు వాహనాలను (Electric Vehicles) మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. స్వచ్ఛ ఇంధన వాహనాలకు ప్రభుత్వం నుంచీ దన్ను లభిస్తోంది. ఇటీవలే కేంద్రం ఇ-మొబిలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ 2024ను తీసుకొచ్చింది. 2024 ఏప్రిల్‌ నుంచి 4 నెలల కోసం రూ.500 కోట్లు కేటాయించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. భారీ ‘కిడ్నాప్‌’ కథ సుఖాంతం.. 300 మంది చిన్నారుల విడుదల!

ఆఫ్రికా దేశమైన నైజీరియా (Nigeria)లో దాదాపు 300 మంది విద్యార్థుల అపహరణ వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. రెండు వారాల తర్వాత కిడ్నాపర్లు వారిని సురక్షితంగా విడిచిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా ఏజెన్సీల సమన్వయం, వ్యూహరచనతో ఇది సాధ్యమైనట్లు స్థానిక గవర్నర్‌ తెలిపారు. పిల్లలను క్షేమంగా వెనక్కి తీసుకురావడంలో దేశాధ్యక్షుడు బోలా టినుబు చొరవ చూపారని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. సీఎం గేట్లు తెరావాల్సింది నేతల కోసం కాదు.. రైతుల కోసం: హరీశ్‌రావు

సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) గేట్లు తెరావాల్సింది నేతల కోసం కాదు.. రైతుల కోసమని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. చేరికల కోసం భారాస ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్తున్న సీఎం... రైతులు చనిపోతుంటే పరామర్శించేందుకు మాత్రం వెళ్లడం లేదని విమర్శించారు. జనగామ జిల్లా దేవరుప్పలలో ఆదివారం ఆయన పర్యటించారు. ఎండిన పంటలు పరిశీలించి, రైతులతో మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. నా వారసులుగా రాజకీయాల్లో రావాలంటే.. కుమారులకు గడ్కరీ కీలక సూచన

సార్వత్రిక ఎన్నికల్లో (LokSabha Elections 2024) ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగ్‌పుర్‌ (Nagpur)లో భాజపా (BJP) నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తన రాజకీయ వారసత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా.. 31న ఇండియా కూటమి ‘మెగా మార్చ్‌’

ఆప్‌ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అరెస్టును నిరసిస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి మెగా మార్చ్‌కు సిద్ధమైంది. దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మార్చి 31న కేజ్రీవాల్‌కు సంఘీభావంగా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపింది. విపక్ష కూటమిలో ఉన్న కాంగ్రెస్‌, ఆప్‌లు దిల్లీలో ఆదివారం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతుండగా షార్ట్‌సర్క్యూట్‌.. ఒకే ఇంట్లో నలుగురు చిన్నారుల మృతి

సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతుండగా షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పెను విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ విషాదం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరిగింది. మొబైల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతుండగా షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగి బెడ్‌షీట్‌కు అంటుకున్నట్లు మృతి చెందిన చిన్నారుల తండ్రి జానీ తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణను పరిశీలిస్తున్నాం: పాక్‌

భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణపై తీవ్రంగా ఆలోచిస్తున్నామని పాక్‌ (Pakistan) విదేశాంగ మంత్రి ఇస్సాక్‌ దార్‌ తెలిపారు. శనివారం లండన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘మా దేశ వాణిజ్యవేత్తలు భారత్‌తో వ్యాపారాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది’’ అని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. చైనా చమురు ట్యాంకర్‌పై హూతీల దాడి..!

 చైనాకు చెందిన ఓ చమురు ట్యాంకర్‌పై హూతీలు బాలిస్టిక్‌ క్షిపణితో దాడి చేశారు. ఈ ఘటన శనివారం ఎర్ర సముద్రంలో చోటు చేసుకొంది. అమెరికాకు చెందిన సెంట్రల్‌ కమాండ్‌, యూకే మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ దీనిని ధ్రువీకరించాయి. ఈ దాడి కారణంగా నౌకలో మంటలు ఎగసినట్లు పేర్కొన్నాయి. కానీ, వేగంగా స్పందించి అర్ధగంటలోనే వీటిని ఆర్పేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని