Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 08 Jun 2023 21:28 IST

1. జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం: మంత్రి బొత్స

రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈనెల 12న పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్‌.. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్‌లను అందజేస్తారని తెలిపారు. సుమారు రూ.2500తో జగనన్న విద్యా కానుక కిట్‌లు ఇస్తున్నట్టు చెప్పారు. టెన్త్‌, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సీఎం చేతుల మీదుగా సత్కరిస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. వివేకా హత్యకేసులో 8వ నిందితుడిగా అవినాష్‌రెడ్డి: సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దని ఈనెల 5న దాఖలు చేసిన కౌంటర్‌లో సీబీఐ పలు కీలక విషయాలు ప్రస్తావించింది. వైఎస్‌ అవినాష్‌రెడ్డిని ఈ కేసులో సీబీఐ ఎనిమిదో నిందితుడిగా చేర్చింది. గతంలో దాఖలు చేసిన కౌంటర్‌లో అవినాష్‌రెడ్డిని సహనిందితుడిగా పేర్కొన్నారు తప్ప ఎక్కడా కూడా నిందితుడిగా చెప్పలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. వయనాడ్‌ ఉపఎన్నికకు ఈసీ ఏర్పాట్లు.. ఇది రాజకీయ కుట్ర: కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై (Rahul Gandhi) అనర్హత వేటు వేయడంతో ఖాళీ అయిన వయనాడ్‌ (Wayanad) లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇప్పటి వరకు అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల కానప్పటికీ.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఈవీఎం, వీవీప్యాట్‌లను సిద్ధం చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ప్రధాని మోదీని కలిసిన ఓపెన్‌ఏఐ సీఈవో.. ఏఐపై చర్చ!

చాట్‌జీపీటీ (ChatGPT) మాతృసంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) ప్రధాని మోదీని కలిశారు. కొద్దిరోజుల క్రితం భారత్‌కు వచ్చిన శామ్‌.. చాట్‌జీపీటీ గురించి టెక్‌ నిపుణులు, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన గురువారం ప్రధాని మోదీతో కొద్ది నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఈ సమావేశం ఎంతో గొప్పగా జరిగిందని శామ్‌ చెప్పినట్లు ఓ జాతీయ వార్తా సంస్థ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. రూ.749కే జియోట్యాగ్‌.. రిలయన్స్‌ జియో నుంచి మరో కొత్త పరికరం

తక్కువ ధరకే జియోఫోన్‌, వైఫై రూటర్లను తీసుకొచ్చిన రిలయన్స్‌ జియో (Reliance Jio) ఇప్పుడు మరో కొత్త పరికరాన్ని పరిచయం చేసింది. యాపిల్‌ ఎయిర్‌ట్యాగ్‌, శామ్‌సంగ్‌ స్మార్ట్‌ట్యాగ్‌ తరహాలో ‘జియోట్యాగ్‌’ (JioTag) పేరిట బ్లూటూత్‌ ట్రాకర్‌ (Bluetooth tracker)ను తీసుకొచ్చింది. తాళంచెవి, పర్స్‌లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు మర్చిపోయే అలవాటున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. చిన్నారి కథ విషాదాంతం.. 52 గంటలు శ్రమించినా దక్కని ఫలితం!

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో బోరుబావి (Borewell)లో పడిపోయిన రెండున్నరేళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. రెండు రోజులకుపైగా శ్రమించిన అధికారులు చివరకు ఆమెను వెలికితీసినా.. ఆస్పత్రికి తరలించిన అనంతరం చనిపోయినట్లు ప్రకటించారు. మంగళవారం ఆమె బోరుబావిలో పడిపోగా.. నిరంతర సహాయక చర్యలు చేపట్టి గురువారం సాయంత్రానికి బయటకు వెలికితీశారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. విదేశాల్లో భారత్‌ను విమర్శించడం.. రాహుల్‌ గాంధీకి అలవాటే!

విదేశాలకు వెళ్లినప్పుడు భారత్‌పై విమర్శలు గుప్పించడం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి అలవాటేనని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ పేర్కొన్నారు. దేశ అంతర్గత విషయాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తావించడం దేశ ప్రయోజనం కాదని మండిపడ్డారు. అమెరికాలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన జై శంకర్‌.. యావత్‌ ప్రపంచం మనల్ని గమనిస్తోందని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ప్రమాద సమయంలో రైల్లోని దృశ్యాలు వైరల్‌..!

ఒడిశా రైలు దుర్ఘటనతో దేశం దిగ్భ్రాంతికి గురైంది. ప్రయాణికుల రైళ్లు ప్రమాదానికి గురికావడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. అయితే ఈ ప్రమాదం జరుగుతోన్న సమయంలోని దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బాలేశ్వర్ వద్ద ఘోర ప్రమాదం జరుగుతున్న సమయంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో ఉన్న ప్రయాణికుడు ఒకరు ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. అటు విధులు.. ఇటు మాతృత్వపు బాధ్యతలు.. పార్లమెంట్‌లో బిడ్డకు పాలిచ్చిన ఎంపీ

ఒకవైపు వృత్తిగత బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు మాతృత్వాన్ని ఆస్వాదించారు ఇటలీకి చెందిన పార్లమెంటేరియన్‌  గిల్దా స్పోర్టియెల్లో. ఆమె దిగువ సభలో రోజుల వయస్సున్న తన బిడ్డకు పాలుపట్టారు. మాతృత్వం వల్ల ఉద్యోగ జీవితంలో మహిళలు వెనకడుగు వేయకూడదనే ఉద్దేశంతో, అదే సమయంలో తన బాధ్యతలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఆమె వ్యవహించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. వరదలో కొట్టుకొస్తున్న మందుపాతరలు.. ఆ డ్యామ్‌ ఓ టైం బాంబ్‌..!

యుద్ధ ప్రభావిత దక్షిణ ఖేర్సన్‌ వద్ద కఖోవ్కా డ్యాం వరదలో మునిగిన ప్రదేశాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఉక్రెయిన్‌, రష్యా దళాలు అమర్చిన యాంటీ ట్యాంక్‌ మైన్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఇవి ఎక్కడి వెళ్లాయో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సహాయక బృందాలకు  ప్రాణాంతకంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని