JioTag: రూ.749కే జియోట్యాగ్.. రిలయన్స్ జియో నుంచి మరో కొత్త పరికరం
JioTag: తరచూ మర్చిపోయే అవకాశం ఉన్న వస్తువులకు జియోట్యాగ్‌ను తగిలించాలి. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన జియోథింగ్స్ యాప్ (JioThings App)కి కనెక్ట్ చేయాలి.
ఇంటర్నెట్ డెస్క్: తక్కువ ధరకే జియోఫోన్, వైఫై రూటర్లను తీసుకొచ్చిన రిలయన్స్ జియో (Reliance Jio) ఇప్పుడు మరో కొత్త పరికరాన్ని పరిచయం చేసింది. యాపిల్ ఎయిర్‌ట్యాగ్, శామ్‌సంగ్ స్మార్ట్‌ట్యాగ్ తరహాలో ‘జియోట్యాగ్’ (JioTag) పేరిట బ్లూటూత్ ట్రాకర్ (Bluetooth tracker)ను తీసుకొచ్చింది. తాళంచెవి, పర్స్‌లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు మర్చిపోయే అలవాటున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
జియోట్యాగ్ (JioTag) తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.2,199గా జియో పేర్కొంది. కానీ, ప్రస్తుతం వెల్‌కమ్ ఆఫర్ కింద రూ.749కే అందిస్తోంది. జియో, రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్లలో ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంది. తెలుపు రంగులో ఉన్న ఈ చిన్న గ్యాడ్జెట్ బరువు 9.5 గ్రాములు. దీని పరిమాణం 38.2mm x 38.2mm x 7.2mm. తరచూ మర్చిపోయే అవకాశం ఉన్న వస్తువులకు దీన్ని తగిలించాలి. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన జియోథింగ్స్ యాప్ (JioThings App)కి కనెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు జియోట్యాగ్ (JioTag) తగిలించిన వస్తువును వదిలి నిర్దేశిత దూరం దాటి వెళ్లిపోతే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.
ఇండోర్‌లో 20 మీటర్లు, అవుట్‌డోర్‌లో 50 మీటర్ల వరకు ఈ జియోట్యాగ్ (JioTag) పనిచేస్తుంది. దీంట్లో మార్చుకోగలిగే CR2032 బ్యాటరీ ఉంది. దీనికి ఏడాది వారెంటీ ఇస్తున్నారు. జియోట్యాగ్‌ను పరికరాలను సులభంగా అటాచ్ చేసేలా ఒక కేబుల్‌ను కూడా అందిస్తున్నారు. జియోట్యాగ్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కూడా ట్రాక్ చేయొచ్చు. సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ.. జియోట్యాగ్‌ను రెండుసార్లు ట్యాప్ చేస్తే ఫోన్ మోగుతుంది.
పరికరాల ట్రాకింగ్‌తో పాటు జియోట్యాగ్ (JioTag) తీసుకున్నవారికి జియో ఒక ప్రత్యేక సేవను అందిస్తోంది. జియోట్యాగ్ తగిలించిన పరికరాన్ని ఎవరైనా దొంగిలిస్తే దాన్ని జియోథింగ్స్ యాప్‌లోని జియో కమ్యూనిటీలో రిపోర్ట్ చేయొచ్చు. తద్వారా పరికరం చివరిసారి నెట్‌వర్క్‌కు అందుబాటులో ప్రాంతాన్ని ఫోన్‌కు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.