Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Jul 2023 21:07 IST

1. పాఠశాలల పనివేళల్లో మార్పులు

తెలంగాణలో పాఠశాలల పనివేళల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమయ్యేలా మార్పులు తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ప్రాథమిక పాఠశాలలు, ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉన్నత పాఠశాలలు పనిచేయనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. హైదరాబాద్‌లో భారీ వర్షం

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) పరిధిలో భారీ వర్షం దంచికొడుతోంది. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని సూచించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. భారీ వర్షాలు.. పోలీసులు సూచిస్తున్న జాగ్రత్తలివే..!

హైదరాబాద్‌ జంట నగరాల్లో భారీ వర్షం (Hyderabad Heavy Rains) కురుస్తోంది. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని, ఇళ్లలోనే ఉండాలని జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు నేపథ్యంలో సురక్షితంగా ఉండేలా రాచకొండ పోలీసులు (Rachakonda Police) ప్రజలకు కొన్ని జాగ్రత్తలను సూచించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. భారాసలో చేరిన భువనగిరి డీసీసీ అధ్యక్షుడు

యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌రెడ్డి భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)లో చేరారు. ఇవాళ భువనగిరి పట్ణణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన కీలక సమావేశం ఏర్పాటు చేశారు. భువనగిరి నియోజకవర్గంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేస్తున్నది తప్పని అనిల్ కుమార్ రెడ్డి బహిరంగంగానే ఆరోపణలు చేశారు. తన అనుచరులతో సమావేశం నిర్వహించిన అనంతరం అనిల్‌ కుమార్‌రెడ్డి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. పోలవరం తొలిదశ మిగిలిన పనులకు అదనంగా రూ.12,911 కోట్లు!

పోలవరం తొలిదశ నిర్మాణానికి మిగిలిన పనుల కోసం అదనంగా రూ.12,911 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. వైకాపా పార్లమెంటరీ నేత అడిగిన ప్రశ్నకు.. రాజ్యసభలో కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నిధుల విడుదలకు అభ్యంతరం లేదని ఆర్థికశాఖ తెలిపినట్లు వివరించింది. ఈ మేరకు పోలవరం నిధులపై గత నిర్ణయాన్ని సవరిస్తూ మంత్రివర్గం తాజా ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. పవన్‌ కల్యాణ్‌పై క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలైంది. విజయవాడ సిటీ సివిల్ కోర్టులో ఓ మహిళా వాలంటీర్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్ర సభలో వాలంటీర్లపై పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు మానసికంగా ఇబ్బందికి గురి చేశాయని పిటిషన్‌లో వివరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్లపై ఆరోపణలు చేశారని పిటిషనర్‌ పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. పాఠశాల బస్సు బోల్తా.. 30 మంది విద్యార్థులకు గాయాలు

మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం మండలంలో ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. పాఠశాల నుంచి బయలుదేరిన బస్సు.. కేసముద్రం క్రాస్‌ రోడ్డు వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులు భయంతో ఒక్కసారిగా కేకలు వేశారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ అక్కడినుంచి పరారయ్యాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర: శివకుమార్‌

కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ (Karnataka Assembly) ఎన్నికల్లో భాజపాను ఓడించి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలలకే ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్రం బయట కుట్ర జరుగుతోందని అన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. చర్చకు నువ్వే దూరం.. కాదు నువ్వే.. కాంగ్రెస్‌, భాజపా పరస్పర విమర్శలు

మణిపుర్ అల్లర్లు పార్లమెంట్‌ లోపల, బయట అగ్గి రాజేస్తున్నాయి. ఆ రాష్ట్రంలో మహిళలపై చోటు చేసుకున్న అఘాయిత్యాలపై ప్రధాని మోదీ మాట్లాడకుండా భాజపా రక్షణ కవచంలా పని చేస్తోందంటూ కాంగ్రెస్‌ విమర్శించగా.. తన బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ చర్చకు దూరంగా ఉంటోందని భాజాపా తిప్పికొట్టింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. చైనా ఆర్థిక వ్యవస్థ డీలా.. అంగీకరించిన ముఖ్య నేతలు

కొవిడ్‌ అధ్యాయం ముగిసిన తరువాత నుంచి చైనా (China) ఆర్థిక వ్యవస్థ (Economy) ‘నూతన సవాళ్లు, ఇబ్బందులు’ ఎదుర్కొంటోందని ఆ దేశ అగ్రనాయకులు పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన ‘24 పర్సన్‌ పొలిట్‌ బ్యూరో’లో ఈ అభిప్రాయం వ్యక్తమైనట్లు ఆ దేశ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఏటా జులై నెల చివర్లో నేతలు ఇలా సమావేశమవుతారు. ఆగస్టులో వచ్చే సంప్రదాయ వేసవి విరామానికి ముందు దేశ ఆర్థిక పరిస్థితిని వారు సమీక్షిస్తారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని