Manipur Violence: చర్చకు నువ్వే దూరం.. కాదు నువ్వే.. కాంగ్రెస్‌, భాజపా పరస్పర విమర్శలు

మణిపుర్‌ అల్లర్లపై చర్చకు నువ్వే దూరంగా ఉన్నావంటే.. నువ్వే దూరంగా ఉన్నావ్‌ అంటూ కాంగ్రెస్‌, భాజపాలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి.

Updated : 24 Jul 2023 20:44 IST

దిల్లీ: మణిపుర్ అల్లర్లు పార్లమెంట్‌ లోపల, బయట అగ్గి రాజేస్తున్నాయి. ఆ రాష్ట్రంలో మహిళలపై చోటు చేసుకున్న అఘాయిత్యాలపై ప్రధాని మోదీ మాట్లాడకుండా భాజపా రక్షణ కవచంలా పని చేస్తోందంటూ కాంగ్రెస్‌ విమర్శించగా.. తన బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ చర్చకు దూరంగా ఉంటోందని భాజాపా తిప్పికొట్టింది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సమాధానం చెప్పాల్సి వస్తుందనే కారణంతోనే  హస్తం పార్టీ చర్చకు దూరంగా ఉంటోందని భాజపా విమర్శించింది.

దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌ అధికార భాజపాపై మండి పడ్డారు. ‘‘ ప్రధాని మోదీ అమెరికన్‌ కాంగ్రెస్‌లో ప్రసంగిస్తారు. కానీ భారత పార్లమెంట్‌లో మాత్రం మాట్లాడరు. ఫ్రాన్స్‌ ప్రధాని మేక్రాన్‌ను ఆలింగనం చేసుకుంటారు. కానీ, మణిపుర్‌ అల్లర్ల బాధితులను మాత్రం చేరదీయరు.’’ అని విమర్శించారు. ప్రధాని మోదీని పార్లమెంట్‌లో మాట్లాడనీయకుండా భాజపా ఎంపీలు ఓ రక్షణ కవచంలా పని చేస్తున్నారని, మణిపుర్ అల్లర్లను ఓ సాధారణ శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చేసే ప్రధాని మోదీ.. ఇంత స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ను మాత్రం వెనకేసుకు వస్తున్నారని, అందులో మతలబేంటని గొగోయ్‌ ప్రశ్నించారు.

అందుకే సంజయ్‌ని సస్పెండ్‌ చేశారు: ఆప్‌

మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్ల గురించి పార్లమెంట్‌లో విస్త్రృత చర్చ జరగాలని గొగోయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష సభ్యుల కంటపడకుండా ప్రధాని మోదీ పారిపోతున్నారని విమర్శించారు. మణిపుర్‌ అల్లర్లపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ నిండు పార్లమెంట్‌లో అబద్ధాలు చెబుతున్నారని గుజరాత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శక్తిసిన్హ గోహిల్‌ ఆరోపించారు. ఇంకెన్ని రోజులు ఈ దేశాన్ని తప్పుదోవపట్టిస్తారని ఆయన ప్రశ్నించారు. 

మహిళలపై నేరాలతో కాంగ్రెస్‌ రాజకీయం: స్మృతి ఇరానీ

కాంగ్రెస్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. మహిళలపై జరుగుతున్న నేరాలతో కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మణిపుర్‌ ఘటనలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ తప్పించుకు తిరుగుతోందన్నారు. ఒకవేళ మణిపుర్‌ పరిస్థితులపై చర్చిస్తే... కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అల్లర్ల గురించి సమాధానం చెప్పాల్సి వస్తుందని కాంగ్రెస్‌కు తెలుసని, అందుకే చర్చకు ఆమడ దూరంలో ఉంటోందని ఆమె అన్నారు. మహిళలను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.

మణిపుర్‌ అల్లర్లపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌, కాంగ్రెసేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న ఘోరాల గురించి ఆరా తీసింది. కాంగ్రెస్‌ పాలిస్తున్న రాజస్థాన్‌, తృణమూల్‌ అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్ గురించి విపక్షాలు ఎందుకు గొంతువిప్పడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతున్నాయని  కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అనురాగ్‌ ఠాకూర్‌ విమర్శించారు. మణిపుర్‌లో ఇద్దరు మహిళలపై జరిగిన అమానవీయ చర్య గురించి తెలిసిన వెంటనే నేరస్తులపై భాజపాసర్కార్‌ కఠినచర్యలు తీసుకుందన్నారు. నేరస్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ ఇదివరకే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని