Ts Schools: పాఠశాలల పనివేళల్లో మార్పులు.. విద్యాశాఖ ఉత్తర్వులు

తెలంగాణలో పాఠశాలల పనివేళల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమయ్యేలా మార్పులు తీసుకొచ్చింది.

Updated : 24 Jul 2023 20:23 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పాఠశాలల పనివేళల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమయ్యేలా మార్పులు తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ప్రాథమిక పాఠశాలలు, ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉన్నత పాఠశాలలు పనిచేయనున్నాయి. జంట నగరాల (హైదరాబాద్‌-సికింద్రాబాద్) పరిధిలో మినహా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల వేళల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్‌జేడీఎస్‌ఈలకు విద్యాశాఖ పంపించింది. వారి పరిధిలోని ఎంఈవోలు, హెడ్‌మాస్టర్లు, పాఠశాలల యాజమాన్యాలకు సమయాల్లో మార్పులకు సంబంధించిన సూచనలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల సమయాల్లో చేసిన మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో కొన్ని మార్పులు చేయాలని గత కొంతకాలంగా పాఠశాల విద్యాశాఖ ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లో కొంత ముందుగా మొదలవుతాయి. ‘‘ప్రాథమిక పాఠశాలల్లో చదివేది చిన్నారులైనందున వారు ఉదయం త్వరగా నిద్ర లేవరు. అందువల్ల వారికి ఉదయం 9.30 గంటలకు తరగతులకు మొదలు కావాలి. ఉన్నత పాఠశాలల్లో ఉండేది పెద్ద పిల్లలైనందున ఉదయం 9 గంటలకు మొదలుకావాలి. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా బడి సమయాలు ఉన్నాయి’’ అని కొందరు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ దృష్టికి తెచ్చారు. అందువల్ల అన్ని పాఠశాలలను ఉదయం 9.30 లేదా 9.45 గంటలకు ప్రారంభించాలని సూచించారు. ఈ క్రమంలో పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తూ తాజాగా రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని