Top 10 News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు@ 9PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 02 Apr 2024 21:06 IST

1. ఎన్నికల బాండ్లు.. ఆ రహస్యాలు చెప్పలేం: ఎస్‌బీఐ

ఎన్నికల బాండ్ల (Electoral bonds) పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడంతో.. ఈ పథకం కింద రాజకీయ పార్టీలకు వచ్చిన వివరాలను ఎన్నికల సంఘం (EC) బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాండ్ల విక్రయాలకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (SOP) వెల్లడించాలంటూ సహ చట్టం కింద దరఖాస్తు దాఖలైంది. అయితే, ఈ వివరాలు బయటపెట్టేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) నిరాకరించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2.  ఏపీలో పింఛన్ల పంపిణీ.. ఈసీ మార్గదర్శకాలు జారీ

 ఏపీలో పింఛన్ల పంపిణీపై  ఎన్నికల సంఘం విధి విధానాలు ఖరారు చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ ఆదేశాలను సవరిస్తూ ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. బుధవారం నుంచి ఏప్రిల్‌ 6 వరకు కేటగిరీల వారీగా పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. కొందరికి ఇంటివద్దే ఇవ్వడంతోపాటు, మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. కేసీఆర్‌ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు అరెస్టు

భూవివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. కన్నారావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న కుమారుడు. మన్నెగూడ భూవివాదం కేసులో ఏ1గా ఉన్నాడు. మంగళవారం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదంలో తలదూర్చి పలువురిపై దాడి చేసిన ఘటనలో కె.కన్నారావు, మరో 35 మందిపై ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల కేసు నమోదైంది. మన్నెగూడలో 2 ఎకరాల కబ్జాకు యత్నించినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఐరాసపై ఒత్తిడి పెంచితేనే.. భారత్‌కు శాశ్వత సభ్యత్వం - జైశంకర్‌

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UNSC)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించాలనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉందని, అది తప్పకుండా లభిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్ పేర్కొన్నారు. అయితే, ఇందుకోసం భారత్‌ మరింత కష్టపడాల్సి ఉందన్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన మేధావుల సదస్సులో మాట్లాడిన ఆయన యూఎన్‌ఎస్‌సీలో భారత్‌కు శాశ్వత చోటు లభించే అవకాశాలపై అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. పాఠశాలల్లో ‘వాటర్‌ బెల్స్‌’.. ఏపీ విద్యాశాఖ ఆదేశాలు

ఎండల తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్‌ బెల్స్‌’ మోగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల్లో డీహైడ్రేషన్‌ ముప్పును నివారించేందుకు రోజులో మూడు సార్లు బెల్స్‌ మోగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8.45, 10.50, 11.50కి గంట కొట్టాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని పాఠశాలలకు విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. బైజూస్‌లో 500 మందికి ఉద్వాసన.. ఫోన్‌లోనే సమాచారం!

ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక ఆర్థికంగా అష్టకష్టాలు పడుతున్న ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ (Byjus).. మరికొంతమంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. గత రెండేళ్లలో దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఆ సంస్థ.. తాజాగా మరో 500 మందికి ఉద్వాసన పలికింది. ఉద్యోగం కోల్పోయిన వారిలో సేల్స్‌, మార్కెటింగ్‌ విభాగంలో పనిచేస్తున్నవారు ఎక్కువగా ఉన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. తీరానికి చేరిన ఆహారం చేజారి..! గాజావాసులపై ఇజ్రాయెల్‌ ‘దాడి’ ఎఫెక్ట్‌

యుద్ధం (Israel Hamas War) కారణంగా ఇప్పటికే ఆకలితో అల్లాడుతోన్న గాజావాసుల పాలిట ఇజ్రాయెల్‌ దుందుడుకు చర్య శాపంగా మారింది. ఆ దేశం జరిపిన గగనతల దాడిలో ‘వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌ (WCK)’ స్వచ్ఛందసంస్థకు చెందిన ఆరుగురు విదేశీ సహాయకులు, ఓ స్థానిక డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. గాజా(Gaza)కు సముద్ర మార్గం ద్వారా వేల టన్నుల ఆహారాన్ని చేరవేస్తోన్న ‘డబ్ల్యూసీకే’.. తాజా పరిణామంతో తక్షణం తమ సహాయ కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. అమిత్‌ షా చెప్పినా వినని ఈశ్వరప్ప.. రిటైర్మెంట్‌ పక్కన పెట్టి మరీ పోటీ

సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక (Karnataka)కు చెందిన శివమొగ్గ (Shivamogga) నియోజకవర్గం భాజపాకు తలనొప్పిగా మారింది. ఆ స్థానంలో ఇప్పటికే భాజపా అభ్యర్థిని దించగా.. ఆ పార్టీకే చెందిన మరో అసంతృప్త కీలక నేత అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. చివరకు అగ్రనేత అమిత్ షా చెప్పినా వినడానికి సిద్ధంగా లేకపోవడం గమనార్హం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ప్రజల మూడ్‌ మారిపోయింది.. శరద్‌ పవార్‌ వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ కేంద్ర మాజీమంత్రి, ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్‌పవార్‌ ((Sharad Pawar) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మూడ్‌ మారిపోయిందని.. ఇప్పుడు అది ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఉందన్నారు. బుధవారం నాగ్‌పుర్‌లో విలేకర్లతో మాట్లాడిన ఆయన.. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. విపక్ష కూటమి ‘ఇండియా’ తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఇంకా ఆలోచించలేదన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. వింటేజ్‌ ధోనీ... కీపింగ్‌ మెరుపులు ఓవైపు... భారీ సిక్సర్లు మరోవైపు!

వేదిక ఏదన్నది ముఖ్యం కాదు.. ప్రత్యర్థి ఎవరన్న ఆలోచనే లేదు. మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni) దిగుతుంటే అభిమానులు కేరింతలు కొట్టారు. ఆఖరి సీజన్‌ (IPL) ఆడేస్తున్నాడన్న సందేశం అభిమానుల్లోకి వెళ్లడంతో మైదానాలు పసుపురంగు పులుముకుంటున్నాయి. ధోనీ జపంతో స్టేడియాలు దద్దరిల్లుతున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో చెన్నై, దిల్లీ మ్యాచ్‌ ఇందుకు ఉదాహరణ. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని