Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 May 2024 17:05 IST

1. ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్‌

తెలంగాణలోని ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో సోమవారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉపఎన్నికలో మొత్తం 49 మంది పోటీలో ఉండగా కాంగ్రెస్‌ తరఫున తీన్మార్‌ మల్లన్న, భారాస అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి, భాజపా నేత ప్రేమేందర్‌ ప్రధానంగా బరిలో నిలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా అధికారిక చిహ్నం!

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం ఈ చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన నేతృత్వంలోని బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. సుమారు 12 నమూనాలు రూపొందించగా.. వాటిలో ఒకటి సీఎం రేవంత్‌రెడ్డి ఖరారు చేశారు. ఎంపిక చేసిన దానిలో కొన్ని మార్పులు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జవహర్‌రెడ్డిని సీఎస్‌గా కొనసాగించడం ఎందుకు?: జీవీ ఆంజనేయులు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని ఎన్నికల సంఘం ఎందుకు ప్రత్యేకంగా చూస్తోందని తెదేపా నేత జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. వివాదాల్లో ఉన్న వ్యక్తిని సీఎస్‌గా ఎందుకు కొనసాగిస్తోందో అర్థం కావడం లేదన్నారు. పింఛన్ల పంపిణీ సమయంలో మరణాలు చోటు చేసుకున్నప్పుడే ఆయన్ని తొలగించాల్సిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు.. ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతదేహం గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణా నదిలో లభ్యమైంది. విజయవాడకు చెందిన మురికింటి వంశీ (22) ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇంట్లో తెలియకుండా లోన్‌ యాప్‌లో రూ.10వేల రుణ తీసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి దుర్మరణం

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మృతురాలిని తెలంగాణకు చెందిన గుంటిపల్లి సౌమ్యగా గుర్తించారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె స్వస్థలం యాదగిరిగుట్ట శివారులోని యాదగిరిపల్లె. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రాష్ట్ర హోంమంత్రికి ప్రొటోకాల్ తెలియదా?: హెచ్‌డీ కుమారస్వామి

‘‘ఎంపీ ప్రజ్వల్  పాస్‌పోర్ట్‌ను రద్దు చేసి అతడిని భారత్‌కు రప్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం ఎంఈఏను అభ్యర్థించింది. కానీ పాస్‌పోర్ట్‌ను 24గంటల్లో రద్దు చేయడం సాధ్యం కాదు. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. రాష్ట్ర హోం మంత్రికి అసలు ప్రోటోకాల్ తెలుసా లేదా?’’అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పదేళ్లపాటు ఉండేలా.. గంభీర్‌కు ‘బ్లాంక్‌ చెక్’ ఆఫరిచ్చిన షారుక్‌ ఖాన్‌!

ప్రస్తుతం గంభీర్‌ కోల్‌కతా మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అంతకుముందు లఖ్‌నవూ జట్టుకు ఇదే బాధ్యతలు నిర్వర్తించాడు. అతడిని మళ్లీ కేకేఆర్‌కు తీసుకొచ్చేందుకు ఆ ఫ్రాంచైజీ ఓనర్ షారుక్ ఖాన్ చాలా శ్రమించాడని.. దాని కోసం గంభీర్‌కు ‘బ్లాంక్ చెక్‌’ ఆఫర్ చేశాడని తెలుస్తోంది. తన జట్టుతో పదేళ్లపాటు ఉండాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తొలిసారి 76k టచ్‌ చేసిన సెన్సెక్స్‌.. ఆఖర్లో లాభాలన్నీ ఆవిరి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 75,655.46 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 76,009.68 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసింది. చివరికి 19.89 పాయింట్ల నష్టంతో 75,390.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 24.65 పాయింట్లు కోల్పోయి 22,932.45 వద్ద స్థిరపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కోర్టులోనే ఏడ్చేసిన రాజ్యసభ ఎంపీ.. ఓ యూట్యూబర్‌పై ఫిర్యాదు

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసు విచారణ సందర్భంగా నేడు హజారీ కోర్టులో హైడ్రామా నడిచింది. ఒక దశలో మహిళా ఎంపీ కోర్టులో కన్నీరు పెట్టుకొన్నారు. అంతేకాదు.. ఓ యూట్యూబర్‌ కారణంగా తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ విషయాల్లో ఇద్దరమూ ఒక్కటే.. రిషి దంపతుల ఆసక్తికర పోస్ట్‌

మరికొన్ని రోజుల్లో బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశ ప్రధానమంత్రి రిషి సునాక్‌ దంపతులు కీలక విషయాలు వెల్లడించారు. ఇద్దరి అభిరుచులకు సంబంధించి అనేకమంది అడిగే ప్రశ్నలను ప్రస్తావిస్తూ సోషల్‌ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు