Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Jul 2023 09:15 IST

1. జగన్‌ను క్షమాపణ అడిగితే .. జేసీ కుమారుడిని ఎమ్మెల్యే చేయిస్తా

ముఖ్యమంత్రి జగన్‌ వద్దకు వచ్చి తప్పు చేశానని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒప్పుకుంటే ఆయన కుమారుడిని ఎమ్మెల్యేగా చేస్తానని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అన్నారు. మంగళవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లు రాజకీయాలు చేసిన జేసీ సోదరులు దిగజారిపోతున్నారని, ప్రతిసారీ అరుస్తూ అందరినీ భయపెట్టే వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. ఆయన అధ్యయనం ముగిసి పోయిందని, రాబోవు ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విశ్వవిద్యాలయాలు.. రాజకీయ అడ్డాలు!

డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటివారు వీసీగా పని చేసిన ఆంధ్ర వర్సిటీని రాజకీయాల కేంద్రంగా మార్చేశారు. ఎంతో ఘనకీర్తి కలిగిన ఆచార్య నాగార్జున, శ్రీవేంకటేశ్వర వర్సిటీల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎస్వీయూ వీసీ నియామకంలో ఓ మంత్రి.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉప కులపతి కోసం మరో ప్రభుత్వ సలహాదారు.. ఆంధ్ర, అంబేద్కర్‌ వర్సిటీల వీసీల విషయంలో ఒక ఎంపీ తమ రాజకీయ పలుకుబడిని వినియోగించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కోతల్లో నంబర్‌ 1

పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న బీసీ వర్గాల్లోని ఉత్సాహాన్ని జగన్‌ ప్రభుత్వం నీరుగార్చేసింది. వారికి దక్కాల్సిన రాయితీలకు మంగళం పాడేసి... వారిని తనే ఉద్ధరిస్తోన్నట్టు డాంబికాలు పలుకుతోంది. బీసీ పారిశ్రామిక ప్రగతి చక్రాలకు అడ్డుకట్ట వేసిన వైనం ప్రత్యక్షంగా కనబడుతూనే ఉన్నా.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం అందరి కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 12 రైళ్లకు అదనపు స్టాపులు

 తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే 12 రైళ్ల(ఆరు జతలు)కు ప్రయోగాత్మకంగా అదనపు స్టాపులు ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇక జమ్మికుంట రైల్వేస్టేషన్‌లో ఆగనుంది. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైలు వరంగల్‌లో, ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-అహ్మదాబాద్‌, సికింద్రాబాద్‌-రాయపూర్‌, సికింద్రాబాద్‌-హిస్సార్‌, హైదరాబాద్‌-రాక్సల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పెద్దపల్లిలో ఆగనున్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీఎం సార్‌... మీ హామీ నెరవేర్చండి

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 12 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని టెట్‌ ఉత్తీర్ణులై...టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖలు రాసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం దిల్‌సుఖ్‌నగర్‌లో సమావేశమై మూకుమ్మడిగా లేఖలురాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బీరువాలో నగలు.. నగదు.. ఫ్రిడ్జ్‌లోని కిలో టమాటాలు చోరీ..

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో తాళం వేసిన ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. నగదు, ఆభరణాలతోపాటు ఫ్రిడ్జ్‌లోని కిలో టమాటాలు కూడా ఎత్తుకుపోవడం అందరిని విస్మయానికి గురి చేసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గౌడ్స్‌కాలనీకి చెందిన మున్సిపల్‌ ఉద్యోగి రఫీ కుటుంబం సోమవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి సిద్దిపేటలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున తిరిగొచ్చి చూసేసరికి ఇంటి తాళం ధ్వంసం చేసి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నన్నెందుకు తప్పించారో..: హనుమ విహారి

2019 వెస్టిండీస్‌ పర్యటనలో హనుమ విహారి టెస్టు శతకంతో చిన్ననాటి కలను నిజం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత.. 10 టెస్టులు ముగిశాక చూసుకుంటే అతను టీమ్‌ఇండియాలో లేడు. గతేడాది ఆరంభంలో శ్రీలంకతో సిరీస్‌కు పుజారా లేకపోవడంతో మూడో స్థానంలో ఆడిన విహారి.. ఆ స్థానంలో మూడు టెస్టులకే పరిమితమయ్యాడు. నిరుడు జులై తర్వాత తిరిగి జట్టులోకి రాలేదు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. థర్డ్‌ పార్టీ యాప్స్‌ లింక్‌ వద్దనుకుంటే?

నేటి డిజిటల్‌ యుగంలో సౌకర్యమే కీలకం. వివిధ వెబ్‌సైట్లు, యాప్స్‌ను వాడుకోవటానికి అంతా తేలికైన మార్గాలనే ఎంచుకుంటారు. వీటి సేవలను పొందటానికి చాలామంది చేసే పని గూగుల్‌ ఖాతాతో సైన్‌ అప్‌ కావటం. అయితే కొన్నిసార్లు ఇది హానికరంగా పరిణమించొచ్చు. కాబట్టి తరచూ సమీక్షించుకొని, అనవసర యాప్స్‌ను తొలగించుకోవటం మంచిది. దీంతో ఆన్‌లైన్‌ భద్రత మెరుగవుతుంది. మరి గూగుల్‌ ఖాతాతో అనుసంధానమైన అవాంఛిత యాప్‌లను తొలగించుకోవటమెలా?  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నెడితే చాలు... పడిపోతాయి ఇళ్లు!

పేదలందరికీ ఇళ్లు కట్టిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతూ వస్తోంది. మూడేళ్లుగా సాగుతున్న ఈ ప్రక్రియ ఆచరణలో ఆశించినంత వేగం కనిపించడంలేదు. ఐచ్ఛికం-3 ఎంచుకున్న లబ్ధిదారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ విధానం కింద అట్లూరు మండలంలో స్థానిక వైకాపా నేతకు 206 ఇళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వివాహేతరబంధానికి అడ్డుగా ఉందని.. చిన్నారిని చంపేసిన కన్నతల్లి!

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కుమార్తెను తల్లే చంపేసింది... పైగా నిద్రలోనే కన్నుమూసిందని బుకాయించింది. ఆమె ప్రవర్తనలో తేడాను గమనించిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరాన్ని అంగీకరించింది. కుషాయిగూడ ఠాణా పరిధిలో ఈ నెల 2న మృతి చెందిన నాలుగున్నరేళ్ల చిన్నారి తన్విత కేసును పోలీసులు ఛేదించారు. కన్నతల్లే  హత్యచేసినట్లు తేల్చారు. ఠాణాలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ బి.ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐ షేక్‌ షఫీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని