విశ్వవిద్యాలయాలు.. రాజకీయ అడ్డాలు!

విశ్వవిద్యాలయాలు అంటే నాణ్యమైన ఉన్నత చదువులు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకులు.. మెరుగైన పరిశోధనలు..ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు రాష్ట్రంలోని వర్సిటీలు అంటే రాజకీయ కేంద్రాలుగా మారిపోయాయి.

Updated : 12 Jul 2023 05:48 IST

వైకాపా నాయకుల సిఫార్సుతోనే వీసీ పోస్టులు, పాలకవర్గ పదవులు
ఉన్నత విద్యను గాలికి వదిలిన జగన్‌ ప్రభుత్వం

విశ్వవిద్యాలయాలు అంటే నాణ్యమైన ఉన్నత చదువులు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకులు.. మెరుగైన పరిశోధనలు..

ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు రాష్ట్రంలోని వర్సిటీలు అంటే రాజకీయ కేంద్రాలుగా మారిపోయాయి. అధికార పార్టీ నేతలు చెప్పినవారే ఉప కులపతులు.. పాలకవర్గం సభ్యుల నియామకాల్లోనూ వైకాపా నేతల మాటే చెల్లుబాటు. సిఫారసు లేఖలు.. రాజకీయ జోక్యాలు.. జగన్‌ సర్కారు హయాంలో విశ్వవిద్యాలయాల దుస్థితి ఇది. స్వయం ప్రతిపత్తి కలిగిన వర్సిటీలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. అంత సులువు కాదు.. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మితిమీరిన జోక్యంతో విశ్వవిద్యాలయాల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది..

ఈనాడు - అమరావతి

డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటివారు వీసీగా పని చేసిన ఆంధ్ర వర్సిటీని రాజకీయాల కేంద్రంగా మార్చేశారు. ఎంతో ఘనకీర్తి కలిగిన ఆచార్య నాగార్జున, శ్రీవేంకటేశ్వర వర్సిటీల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎస్వీయూ వీసీ నియామకంలో ఓ మంత్రి.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉప కులపతి కోసం మరో ప్రభుత్వ సలహాదారు.. ఆంధ్ర, అంబేద్కర్‌ వర్సిటీల వీసీల విషయంలో ఒక ఎంపీ తమ రాజకీయ పలుకుబడిని వినియోగించారు. తానేం తక్కువ తిన్నానన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే ఓ ఉన్నతాధికారి సైతం తన సతీమణికి ఇప్పించేందుకు ఏకంగా కృష్ణా వర్సిటీ వీసీ నియామకం జరగకుండా చక్రం తిప్పారు. ఏదైనా వర్సిటీ వీసీ పదవికి ప్రభుత్వం మూడు పేర్లను ఎంపిక చేసి గవర్నర్‌ పరిశీలనకు పంపాలన్న విధానాన్ని వైకాపా ప్రభుత్వం పక్కన పడేసింది. చట్టానికి సవరణ చేసి, ఒకే పేరును సిఫార్సు చేస్తోంది. ఈ తీరుతో విశ్వవిద్యాలయాలు రాజకీయ అడ్డాలుగా మారిపోయాయి.


అండదండలే అర్హతలు

ఉపకులపతు(వీసీ)ల నియామకంలో వారి బయోడేటాల పరిశీలన మొక్కుబడిగా మారింది. విశ్వవిద్యాలయంలో వీసీ పోస్టు ఖాళీ అవుతుండగానే అది ఎవరికి ఇవ్వాలనేది ముందుగానే నిర్ణయం జరిగిపోతోంది. పోస్టు ఆశిస్తున్న వారిలో ఎవరు ఎక్కువ రాజకీయ బలం నిరూపించుకుంటారో వారిదే అన్నట్లు తయారైంది. దీంతో రాజకీయ పలుకుబడి లేని విద్యావేత్తలు దరఖాస్తు చేసేందుకే ముందుకు రావడం లేదు. రిజిస్ట్రార్ల నియామకాలకూ సిఫార్సులు తప్పనిసరయ్యాయి.

  • నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ పోస్టును దాదాపు రెండేళ్లు ఖాళీగా ఉంచి, ఆ తర్వాత ఇన్‌ఛార్జిగా ఉన్న రాజశేఖర్‌నే నియమించారు. ఈయనపై ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేసినా ఆరోపణలన్నీ ఉత్తవేనని తేల్చేశారు. ఈ వ్యవహారంలో ఓ కీలక ప్రభుత్వ సలహాదారు ఉన్నారు.
  • ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ ఐఏఎస్‌ అధికారి సతీమణి కోసం ఏకంగా కృష్ణా వర్సిటీ వీసీ పోస్టును భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచారు. హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆమెను అధికారాన్ని వినియోగించి ఏపీకి తీసుకువచ్చారు.
  • ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్‌రెడ్డి నియామకానికి అప్పట్లో వైకాపా ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి, ఎంపీ విజయసాయిరెడ్డి ఆశీస్సులే కారణమన్నది బహిరంగ రహస్యం.
  • ఎస్వీ యూనివర్సిటీ వీసీగా తన స్నేహితుడైన రాజారెడ్డిని నియమించేలా చిత్తూరు జిల్లాకు చెందిన ఒక పెద్ద మంత్రి చక్రం తిప్పారు.
  • విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వీసీ సుందరవల్లి సీఎం జగన్‌కు స్వయానా బంధువు. ఆమె గతంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా పని చేసిన క్రిస్టోఫర్‌ సతీమణి. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగాలకు సంబంధించి క్రిస్టోఫర్‌పై అవినీతి నిరోధక శాఖ గతంలో చేపట్టిన సాధారణ విచారణ మేరకు తదుపరి చర్యలను నిలిపివేస్తూ వైకాపా ప్రభుత్వం 2020 సెప్టెంబరు 24న ఉత్తర్వులు ఇచ్చింది.
  • విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనల పెంపునకు ఏర్పాటు చేసిన రీసెర్చ్‌బోర్డు డైరెక్టర్‌గా సీఎంవోలో కీలక ఐఏఎస్‌ అధికారి సతీమణి అపర్ణను నియమించారు. కానీ ఆమెకు దీనిపై అంతగా దృష్టి పెట్టడంలేదు. ఫలితంగా వర్సిటీలు రీసెర్చ్‌లో వెనుకబడుతుండడంతో జాతీయ స్థాయిలో ర్యాంకులను కోల్పోతున్నాయి.

పాలకవర్గం నియామకంలోనూ అదే దుస్థితి..

పాలకవర్గం (ఈసీ) సభ్యుల నియామకాల్లోనూ రాజకీయ పలుకుబడికే ప్రాధాన్యం ఉంటోంది. వైకాపా ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈసీ సభ్యులను నియమించిన సమయంలో వారి పేర్లకు ఎదురుగా ఏ మంత్రి, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి సిఫార్సు చేశారో రాసి, జాబితాను ఆమోదించారు. పదవీకాలం పూర్తవడంతో తాజాగా కొత్త సభ్యుల జాబితాను ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి పంపింది. వీరందరూ నేతల సిఫార్సులతో వచ్చిన వారే కావడంతో గత పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలను ఏకంగా రద్దు చేసే సంప్రదాయానికి తెర లేపారు. ఫలితంగా రాయలసీమ, ఎస్పీ వర్సిటీల్లో ఉద్యోగుల సర్వీసు అంశంలో వివాదాలు నెలకొన్నాయి.


ఆచార్యులా.. నాయకులా..!?

ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాదరెడ్డి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో ఆయన ఛాంబర్‌లోనే సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తాజాగా వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద  దివంగత సీఎం వైఎస్‌ ఫైబర్‌ విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్‌ నియామకంలోనూ అత్యధికంగా ఆరేళ్లే రిజిస్ట్రార్‌గా కొనసాగాలన్న నిబంధన పాటించలేదు. ఉద్యోగ విరమణ చేసినా మూడుసార్లు పునర్నియామకంతో రిజిస్ట్రార్‌గా కొనసాగిస్తున్నారు. వారిద్దరూ విశాఖలోని ఓ హోటల్‌లో వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా సమావేశం నిర్వహించారు. గ్రేటర్‌ విశాఖ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించడంతో పాటు ఫలితాలపై విద్యార్థులతో సర్వే చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.


ఆ ఇద్దరిదే పెత్తనం..

ఈసీ సమావేశాల్లో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పెత్తనం పెరిగేలా వైకాపా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈసీలో ప్రభుత్వ నామినీగా ఉండే ముఖ్య కార్యదర్శికి తోడుగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌నూ సభ్యుడిగా చేర్చింది. వీరు లేకుండా ఈసీ సమావేశం నిర్వహించకూడదని.. ఏ అంశాలోనైనా వీరి అభిప్రాయాలు లేకుండా తీర్మానాలు చేయకూడదని, వీరిద్దరికి ముందుగా సమాచారం ఇవ్వకుండా ఏ విషయాలపైనా మాట్లాడకూడదనే నిబంధనతో విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారింది.


అధికార పార్టీకి దాసోహం.. అవినీతి సర్వస్వం

  • నాగార్జున విశ్వవిద్యాలయంలో మాజీ సీఎం వైఎస్సార్‌ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వైకాపా కార్యక్రమాలకు వర్సిటీ ఆడిటోరియం, అతిథి గృహాలను కేటాయిస్తున్నారు. గతేడాది వైకాపా ప్లీనరీ సందర్భంగా మే 8న వర్సిటీలో ఏకంగా తరగతులను రద్దు చేసి, 9న సెలవు ఇచ్చారు. పరీక్షలను వాయిదా వేయడంతో పాటు ప్లీనరీ వాహనాల పార్కింగ్‌కు వర్సిటీ స్థలం కేటాయించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా యూనివర్సిటీ వద్ద ఫ్లెక్సీలు పెట్టారు.
  • రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన తండ్రి, మంత్రి పెద్దిరెడ్డి జన్మదినాల సందర్భంగా శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం వద్ద భారీగా వైకాపా ప్లెక్సీలు కట్టడం ఆనవాయితీగా మారింది.
  • రాయలసీమ విశ్వవిద్యాలయంలో 200 మంది బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలపై విచారణను అప్పటి విద్యాశాఖ మంత్రి సురేష్‌ జోక్యంతో పక్కన పెట్టారు.
  • శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో 2010లో అప్పటి వీసీ కుసుమకుమారి నిబంధనలకు విరుద్ధంగా 21 మంది సహాయ ఆచార్యులను నియమించారు. అనంతపురం జిల్లా అధికారపార్టీ ఎంపీ పైరవీతో ఈ నియామకాలను సక్రమమని ప్రభుత్వం గత ఆగస్టులో ప్రకటించింది.
  • ద్రవిడ వర్సిటీలో బోధనేతర పదవులైన డైరెక్టరు, డిప్యూటీ, సహాయ డైరెక్టర్ల పోస్టులను ఓ ఐఏఎస్‌ అధికారి బంధువు కోసం బోధన పోస్టులుగా మార్చారు.
  • నన్నయ వర్సిటీలో నియామకాలు, సివిల్‌ పనుల్లో అవినీతిపై విచారణను ఓ మంత్రి అడ్డుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని