కోతల్లో నంబర్‌ 1

పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న బీసీ వర్గాల్లోని ఉత్సాహాన్ని జగన్‌ ప్రభుత్వం నీరుగార్చేసింది. వారికి దక్కాల్సిన రాయితీలకు మంగళం పాడేసి... వారిని తనే ఉద్ధరిస్తోన్నట్టు డాంబికాలు పలుకుతోంది.

Updated : 12 Jul 2023 09:46 IST

బీసీ పారిశ్రామికవేత్తల ప్రత్యేక ప్యాకేజీకి వైకాపా సర్కారు మంగళం


నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నా.. నాలుగేళ్లలో పేదల సంక్షేమానికి రూ. 2.25 లక్షల కోట్లు ఖర్చు చేశా..

సీఎం జగన్‌ పదేపదే చెబుతున్న మాటలివి.

మరి బీసీల కోసం గత తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానంలోని ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు తొలగించారు?
పారిశ్రామిక అవసరాల కోసం భూముల కొనుగోలులో గరిష్ఠంగా అందే రూ. 20 లక్షల రాయితీని బీసీలు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది?

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న ఔత్సాహిక బీసీ పారిశ్రామికవేత్తల డిమాండ్‌కు జగన్‌ సర్కారు స్పందించే ధైర్యం చేస్తుందా?


గతంలో ఇలా...

* ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల మాదిరే.. బీసీలకు కూడా ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీని తెదేపా ప్రభుత్వం మొదటిసారి ప్రకటించింది.

* 2015-20 పారిశ్రామిక విధానంలో భూముల కొనుగోలుకు వెచ్చించే మొత్తంలో 50 శాతం రాయితీ ఇచ్చింది. దీని ప్రకారం పారిశ్రామిక పార్కులు, ఎస్టేట్‌లలో కొనుగోలు చేసే భూములకు నిర్దేశించిన ధరలో 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది.

* మహిళా పారిశ్రామికవేత్తలకు భూముల ధరలో మరో 10 శాతం అదనపు రాయితీ ఇచ్చి ప్రోత్సహించింది.

* దీంతోపాటు స్థిర మూలధన పెట్టుబడిలో 35 శాతం రిబేటు ఇచ్చింది.

* ఇతర ప్రోత్సాహకాలను యథావిధిగా వర్తింప జేసింది. వీటివల్ల బీసీ వర్గాలకు పెట్టుబడి వ్యయం బాగా తగ్గింది.


పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న బీసీ వర్గాల్లోని ఉత్సాహాన్ని జగన్‌ ప్రభుత్వం నీరుగార్చేసింది. వారికి దక్కాల్సిన రాయితీలకు మంగళం పాడేసి... వారిని తనే ఉద్ధరిస్తోన్నట్టు డాంబికాలు పలుకుతోంది. బీసీ పారిశ్రామిక ప్రగతి చక్రాలకు అడ్డుకట్ట వేసిన వైనం ప్రత్యక్షంగా కనబడుతూనే ఉన్నా.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం అందరి కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు.

పరిశ్రమల ఏర్పాటుకు అవసరమయ్యే భూముల కొనుగోలుకు చేసే వ్యయంలో బీసీ పారిశ్రామికవేత్తలు పొందుతున్న రాయితీని జగన్‌ ప్రభుత్వం పూర్తిగా ఎత్తేసింది. తెదేపా ప్రభుత్వం బీసీల కోసం పారిశ్రామిక విధానంలో ప్రవేశపెట్టిన ప్రత్యేక ప్యాకేజీని తొలగించింది. ఈ కారణంగా భూముల కొనుగోలుకు చేసే ఖర్చులో గరిష్ఠంగా రూ. 20 లక్షల రాయితీని బీసీ వర్గాలు కోల్పోవాల్సి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను పారిశ్రామిక రంగం వైపు ఆకర్షించేలా ప్రాధాన్యం ఇస్తామని, ప్రోత్సాహకాలను అందిస్తామని చెబుతూనే.. వెనుకబడిన వర్గాలకు ఇచ్చే రాయితీల్లో కోత పెట్టింది. గత ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీని 2020-23 పారిశ్రామిక విధానంలో వైకాపా ప్రభుత్వం తొలగించింది. కనీసం 2023-27 పారిశ్రామిక విధానంలోనైనా దీన్ని పునరుద్ధరిస్తుందన్న ఆశతో ఎదురుచూసిన బీసీ పారిశ్రామికవేత్తలకు నిరాశే మిగిలింది. పారిశ్రామిక రంగంలోకి కొత్తగా రావాలన్న ఔత్సాహికుల అంకురాలపై దీని ప్రభావం పడింది. పెట్టుబడులు భారీగా పెరగటం.. మార్కెట్‌లో పోటీని తట్టుకుని నిలవడం సవాల్‌గా మారడంతో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపే వారి సంఖ్య తగ్గుతోంది.  

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు