Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Aug 2023 09:15 IST

1. వాలంటీర్లలో కొందరి రూటే సెపరేటు

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, ఇతర సేవలు అందించడంలో ఆదర్శంగా నిలవాల్సిన వాలంటీర్లలో కొందరు అక్రమాలకు పాల్పడుతూ మా రూటే సెపరేట్‌ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇలా అడ్డదారులు తొక్కుతున్నా..  సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. పెందుర్తి మండలం పురుషోత్తపురం సచివాలయంలో వాలంటీరుగా పనిచేస్తున్న రాయవరపు వెంకటేష్‌ గత నెల 30న బంగారం కోసం వృద్ధురాలు కోటగిరి వెంకటలక్ష్మి హత్య చేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వామ్మో.. ఒత్తిడి భరించలేకున్నాం

పాఠశాల విద్యాశాఖ పరిధిలో పని చేస్తున్న ఉపాధ్యాయవర్గానికి నానాటికీ మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. హాజరు నమోదు నుంచి వర్క్‌బుక్‌ కరెక్షన్‌ వరకు ప్రతి లోపానికి వారినే బాధ్యుల్ని చేసి సంజాయిషీలు కోరడంతో బెంబేలెత్తుతున్నారు. ఇలాగైతే ఉద్యోగం ఏం చేస్తామని చెప్పి ఆందోళన, ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కారణాలేమైనా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇటీవల నలుగురు ఉపాధ్యాయులు మృత్యువాత పడటం సహచర ఉపాధ్యాయవర్గాన్ని కలవరపరుస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కాలువలపై కన్నేశారు!

అధికార పార్టీ వైకాపాకు చెందిన కొంతమంది నేతలు భూఆక్రమణలకు పాల్పడుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అధికార అండతో అందినకాడికి భూదందాలు సాగిస్తున్నారు. పసిడిపురిగా ఖ్యాతిచెందిన ప్రొద్దుటూరు పట్టణంలో భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. ఇదే అదునుగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడంతోపాటు భావితరాలకు ఉపయోగపడే పంట కాలువలను సైతం వదిలిపెట్టడంలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 2 లక్షల పెట్టుబడి...1290కోట్ల వ్యాపారం!

20 ఏళ్ల వయసులో ప్రేమ ఇల్లు వదిలేలా చేసింది... ఐదేళ్లు  గడవకుండానే... విధి ఒంటరి తల్లిగా పోరాడే పరిస్థితిని తెచ్చింది. ఆ సమయంలో ఆదుకున్న అమ్మానాన్నలను కొన్నాళ్లకే దూరం చేసి మరోసారి విషాదాన్ని తెచ్చిపెట్టింది. ఇలా అడుగడుగునా ఎన్నో ఆటుపోట్లు ఆమెతో సావాసం చేశాయి. అయినా సరే నాలుగు పదుల వయసులో వ్యాపారాన్ని ఆరంభించి... రూ.1290 కోట్ల సామ్రాజ్యానికి అధినేత్రి అయ్యారు.. మీరా కులకర్ణి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సహాయం అందకుంటే చెప్పండి

గోదావరి, శబరి నదుల వరదలతో నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ పేర్కొన్నారు. సోమవారం కూనవరం వచ్చిన ఆయన స్థానికంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. గత నెల వరదల సమయంలో ప్రతి బాధితుడిని ఆదుకోవాలని, వారికి కావాల్సిన సాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. వరదలు వచ్చినప్పుడు ఫొటోలు దిగే ముఖ్యమంత్రిని కానని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. దిగొస్తున్న టమాటా

నగరానికి టమాటా రాక పెరుగుతోంది. రైతుబజారులో కిలో టమాటా రూ.63లు ఉంటే.. బయట మార్కెట్‌లో రూ.120 నుంచి రూ.140 వరకు విక్రయిస్తున్నారు. నగరానికి 10రోజుల కిందట కేవలం 850 క్వింటాళ్ల సరకు వస్తే.. సోమవారం 2450 క్వింటాళ్లు హోల్‌సేల్‌ మార్కెట్‌కు వచ్చింది. ఎక్కువగా అనంతపురం, చిత్తూరు, కర్ణాటక నుంచి నగరానికి దిగుబడి వస్తోంది. దీనికి తోడు రంగారెడ్డి, వికారాబాద్‌, చేవెళ్ల, నవాబ్‌పేట, మెదక్‌ జిల్లాల నుంచి కూడా మార్కెట్‌కు టమాటా ఎక్కువ మొత్తంలో రావడమే ధర తగ్గడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మోరంచపల్లి.. గట్టెక్కే మార్గమిది!

వరద సృష్టించిన బీభత్సం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ప్రజలు సర్వస్వం కోల్పోయారు. మోరంచ వాగుతో ఈ గ్రామానికి భవిష్యత్తులోనూ ముంపు పొంచి ఉంది. ఏటా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని వేడుకుంటున్నారు..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దిశ చట్టానికి మోక్షం ఎప్పుడు?

తానేదో మహిళల రక్షణకు దిగొచ్చిన ఆపద్బాంధవుడిలా ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. దిశ బిల్లులు ఆమోదం పొంది మూడున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ చట్టం రూపంలోకి తీసుకురాలేదు. అయినా ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు దిశ చట్టం అమలైపోతున్నట్లు, దాని కింద శిక్షలు కూడా పడినట్లు హోరెత్తించారు. ప్రచారంపై చూపిన శ్రద్ధ, చిత్తశుద్ధి బిల్లులు చట్టరూపం దాల్చేలా చేయటంలో మాత్రం కనబరచలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ కోసం పడిగాపులు

ఇంజినీరింగ్‌ కళాశాలలు, బ్రాంచిల ఎంపికకు సోమవారం నుంచి వెబ్‌ఐచ్ఛికాలు ఉంటాయని ప్రకటించిన ప్రభుత్వం రాత్రి వరకు ఆ ఐచ్ఛికాన్ని ఇవ్వనేలేదు. దీంతో ఉదయం నుంచి కంప్యూటర్ల ముందు కూర్చుని ఎదురుచూసిన విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశ చెందారు. ఒకసారి ఫీజుల ఉత్తర్వుల్లో తప్పుల సవరణ, మరోసారి కౌన్సెలింగ్‌లో కొత్త కళాశాలల జాబితాను పెట్టేందుకు అంటూ వెబ్‌సైట్‌ను నిలిపివేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రూ.లక్ష కోట్లున్న సీఎం పేదవారా?

‘రూ.లక్ష కోట్ల ఆస్తి పెట్టుకుని.. రూ.లక్ష విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతూ.. లీటరు రూ.1000 నీళ్లు తాగుతూ.. నాలుగుచోట్ల రాజప్రసాదాలు నిర్మించుకున్న జగన్‌ తాను పేదవాణ్నని చెప్పడం మైతోమానియా సిండ్రోమ్‌ ప్రభావం’ అని తెదేపా కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా 177వ రోజు సోమవారం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని