2 లక్షల పెట్టుబడి...1290కోట్ల వ్యాపారం!

20 ఏళ్ల వయసులో ప్రేమ ఇల్లు వదిలేలా చేసింది... ఐదేళ్లు  గడవకుండానే... విధి ఒంటరి తల్లిగా పోరాడే పరిస్థితిని తెచ్చింది. ఆ సమయంలో ఆదుకున్న అమ్మానాన్నలను కొన్నాళ్లకే దూరం చేసి మరోసారి విషాదాన్ని తెచ్చిపెట్టింది.

Updated : 08 Aug 2023 07:51 IST

20 ఏళ్ల వయసులో ప్రేమ ఇల్లు వదిలేలా చేసింది... ఐదేళ్లు  గడవకుండానే... విధి ఒంటరి తల్లిగా పోరాడే పరిస్థితిని తెచ్చింది. ఆ సమయంలో ఆదుకున్న అమ్మానాన్నలను కొన్నాళ్లకే దూరం చేసి మరోసారి విషాదాన్ని తెచ్చిపెట్టింది. ఇలా అడుగడుగునా ఎన్నో ఆటుపోట్లు ఆమెతో సావాసం చేశాయి. అయినా సరే నాలుగు పదుల వయసులో వ్యాపారాన్ని ఆరంభించి... రూ.1290 కోట్ల సామ్రాజ్యానికి అధినేత్రి అయ్యారు.. మీరా కులకర్ణి.

‘లక్ష్యం బలంగా ఉంటే గడ్డిపరకను కూడా బ్రహ్మాస్త్రంగా మలచుకోవచ్చు’ అనడానికి మీరా కులకర్ణి ఓ ఉదాహరణ. దిల్లీకి చెందిన మీరా..  చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌లో పట్టా తీసుకున్నారు. ఇరవై ఏళ్లప్పుడు ప్రేమించిన వ్యక్తి కోసం ఇల్లు వదిలారు. ఆ కాపురం ఇద్దరు పిల్లలు పుట్టేవరకూ సంతోషంగానే సాగింది. తర్వాత వ్యాపారంలో నష్టాలు అతడిని మద్యానికి బానిసయ్యేలా చేయడంతో నిత్యం నరకం చూశారామె. దాంతో పిల్లల జీవితాలైనా బాగుండాలని భావించి వారిని తీసుకుని పుట్టింటికి చేరారు. అయితే, వారి ఆదరణ లభించిందన్న సంతోషం మీరాకు ఎక్కువ రోజులు లేదు. కొన్నాళ్లకే తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో మళ్లీ కష్టాలు తప్పలేదు. ఆ బాధ నుంచి బయటకు రావడానికి చాలా రోజులే పట్టాయి. ఉండటానికి ఇల్లు తప్ప చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో అందులోని ఓ భాగాన్ని అద్దెకిచ్చి ఆ డబ్బులతో పిల్లల్ని పోషించారు. రూపాయి రూపాయి పొదుపు చేసి ఒక్కో సమస్యనూ దాటి గట్టెక్కారు. పిల్లల్ని స్థిరపడేట్టు చేశారు.

విద్యుత్‌ కోతలు ఉపాయాన్నిచ్చాయి..

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనీ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే.. కష్టాలతోనే కాపురం చేయక్కర్లేదని నాలుగు పదుల వయసులో అర్థమైంది మీరాకి. అప్పటికే అమ్మాయి దివ్యకు పెళ్లైంది. బాబు సమర్థ్‌ విదేశాల్లో చదువుకుంటున్నాడు. తరచూ విద్యుత్‌ కోతలతో అసహనానికి గురై సొంతంగా కొవ్వొత్తుల తయారీతో వ్యాపార ప్రయాణం ఆరంభించారు మీరా. ఆమెకు ఆయుర్వేద ఉత్పత్తులంటే ఇష్టం. వన మూలికలూ, ఎసెన్షియల్‌ నూనెలతో స్వయంగా సబ్బుల్ని తయారు చేసి వాడేవారు. బంధువులూ, స్నేహితులకు కానుకలుగా ఇచ్చేవారు. ఓసారి వాళ్లబ్బాయిని చూడటానికి అమెరికా వెళ్తే అక్కడికీ తీసుకెళ్లారు. వాటిని చూసినవారు కొవ్వొత్తులతో పాటూ వీటినీ విక్రయిస్తే బాగుంటుందనడంతో ఆ ప్రయత్నం చేశారు. చేసినవన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయేవి. దాంతో మరిన్ని చర్మ, కేశ సంరక్షణ ఉత్పత్తులు తీసుకురావాలనుకున్నారు. కానీ ఇవి ఆధునికతరం ఉపయోగించేలా లేకపోవడంతోనే మార్కెట్‌లో అంతరం ఏర్పడిందని గుర్తించారామె. ఇందుకోసం ఆయుర్వేదం, సహజ ఉత్పత్తులపై తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి కొన్ని, బయోకెమిస్ట్‌ల సాయంతో మరికొన్ని ప్రయోగాలు చేశారు. వన మూలికలకు ఉన్న స్వాభావిక లక్షణాలు చెక్కుచెదరనివ్వకుండా, సహజ సువాసనను కోల్పోనివ్వకుండా ఈతరం అనువుగా వాడే ఉత్పత్తులెన్నో తెచ్చారు. అప్పటికి మీరా వయసు నలభై ఐదేళ్లు. ఈ వ్యాపారానికి ప్రారంభ పెట్టుబడి రెండు లక్షల రూపాయలు. ఇద్దరు ఉద్యోగులతో ‘ఫారెస్ట్‌ ఎసెన్షియల్స్‌’ కార్యకలాపాలు మొదలయ్యాయి. తర్వాత హరిద్వార్‌, లోడ్సీల్లో కర్మాగారాలను ఏర్పాటు చేశారు.

ప్రముఖ సంస్థలెన్నో...

‘ఈ వయసులో వ్యాపారం అవసరమా! పిల్లలు స్థిరపడ్డారు...నువ్వూ హాయిగా ఉండు’ అంటూ మీరాకి చాలామందే సలహా ఇచ్చారు. ఆవిడ మాత్రం వెనుతిరిగి చూడాలనుకోలేదు. మొదట ఆయా ఉత్పత్తులను స్థానిక దుకాణాల్లో పెట్టి అమ్మేవారు. తర్వాత దిల్లీలోని హోటల్‌ హయత్‌ రీజెన్సీ సబ్బుల్ని ఆర్డర్‌ చేశాక వీటికి ఆదరణ మరింతగా పెరిగింది. ఈ బ్రాండ్‌ ప్రత్యేకత తెలుసుకున్న అంతర్జాతీయ బ్యూటీ బ్రాండ్‌ ఎస్టీలాడర్‌ కంపెనీ ఛైర్మన్‌ లియోనార్డ్‌ లాడర్‌... మీరాను అభినందించడానికి స్వయంగా వచ్చారు. ఆ సమయంలోనే భాగస్వామ్యంపై ఆసక్తి చూపించి 20శాతం వాటాను కొనుగోలు చేశారు. తర్వాత కాలంలో ఈ సంస్థ దేశవ్యాప్తంగా 115 స్టోర్‌లు ప్రారంభించింది. తాజ్‌ గ్రూప్‌, ది ఒబెరాయ్‌ వంటి 190కిపైగా ప్రముఖ హోటళ్లు వీళ్ల వినియోగదారులు. 120 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ నికర విలువ రూ.1,290 కోట్లు. అలా భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా గుర్తింపు పొందారు మీరా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్