దిశ చట్టానికి మోక్షం ఎప్పుడు?

తండ్రిలా ఆలోచించి ‘దిశ’ చట్టాలు తెస్తున్నాం. దిశ హత్యాచారం తప్పే అయినా నిందితుల్ని పోలీసులు కాల్చి చంపటమూ తప్పేనని హక్కుల కమిషన్‌, సుప్రీం కోర్టు కమిటీలు చెబుతాయి. ఇకపై ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ఘటనలు జరిగితే వాళ్లను శిక్షించేందుకు ఏ పోలీసు అధికారీ, ఏ ప్రభుత్వ పెద్ద ముందుకు రారు.

Published : 08 Aug 2023 04:29 IST

బిల్లులు ఆమోదం పొంది మూడున్నరేళ్లు
కేంద్రం సమ్మతి సాధనలో  వైకాపా సర్కారు ఘోర వైఫల్యం
31 మంది ఎంపీలున్నా ప్రయోజనం శూన్యం

ఈనాడు - అమరావతి

తండ్రిలా ఆలోచించి ‘దిశ’ చట్టాలు తెస్తున్నాం. దిశ హత్యాచారం తప్పే అయినా నిందితుల్ని పోలీసులు కాల్చి చంపటమూ తప్పేనని హక్కుల కమిషన్‌, సుప్రీం కోర్టు కమిటీలు చెబుతాయి. ఇకపై ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ఘటనలు జరిగితే వాళ్లను శిక్షించేందుకు ఏ పోలీసు అధికారీ, ఏ ప్రభుత్వ పెద్ద ముందుకు రారు. తప్పు చేసిన వాళ్లు యథేచ్ఛగా తిరుగుతారు. బాధితుల తల్లిదండ్రులు రోదిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టపరంగా ఏం చేయగలమనే ఆలోచనల్లోంచే దిశ చట్టం తీసుకొస్తున్నాం.

2019 డిసెంబరు 13న దిశ బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి

దిశ చట్టం అమలు కోసం వ్యవస్థలన్నీ సన్నద్ధం కావాలి. దీని అమలుకు ప్రత్యేకంగా ఓ ఐపీఎస్‌ అధికారిని నియమించాలి.

2019 డిసెంబరు 26న నిర్వహించిన సమావేశంలో జగన్‌

తానేదో మహిళల రక్షణకు దిగొచ్చిన ఆపద్బాంధవుడిలా ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. దిశ బిల్లులు ఆమోదం పొంది మూడున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ చట్టం రూపంలోకి తీసుకురాలేదు. అయినా ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు దిశ చట్టం అమలైపోతున్నట్లు, దాని కింద శిక్షలు కూడా పడినట్లు హోరెత్తించారు. ప్రచారంపై చూపిన శ్రద్ధ, చిత్తశుద్ధి బిల్లులు చట్టరూపం దాల్చేలా చేయటంలో మాత్రం కనబరచలేదు. ఈ బిల్లులు చట్టంగా మారాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం, రాష్ట్రపతి సమ్మతి తప్పనిసరి. వీటిలోని అంశాలపై లేవనెత్తుతున్న ప్రశ్నలు, సందేహాలు, అభ్యంతరాలకు జగన్‌ ప్రభుత్వం పంపిస్తున్న వివరణల పట్ల కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సంతృప్తి చెందకపోవటంతో అవి ఆమోదానికి నోచుకోవట్లేదు. సరైన మేధోమథనం చేయకుండా, పర్యవసానాలు ఆలోచించకుండా హడావుడిగా తీసుకురావటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

లోపభూయిష్టంగా ఉందని వెనక్కి..

హైదరాబాద్‌ శివారులో 2019 నవంబరు 28న ‘దిశ’ హత్యాచార ఘటన జరిగిన నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వం దిశ బిల్లులు ప్రవేశపెట్టింది. ఈ తరహా నేరాల్లో ఏడు రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లో న్యాయ విచారణ పూర్తి.. 21 రోజుల్లో శిక్షలు వేయించేలా ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ రెండు బిల్లులు రూపొందించింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ దిశ బిల్లు- క్రిమినల్‌ లా (ఏపీ సవరణ) బిల్లు-2019, ఆంధ్రప్రదేశ్‌ దిశ బిల్లు- ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలలపై జరిగే నిర్దేశిత నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు-2019 రాష్ట్ర ఉభయసభల్లో 2019 డిసెంబరు 16 నాటికి ఆమోదం పొందాయి. ఈ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించింది.

ఆంధ్రప్రదేశ్‌ దిశ బిల్లు- ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలలపై జరిగే నిర్దేశిత నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు-2019లో అనేక లోపాలు ఉండటంతో కేంద్రం అప్పట్లోనే దాన్ని తిప్పి పంపింది. మరో బిల్లుపై అభ్యంతరాలు తెలిపింది. దీంతో ‘ఆంధ్రప్రదేశ్‌ దిశ బిల్లు- ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలలపై జరిగే నిర్దేశిత నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు-2019’ను ఉపసహరించుకుని దాని స్థానంలో 2020 డిసెంబరు 3న ‘ఆంధ్రప్రదేశ్‌ దిశ (మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు) బిల్లు-2020’ను రూపొందించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు.

ఐపీసీకి సవరణలు ఎందుకు?

‘ఐపీసీలో కొన్ని సెక్షన్లు జోడిస్తూ, ప్రస్తుతం నిర్దేశించిన శిక్షల్ని పెంచుతూ బిల్లులో సవరణలు చేశారు. ఇప్పటికే ఉన్న నిర్దేశిత శిక్షల కాలాన్ని ఎలా పెంచుతారు? అవసరమైతే ప్రత్యేక స్థానిక చట్టాలు చేసుకోవచ్చు! ఐపీసీకి సవరణలు ఎందుకు?’ అంటూ కేంద్రం ప్రశ్నలు సంధించింది. ‘ఒక ఘటన జరిగిందని.. బాధితుల పేరుతో చట్టాలు తీసుకురావడం మొదలుపెడితే.. ఐపీసీ మొత్తం పేర్లతోనే నిండిపోతుంది. లైంగిక నేరాల్లో శిక్షపడిన వారి పేర్లతో కాకుండా నిందితులందరి వివరాలతో రిజస్ట్రీ తయారీ అవసరం ఏంటి?’ అని వివరణ అడిగింది. వీటికి ఏపీ ప్రభుత్వ వివరణలు సంతృప్తికరంగా లేకపోవటంతో మూడున్నరేళ్లు అవుతున్నా ఆ బిల్లులు చట్టరూపం దాల్చలేకపోతున్నాయి.

ఈ ప్రశ్నలకు బదులుందా?

కేంద్ర బిల్లులన్నింటికీ పార్లమెంటులో బేషరతుగా మద్దతిస్తున్న జగన్‌.. దిశ బిల్లులకు ఎందుకు ఆమోదం పొందలేక పోతున్నారు?
వైకాపాకు లోక్‌సభ, రాజ్యసభలో 31 మంది ఎంపీలున్నా ఎందుకు దిశ చట్టం రూపం దాల్చడంలేదు?
మూడున్నరేళ్లు దాటినా చట్టం రాలేదంటే.. ఇదేనా మహిళల రక్షణ పట్ల మీకున్న చిత్తశుద్ధి?
కేంద్రం వ్యక్తం చేసిన సందేహాలు నివృత్తి చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారు?
దిశ చట్టం తేవడానికి జగన్‌ ప్రభుత్వానికి ఇంకెన్నాళ్లు కావాలి?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని