logo

కాలువలపై కన్నేశారు!

అధికార పార్టీ వైకాపాకు చెందిన కొంతమంది నేతలు భూఆక్రమణలకు పాల్పడుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అధికార అండతో అందినకాడికి భూదందాలు సాగిస్తున్నారు.

Updated : 08 Aug 2023 06:35 IST

వైకాపానేతల చేతుల్లోకి రూ.కోట్ల విలువైన భూములు
ప్రొద్దుటూరు,రాజంపేటల్లోవెలుగులోకి   భూదందాల్కు

ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండు  సమీపంలో కొత్తపల్లె ఉప కాలువపై నిర్మిస్తున్న వాణిజ్య సముదాయం

అధికార పార్టీ వైకాపాకు చెందిన కొంతమంది నేతలు భూఆక్రమణలకు పాల్పడుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అధికార అండతో అందినకాడికి భూదందాలు సాగిస్తున్నారు. పసిడిపురిగా ఖ్యాతిచెందిన ప్రొద్దుటూరు పట్టణంలో భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. ఇదే అదునుగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడంతోపాటు భావితరాలకు ఉపయోగపడే పంట కాలువలను సైతం వదిలిపెట్టడంలేదు. వీటి స్థానంలో యథేచ్ఛగా భవంతులు నిర్మించేస్తున్నారు.

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు పట్టణం, రాజంపేట గ్రామీణ

ప్రొద్దుటూరు పట్టణ శివారున ఉన్న కేసీ కాలువకు చెందిన విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. ప్రొద్దుటూరు-చాగలమర్రి ప్రధాన రహదారిలో కేసీ కాలువకు సమీపాన ప్రొద్దుటూరు గ్రామ రెవెన్యూ పొలం పరిధిలో 159 (ఏ) సర్వే నెంబరులో ఎకరాకు పైగా కాలువకు చెందిన భూమి ఉంది. భూములకు ముందు భాగంలో పూర్వపు కాలంలో వర్షపాత నమోదు కేంద్రం కోసం రెండు గదులతో కూడిన భవనం నిర్మించారు. దాని వెనుక వైపున ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు కాలువ స్థలంలో యంత్రాలతో తవ్వకాలు చేపట్టి సరిహద్దు స్తంభాలను నాటుతూ ఆక్రమణలకు పాల్పడ్డారు. భూమినంతంటిని సొంత పొలంలా దుక్కి చేశారు. ఈ వ్యవహారమంతా బహిరంగంగా జరుగుతున్నా అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రాంతంలో బహిరంగ మార్కెట్‌లో సెంటు స్థలం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు పలుకుతుండగా ఆక్రమిత స్థలం రూ.కోటికిపైగానే విలువ చేస్తోంది. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించి స్థానికులు కేసీ కాలువ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కేసీ కాలువ ఏఈ జాన్సన్‌, జలవనరులశాఖ ఏఈ కొండారెడ్డి సంయుక్తంగా సచివాలయ సర్వేయరుతో స్థలాన్ని కొలతలు వేయించగా, కేసీ కాలువకు చెందిన భూమిగా గుర్తించారు. కేసీ కాలువ ఇరిగేషన్‌ శాఖకు చెందిన ఓ కీలక ఉద్యోగి కబ్జా వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆక్రమణపై అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైకాపా కీలక నేత ఆక్రమణలో భూమి ఉండడంతో అధికారులు స్వాధీనం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు.

చివరకు పోలీసు విశ్రాంత అధికారి సైతం...

ప్రొద్దుటూరు-చాగలమర్రి ప్రధాన మార్గంలో పై స్థలానికి ఎదుట ఉన్న మరో భూమిని ఓ పోలీసు విశ్రాంత అధికారి కబ్జాకు చేశారు. స్థలంలో పునాదులు నిర్మించి గోడల వరకు నిర్మాణం చేపట్టారు. సుమారు అరెకరాకుపైగా ఉన్న స్థలాన్ని అధికార పార్టీ కీలక నేత సహకారంతో ఆక్రమించుకున్నారు. ఈ వ్యవహారంపై కేసీ కాలువ పర్యవేక్షణాధికారులు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో తదుపరి నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ వ్యవహారం సర్దుమణిగిందనుకున్న తరుణంలో తిరిగి భవన నిర్మాణ పనుల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు.

ధ్వంస రచన కీలక నేత బంధువే...

రెండు నెలల కిందట ప్రొద్దుటూరు- మైదుకూరు రహదారిలో బొజ్జవారిపల్లె వద్ద ఉన్న కేసీ కాలువ లస్కర్‌ భవనాన్ని ఓ కీలక ప్రజాప్రతినిధి బంధువు గుట్టుచప్పుడు కాకుండా కూల్చేశారు. ఘటన జరిగిన కొద్ది రోజుల అనంతరం కూల్చివేత భవనం వెనుక వైపు వెంచర్‌ వేశారు. దాని కోసమే ధ్వంస రచన చేసినట్లు బయటపడింది.

వాణిజ్య సముదాయం నిర్మిస్తూ...

ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా ఓ లాడ్జి వెనుక వైపున కొత్తపల్లె కాలువకు చెందిన ఉప కాలువ ప్రవహిస్తుంది. దీనిపై ఓ వైకాపా నేత వాణిజ్య సముదాయం నిర్మిస్తున్నారు. సెంటు రూ.20 లక్షల వంతున ఆక్రమిత స్థలం 5 సెంట్లు కావడంతో రూ.కోటి విలువ చేస్తుంది. ఈ ఆక్రమణపై చివరకు అధికార పార్టీకి చెందిన వార్డు సభ్యుడు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఇందులోనూ కీలక నేత వాటా అందుకోవడంతో నిర్మాణ పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి.  

రాజంపేటలో భారీ కుంభకోణం...

రాజంపేట మండలం తాళ్లపాక రెవెన్యూ పరిధిలో ఎర్రబల్లి సమీపంలో ప్రభుత్వ స్థలం 3.50 ఎకరాల పొలాన్ని వైకాపా నేతలు ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్‌ సైతం చేయించుకున్నారు. ఎత్తుగడలో భాగంగా ఇద్దరి చేతులు మారినట్లుగా రెండుసార్లు రిజిస్ట్రేషన్‌ చేయించారు. జాతీయ రహదారి సమీపంలో ఉండడంతో స్థలం విలువ సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ విభాగం వత్తాసు పలకడంతో ఆక్రమార్కులు వ్యవహారం సవ్యంగా జరిగిపోయింది.

ప్రొద్దుటూరు-మైదుకూరు మార్గం బొజ్జవారిపల్లె సమీపంలో కూల్చేసిన కేసీ కాలువ భవనం వెనుక ఏర్పాటైన వెంచర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని