Nara Lokesh: రూ.లక్ష కోట్లున్న సీఎం పేదవారా?

రూ.లక్ష కోట్ల ఆస్తి పెట్టుకుని.. రూ.లక్ష విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతూ.. లీటరు రూ.1000 నీళ్లు తాగుతూ.. నాలుగుచోట్ల రాజప్రసాదాలు నిర్మించుకున్న జగన్‌ తాను పేదవాణ్నని చెప్పడం మైతోమానియా సిండ్రోమ్‌ ప్రభావం’ అని తెదేపా కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

Updated : 08 Aug 2023 10:39 IST

మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల దోపిడీ
నాలుగేళ్లలో వారి అక్రమార్జన రూ.1000 కోట్లు
పల్నాడు జిల్లా కారంపూడిలో నారా లోకేశ్‌ ధ్వజం

ఈనాడు, అమరావతి: ‘రూ.లక్ష కోట్ల ఆస్తి పెట్టుకుని.. రూ.లక్ష విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతూ.. లీటరు రూ.1000 నీళ్లు తాగుతూ.. నాలుగుచోట్ల రాజప్రసాదాలు నిర్మించుకున్న జగన్‌ తాను పేదవాణ్నని చెప్పడం మైతోమానియా సిండ్రోమ్‌ ప్రభావం’ అని తెదేపా కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా 177వ రోజు సోమవారం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కులమతాలు, ప్రాంతాల వారీగా ప్రజలు విడిపోవద్దని చాపకూడు సిద్ధాంతాన్ని అమలు చేసిన గొప్ప వ్యక్తి పల్నాటి బ్రహ్మనాయుడు అని గుర్తుచేశారు. ‘జగన్‌కు పని తక్కువ.. ప్రచారం ఎక్కువ. దిశ చట్టం, దిశ పోలీసుస్టేషన్లు, గన్‌ కంటే జగన్‌ ముందు వస్తాడనే ప్రచారం చేశారు. మదనపల్లిలో రెండు రోజుల కిందట రుక్సానా అనే అధ్యాపకురాలిని పొడిచి చంపినా, వెల్దుర్తి మండలం బొదిలవీడులో వైకాపా ఉప సర్పంచి కృష్ణమూర్తి ముగ్గురు మహిళలపై మూడు రోజులు వరుసగా దాడి చేసినా కేసు నమోదు చేయలేదు. రాష్ట్రంలో పూటకో అత్యాచారం.. రోజుకో హత్య జరుగుతుంటే సీఎం ఎక్కడున్నారు? జగన్‌ నాలుగేళ్ల పాలనలో 9సార్లు విద్యుత్తు ఛార్జీలు, మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలు, ఇంధనం, నిత్యావసరాల ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచారు. రాష్ట్రంలో ప్రతి మహిళ జగన్‌పై పోరాడాలి’ అని అన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకుని బతుకుతున్నారని, పసుపు జెండా చూస్తే పారిపోతారని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. వారిని పిల్లి బ్రదర్స్‌ అని ఎద్దేవా చేశారు. పిన్నెల్లి సోదరులు నాలుగేళ్లలో రూ.1000 కోట్లు అక్రమంగా ఆర్జించారని ఆరోపించారు. ‘జూలకంటి బ్రహ్మారెడ్డిని చూస్తే ఆ బ్రదర్స్‌ వణికిపోతున్నారు. 2024లో బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే కావడం ఖాయం’ అని అన్నారు.


ఎర్ర డైరీలో తొలి పేరు రిషాంత్‌రెడ్డిదే

చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి పేరును తన ఎర్ర డైరీలో తొలి పేరుగా నమోదు చేసుకున్నానని లోకేశ్‌ ప్రకటించారు. ‘రిషాంత్‌రెడ్డి కండువా వేసుకోని వైకాపా కార్యకర్త. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాళ్ల దాడి చేసినవారు ఆయనకు కనిపించలేదు. 9 నెలలు ఓపిక పడితే ఆయన కళ్లకు శస్త్రచికిత్స చేయించి అన్నీ కనిపించేలా చేస్తాం. ఆయన ఐపీఎస్‌ కాదు.. పీపీఎస్‌ (పాపాల పెద్దిరెడ్డి పబ్లిక్‌ సర్వీస్‌). ఆయనకు అంత సరదాగా ఉంటే పోలీసు దుస్తులు తీసేసి నీలం దుస్తులు వేసుకోవాలి. పులివెందులలో పిల్లవేషాలు వేస్తే మనవాళ్లు తరిమికొట్టారు. పుంగనూరులో పెద్దిరెడ్డి గ్యాంగ్‌ రెచ్చిపోతే మనవాళ్లు కరెంట్‌ షాక్‌ ఇచ్చారు’ అని అన్నారు. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన అనగానే తాడేపల్లి ప్యాలెస్‌ ఎందుకు భయపడిందంటూ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీబీఎన్‌ అంటే హైవోల్టేజ్‌.. ముట్టుకుంటే మాడి మాసైపోతావ్‌ అని లోకేశ్‌ హెచ్చరించారు. అధికారంలో ఉన్న పార్టీ బంద్‌కు పిలుపునివ్వడం  ఏనాడూ జరగని వింత అన్నారు. ఆర్టీసీ బస్సులపై దాడిచేయడం, అమరరాజ కంపెనీ ఉద్యోగులపై  చేయిచేసుకోవడం చూస్తుంటే జగన్‌ పని అయిపోయినట్లు అర్థమవుతోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని