logo

సహాయం అందకుంటే చెప్పండి

గోదావరి, శబరి నదుల వరదలతో నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ పేర్కొన్నారు. సోమవారం కూనవరం వచ్చిన ఆయన స్థానికంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు.

Published : 08 Aug 2023 04:02 IST

వరద బాధితులతో ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు రంపచోడవరం, చింతూరు, న్యూస్‌టుడే: గోదావరి, శబరి నదుల వరదలతో నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ పేర్కొన్నారు. సోమవారం కూనవరం వచ్చిన ఆయన స్థానికంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. గత నెల వరదల సమయంలో ప్రతి బాధితుడిని ఆదుకోవాలని, వారికి కావాల్సిన సాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. వరదలు వచ్చినప్పుడు ఫొటోలు దిగే ముఖ్యమంత్రిని కానని తెలిపారు. బాధితులను ఆదుకునేలా ప్రణాళికలు వేసి తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. దీనికోసం వారంపాటు కలెక్టర్‌తో సహా అధికారులంతా ముంపు ప్రాంతాల్లోనే ఉండి బాధితులను అన్నివిధాలా ఆదుకున్నారని చెప్పారు. సహాయ కార్యక్రమాల్లో ఏమాత్రం అలసత్వం లేకుండా సచివాలయాల నుంచి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి తోడ్పాటు అందేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

బాధితుల్లో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా కలెక్టర్‌ ద్వారా సహాయ కార్యక్రమాలు చేపట్టామని, ఎవరైనా అందని వాళ్లుంటే ముందుకొచ్చి చెప్పాలని సీఎం పేర్కొన్నారు. అందరికీ మంచి జరగాలనే తాపత్రయంతో పనిచేస్తున్న ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. ఇళ్లలోకి నీరు వచ్చిన ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు, రూ. రెండు వేల సహాయం చేయాలని ఆదేశించామని తెలిపారు. కచ్చా ఇళ్లు, మామూలు ఇళ్లు దెబ్బతింటే రూ. 10 వేలు పరిహారం చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపారు.

ఉదయం 7 గంటల నుంచే హెలిప్యాడ్‌ నుంచి కూనవరం వరకు రాకపోకలు నిలిపివేయడంతో భద్రాచలం నుంచి కూనవరం మీదుగా రాజమండ్రి, కాకినాడ వెళ్లే బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కూనవరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ఉపాధ్యాయులు రాకపోకలు సాగించే వీలులేక ఇంటిముఖం పట్టారు. సీఎం పర్యటనకు ఏర్పాటు చేసిన భారీ బందోబస్తుతో పలు గ్రామాల ప్రజలు సభా ప్రాంగణానికి రాలేకపోయారు. కూనవరం మండలంలోని కోండ్రాజుపేట వద్దే వాహనాలు, ప్రజలు నిలిపివేయడంతో చాలామంది సభా ప్రాంగణానికి చేరుకోలేకపోయారు. సభా ప్రాంగణానికి చేరుకోలేని కొందరు పోలవరం ప్యాకేజీపై సీఎం ఏం ప్రకటిస్తారా అని ఫోన్లలో చూసుకున్నారు.

 

నాలుగు కిలోమీటర్ల పొడవునా బ్యారికేడ్లు

గన్‌ కూనవరం పర్యటనను పురస్కరించుకుని సుమారు నాలుగు కిలోమీటర్ల మేర బ్యారికేడ్లతో రహదారులు దిగ్బంధం చేశారు. ఆయన హెలికాప్టర్‌లో   కోతులగుట్ట వద్ద దిగారు. అక్కడి నుంచి కూనవరం బస్టాండులో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం సుమారు నాలుగు కిలోమీటర్లు. హెలిప్యాడ్‌ దగ్గర నుంచి సభా ప్రాంగణం వరకు బ్యారికేడ్లతో మూసేశారు. దీంతో టేకులబోరు గ్రామంలోని ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది.


పర్యటన కొంత ఆలస్యం

ముఖ్యమంత్రి పర్యటన కొంత ఆలస్యమైంది. కోతులగుట్టలోని హెలిప్యాడ్‌కు ఉదయం 10.25 గంటలకు రావాల్సి ఉండగా 10.55 గంటలకు చేరుకున్నారు. దీంతో అక్కడ నుంచి నేరుగా సభా ప్రాంగణానికి వచ్చేశారు. తిరుగు ప్రయాణంలో హెలిప్యాడ్‌కు చేరుకున్న తరవాత స్థానిక నాయకులతో, అధికారులతో చాలాసేపు మాట్లాడారు. సాయంత్రం 3.55 గంటలకు కుక్కునూరు మండలానికి ప్రయాణమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని