Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 11 Aug 2023 09:13 IST

1. ప్రైవేటు టీచర్లకూ జగన్‌ దగా!

మాయ మాటలతో ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్చరర్లను నమ్మించిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమాన్ని గాలికొదిలేశారు. కనీస వేతనాలు, ఆరోగ్య బీమా, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి సదుపాయాలను అమలు చేసేందుకు నాలుగేళ్లుగా ఒక్క చర్యా తీసుకోలేదు. కొవిడ్‌-19 సమయంలో ఉపాధి కష్టమై బతుకుదెరువు కోసం వారు తీవ్ర ఇబ్బందులు పడినా ప్రభుత్వం మాత్రం ఎలాంటి సాయం చేయలేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వాలంటీర్లు విలవిల

సీఎం పర్యటన ఉందంటే ఆ ప్రాంతంలోని అధికారులు, సామాన్యులు, వాలంటీర్లకూ ఇక్కట్లు తప్పడం లేదు. శుక్రవారం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురానికి సీఎం వస్తున్న నేపథ్యంలో వాలంటీర్లకు విధులు కేటాయించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా వాలంటీర్లు ఎండలో నిల్చోలేక విలవిల్లాడారు. తలపై చున్నీలతో ఉపశమనం పొందారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భోళాశంకర్‌ చిత్రానికి సంబంధించి డాక్యుమెంట్లు సమర్పించలేదు: ఏపీ ప్రభుత్వం

చిరంజీవి నటించిన భోళాశంకర్‌ సినిమా టికెట్‌ ధరల పెంపునకు సంబంధించి వివిధ పత్రాలు, డాక్యుమెంట్లు అందజేయాలంటూ నిర్మాణ సంస్థ అడ్వెంచర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను కోరామని, అయితే ఇప్పటివరకు వాటిని సమర్పించలేదని ప్రభుత్వం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. చిత్ర నిర్మాణ సంస్థ జులై 30న ఏపీ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ)కు అర్జీ పంపిందని పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. TSPSC: గ్రూప్‌-2.. కింకర్తవ్యం?

గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని కొందరు.. వద్దంటూ మరికొందరు విజ్ఞప్తులు చేస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. పరీక్షలను షెడ్యూలు ప్రకారమే నిర్వహించాలని కమిషన్‌ సహాయ కేంద్రానికి కొందరు అభ్యర్థులు విజ్ఞప్తులు పంపించారు. పరీక్ష కోసం ఉద్యోగాలకు సెలవులు పెట్టామని, రాజీనామా చేశామని.. ఎనిమిది నెలలుగా సన్నద్ధమవుతున్నామని వారు చెబుతున్నారు. అయితే వచ్చిన విజ్ఞప్తులపై టీఎస్‌పీఎస్సీ ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పాలమూరుకు పర్యావరణ అనుమతులు

పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతి లభించింది. పథకం నిర్మాణపనులు వేగంగా చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల (రెండో దశ: సాగునీరు) నిర్మాణానికి పర్యావరణ అనుమతుల కమిటీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. న్యాక్‌లో గ్రేడింగ్‌ ఉండదు!

దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలకు ఇచ్చే జాతీయ గుర్తింపు, మదింపు కమిటీ(న్యాక్‌) గ్రేడింగ్‌లో కీలక మార్పులు రానున్నాయి. కేంద్రం ఏర్పాటు చేసిన ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరిరంగన్‌ కమిటీ ఇటీవల పలు సంస్కరణలకు సిఫార్సు చేసింది. వచ్చే డిసెంబరు నాటికి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రోడ్‌మ్యాప్‌ అందజేసింది. వచ్చే రెండు నెలల్లో కేంద్రం దీనిపై  తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుందని  న్యాక్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ సహస్రబుద్దే ‘ఈనాడు’తో మాట్లాడుతూ చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఐదేళ్లలో రామప్ప ఆలయానికి రూ.4.93 కోట్ల ఖర్చు

తెలంగాణలోని ప్రఖ్యాత రామప్ప ఆలయ నిర్వహణకు గత అయిదేళ్లలో రూ.4.93 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ఇందులో 2018-19 నుంచి 2021-22 వరకు రూ.2.30 కోట్లు వెచ్చించగా, 2022-23లో రూ.2.63 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాజ్యసభలో గురువారం భాజపా సభ్యుడు కె.లక్ష్మణ్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 12 ఏళ్లలో పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు 16.63 లక్షలు

గత పుష్కర కాలంలో 16,63,440 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు. గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘2014 నుంచి 2022 మధ్యకాలంలో 2,46,580 మంది భారతీయులు పాస్‌పోర్టులను సరెండర్‌ చేశారు. వీరిలో ఏపీకి చెందినవారు 9,235, తెలంగాణ వారు 7,256 మంది ఉన్నార’ని మంత్రి తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమెరికాలో భారత స్వాతంత్య్ర వేడుకకు రవిశంకర్‌, సమంత

అమెరికాలోని భారత సంతతి అమెరికన్లు ఈ నెల 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌ నగర వీధుల్లో జరిపే వార్షిక ప్రదర్శనకు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ సారథ్యం వహించనున్నారు. నటీమణి సమంత ప్రధాన అతిథిగా, బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ గౌరవ అతిథిగా పాల్గొంటారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 50 ఏళ్ల తర్వాత.. మళ్లీ జాబిల్లిపైకి రష్యా రాకెట్‌

దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడిపైకి ‘లునా - 25’ పేరుతో రాకెట్‌ను రష్యా ప్రయోగించింది. ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్‌ విడుదల చేసిన చిత్రాల ప్రకారం.. మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ ప్రాంతం నుంచి శుక్రవారం వేకువజామున 2.10 గంటలకు ‘లునా - 25’ నింగిలోకి దూసుకెళ్లింది. కేవలం ఐదు రోజుల్లోనే ఇది చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని