ప్రైవేటు టీచర్లకూ జగన్‌ దగా!

కార్పొరేట్‌, ప్రైవేటు విద్యా సంస్థల టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాం. మన ప్రభుత్వం రాగానే ఏకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి చట్టాన్ని తీసుకొస్తాం.

Published : 11 Aug 2023 04:52 IST

ఈఎస్‌ఐ, కనీస వేతనం, ఆరోగ్య బీమా అమలు చేస్తామని ఊదరగొట్టిన వైనం
అధికారంలోకి వచ్చాక హామీల తెప్ప తగలేసిన సీఎం
కరోనా సమయంలోనూ కనికరం చూపని ప్రభుత్వం
ఈనాడు, అమరావతి


అంతన్నారు.. ఇంతన్నారు..!

కార్పొరేట్‌, ప్రైవేటు విద్యా సంస్థల టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాం. మన ప్రభుత్వం రాగానే ఏకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి చట్టాన్ని తీసుకొస్తాం. కనీస వేతనం, రెగ్యులర్‌గా జీతాలు, పని గంటలు, సెలవులు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, హెల్త్‌ ఇన్సూరెన్‌్్స తదితర నియమ, నిబంధనలన్నీ వర్తించే విధంగా ఈ చట్టం ఉంటుంది..

 పాదయాత్రలో కృష్ణా జిల్లా దావాజీగూడెం సమీపంలో ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇది..


ఆకలితో అలమటించినా పట్టించుకోలేదు..

ఎన్నికల ముందు ప్రైవేటు టీచర్లకు ఎన్నో చేస్తానంటూ హామీ ఇచ్చిన సీఎం జగన్‌.. ఎన్నికల ఏరు దాటాక హామీల తెప్ప తగలేశారు. కరోనా సమయంలో ఉద్యోగాలు పోయి వారి కుటుంబాలు ఆకలితో అలమటించినా జగన్‌ ఏ మాత్రం కరుణ చూపలేదు. కనీసం రూ.5 వేల చొప్పున సాయం చేయాలని విన్నవించుకున్నా పట్టించుకోలేదు. కనీస వేతనం, పని గంటలు, హెల్త్‌ ఇన్సూరెన్సు అమలు జగన్‌ మాటల్లోనే మిగిలిపోయాయి. పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేసినా దీనికి గత ఏడాది అక్టోబరు నుంచి పాలకవర్గమే లేదు.


మాయ మాటలతో ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్చరర్లను నమ్మించిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమాన్ని గాలికొదిలేశారు. కనీస వేతనాలు, ఆరోగ్య బీమా, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి సదుపాయాలను అమలు చేసేందుకు నాలుగేళ్లుగా ఒక్క చర్యా తీసుకోలేదు. కొవిడ్‌-19 సమయంలో ఉపాధి కష్టమై బతుకుదెరువు కోసం వారు తీవ్ర ఇబ్బందులు పడినా ప్రభుత్వం మాత్రం ఎలాంటి సాయం చేయలేదు. గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కొందరు ఉపాధి కోసం సెక్యూరిటీ గార్డులుగా.. కూలీలుగా.. కరోనా రోగులకు మందులు సరఫరా, హోటల్‌ నిర్వహణ.. రోడ్డు పక్కన దుస్తుల వ్యాపారులుగా పని చేశారు. ఎంతో కొంత సాయం చేసి తమను ఆదుకోవాలని వేడుకున్నా సీఎం జగన్‌ దయచూపలేదు. ఇప్పటి వరకు కనీసం వారి గోడు వినేందుకూ జగన్‌ సమయాన్ని కేటాయించలేదు. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేసినా ఇది ప్రైవేటు ఉపాధ్యాయుల గురించి పట్టించుకోలేదు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎంత మంది పనిచేస్తున్నారన్న లెక్కలను సైతం ఇంతవరకు తీసుకోలేదు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు చూస్తే.. ప్రైవేటు విద్యా సంస్థల్లో 3.50 లక్షల మంది పని చేస్తున్నారు. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లోనే 1.70 లక్షల మంది ఉంటారని అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్న రంగం ఇంకొకటి లేదు. ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని గొప్పగా చెప్పే సీఎం జగన్‌ ప్రైవేటు టీచర్ల విషయంలో మాట తప్పి.. మడమ తిప్పేశారు. వీరి సమస్యను ప్రభుత్వం అసలు ఒక అంశంగా చూస్తున్న పరిస్థితే కనిపించడం లేదు.


పెద్ద బాధ్యత.. ఎన్నో ఇబ్బందులు

పాధ్యాయులుగా పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన పెద్ద బాధ్యత వారిపై ఉన్నా కొన్నిచోట్ల తక్కువగా జీతాలు ఉంటున్నాయి. వారంలో ఒక్క రోజు సెలవు లభించడమూ కష్టంగా మారుతోంది. ఉదయం పాఠశాలకు వెళ్లింది మొదలు.. సాయంత్రం ఇంటికి వచ్చే వరకు విరామం లేకుండా బోధించాల్సిన పరిస్థితి ఉంటోందని ప్రైవేటు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కుటుంబాలకు ఆర్థిక భద్రత లేకుండాపోతోందని, ఏదైనా అనుకోని ఘటన ఎదురైతే కుటుంబం మొత్తం రోడ్డున పడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వీరికి ప్రత్యేకంగా ఆరోగ్య కార్డులు లేదా బీమా అమలు చేయడం లేదు. నవరత్నాల్లో ఇచ్చే వాటినే ఇస్తోంది. కొన్నిచోట్ల పట్టణాల్లో నెలకు రూ.12 వేలు, గ్రామాల్లో నెలకు రూ.10 వేల కంటే ఆదాయం ఎక్కువగా ఉందని పథకాల్లోనూ కోత విధిస్తోంది. ఈ రంగంలో ఎక్కువ మంది ఉండటంతో ఓట్ల కోసం జగన్‌ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. వీటిని నమ్మి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చాక ఈ వర్గం వారిని పూర్తి నిర్లక్ష్యం చేశారు. వీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే పరిస్థితి లేకవడంతో జగన్‌ సర్కారు మొద్దునిద్ర నటిస్తోంది.  


ప్రభుత్వం ఆరోగ్య కార్డులు ఇవ్వాలి

ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం జగన్‌ హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా ఇంతవరకు ఒక్కటీ పరిష్కరించలేదు. ప్రభుత్వం ఆరోగ్య కార్డులు ఇవ్వాలి. సెలవులు, పని గంటలు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అమలు చేసేలా చూడాలి. సమస్యలను పరిష్కరించేందుకు జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. మరణించిన ప్రైవేటు ఉపాధ్యాయుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి.

 దిద్దే అంబేద్కర్‌, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల సంఘం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని