TSPSC: గ్రూప్‌-2.. కింకర్తవ్యం?

గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని కొందరు.. వద్దంటూ మరికొందరు విజ్ఞప్తులు చేస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. అయితే వచ్చిన విజ్ఞప్తులపై టీఎస్‌పీఎస్సీ ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు.

Updated : 11 Aug 2023 11:18 IST

పరీక్షల వాయిదాకు కొందరు.. వద్దని మరికొందరు పట్టు
ఎలాంటి నిర్ణయం తీసుకోని టీఎస్‌పీఎస్సీ

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని కొందరు.. వద్దంటూ మరికొందరు విజ్ఞప్తులు చేస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. అయితే వచ్చిన విజ్ఞప్తులపై టీఎస్‌పీఎస్సీ ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. గ్రూప్‌-2 ఉద్యోగాలకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. పరీక్షల షెడ్యూలును కమిషన్‌ ఆరు నెలల క్రితమే ప్రకటించింది. మరోవైపు, ఆగస్టులో గురుకుల పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. దీంతో గురుకుల, గ్రూప్‌-2 పోస్టులు రెండింటికీ దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. వాటిలో ఏదో ఒక పరీక్షను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్షను వాయిదా వేయాలంటూ గురువారం కమిషన్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మరోవైపు, పరీక్షలను షెడ్యూలు ప్రకారమే నిర్వహించాలని కమిషన్‌ సహాయ కేంద్రానికి మరికొందరు అభ్యర్థులు విజ్ఞప్తులు పంపించారు. పరీక్ష కోసం ఉద్యోగాలకు సెలవులు పెట్టామని, రాజీనామా చేశామని.. ఎనిమిది నెలలుగా సన్నద్ధమవుతున్నామని వారు చెబుతున్నారు. కాగా, గ్రూప్‌-2 పరీక్షలను షెడ్యూలు ప్రకారమే నిర్వహించేందుకు కమిషన్‌ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన విద్యాసంస్థలకు సెలవులూ ప్రకటించింది. వాయిదా వేస్తే భవిష్యత్తులో పరీక్ష తేదీలు దొరకడం కష్టమని కమిషన్‌ వర్గాలు భావిస్తున్నాయి.

హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు

గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలంటూ డి.మహేశ్‌తో పాటు 150 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గురుకుల నియామక బోర్డు, పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు ఉన్నందువల్ల.. ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించతలపెట్టిన గ్రూప్‌-2 పరీక్షను రీషెడ్యూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని