పాలమూరుకు పర్యావరణ అనుమతులు

పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతి లభించింది. పథకం నిర్మాణపనులు వేగంగా చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల (రెండో దశ: సాగునీరు) నిర్మాణానికి పర్యావరణ అనుమతుల కమిటీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది.

Updated : 11 Aug 2023 07:12 IST

పర్యావరణానికి రూ.153.70 కోట్ల నష్టం
ఆ మొత్తాన్ని పీసీబీ వద్ద జమ చేయాలని  ఈఏసీ షరతు
సాగునీటి నిర్మాణ పనులకు లైన్‌ క్లియర్‌

ఈనాడు, హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతి లభించింది. పథకం నిర్మాణపనులు వేగంగా చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల (రెండో దశ: సాగునీరు) నిర్మాణానికి పర్యావరణ అనుమతుల కమిటీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని పర్యావరణ అనుమతుల కమిటీ (ఈఏసీ) గత నెల 24వ తేదీన నిర్వహించిన 49వ సమావేశం మినిట్స్‌ను గురువారం విడుదల చేసింది. ఈ ఎత్తిపోతల పనుల్లో పర్యావరణపరమైన ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని.. దానికి సంబంధించి ఉపశమన చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు అథారిటీని ఈఏసీ ఆదేశించింది. ఆయా చర్యలను నిర్దేశిస్తూ.. ఆమోదం తెలిపింది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 12.38 లక్షల ఎకరాలకు సాగునీరు, వేల గ్రామాలకు తాగునీరు అందించేందుకు 2016లో ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం చేపట్టింది. శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి రోజుకు 1.5 టీఎంసీ చొప్పున అరవై రోజుల్లో 90 టీఎంసీలను ఎత్తిపోసేందుకు ఈ పనులు ప్రారంభించింది. 4 లిఫ్టులు, అయిదు జలాశయాలు ఉన్నాయి. నార్లాపూర్‌ జలాశయం 89.44 శాతం, ఏదుల 90, వట్టెం 70, కరివెన 60, ఉదండాపూర్‌ జలాశయం 48 శాతం పనులు పూర్తయ్యాయి. వివిధ దశల్లో పనులు పూర్తయినట్లు 31.10.2021 నాటికి ఈఏసీ నిర్వహించిన అధ్యయన నివేదిక పేర్కొంటోంది.


మినిట్స్‌లో పేర్కొన్న షరతులు ఇవే..

  • పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణం సందర్భంగా దెబ్బతిన్న పర్యావరణ సమతౌల్యం, సామాజిక పరిస్థితులను సరిచేసేందుకు రూ.153.70 కోట్లు కేటాయించాలి. రానున్న మూడేళ్ల కాలంలో దీనికి సంబంధించిన ప్రత్యేక ప్రణాళిక ద్వారా నష్టాన్ని పూడ్చేందుకు చర్యలు చేపట్టాలి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రణాళిక ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం అయిదేళ్ల కాలానికి రూ.153.70 కోట్లకు పీసీబీకి బ్యాంకు గ్యారంటీ చూపాలి.
  • జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గతంలో చేసిన సూచనలను అమలు చేయాలి.
  • రాష్ట్ర అటవీశాఖ, స్థానిక పంచాయతీల నేతృత్వంలో ప్రతిపాదిత జలాశయాల పరిధిలో 500 మీటర్ల వెడల్పుతో పచ్చదనం (గ్రీన్‌ కవర్‌) పెంచాలి. గతంలో ఆ ప్రాంతంలో ఉన్న మొక్కలనే పెంచాలి. వాటర్‌షెడ్‌ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి. జీవవైవిధ్య, వన్యప్రాణి సంరక్షణ చర్యలు తీసుకోవాలి.
  • ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలి. శుద్ధి చేసిన నీటిని అందించాలి. ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, ఫిట్టర్‌ తదితర రంగాల్లో శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను పెంపొందించాలి.
  • ప్రాజెక్టు ప్రారంభమైన అయిదేళ్ల తరువాత పర్యావరణంపై ప్రాజెక్టు ప్రభావం ఎలా ఉందనే అధ్యయనం జరగాలి. పది కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల వారికి గోబర్‌ గ్యాస్‌, సౌరశక్తి పలకలు అందించాలి.
  • ముంపు బాధిత కుటుంబాలకు (పీఏఎఫ్‌ఎస్‌) ఉద్యోగ శిక్షణకు సంస్థాగతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

పాలమూరు పాదాలు కడిగే రోజు ఆసన్నమైంది

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించడం సంతోషకరం. కృష్ణమ్మ నీటితో పాలమూరు పాదాలు కడిగే రోజు ఆసన్నమైంది. ఎన్నో కేసులు, అడ్డంకులను ఎదుర్కొని, అకుంఠిత దీక్షతో ఈ అనుమతులను సాధించాం. ఇది తెలంగాణ సాధించిన మరో అద్భుత, చారిత్రక విజయం. ఇందుకు కృషి చేసిన నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్‌ అధికారులకు అభినందనలు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ పథకం తొలిదశ పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. ఇక రెండోదశ పనులూ వేగంగా కొనసాగుతాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్‌


మధుర ఘట్టం: హరీశ్‌రావు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు రావడం అపూర్వమైన ఆనందాన్నిస్తోందని.. ఇది మాటల్లో వర్ణించలేని మధురఘట్టమని వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ కుట్రలను ఛేదించి, కేసులను అధిగమించి దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానుంది. ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాధించిన మరో చారిత్రక విజయం’ అని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని