న్యాక్‌లో గ్రేడింగ్‌ ఉండదు!

దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలకు ఇచ్చే జాతీయ గుర్తింపు, మదింపు కమిటీ(న్యాక్‌) గ్రేడింగ్‌లో కీలక మార్పులు రానున్నాయి. కేంద్రం ఏర్పాటు చేసిన ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరిరంగన్‌ కమిటీ ఇటీవల పలు సంస్కరణలకు సిఫార్సు చేసింది.

Published : 11 Aug 2023 05:59 IST

ఇకపై 3 రకాల విధానం
గుర్తింపు పొందినవి, పొందనివి, గుర్తింపునకు దగ్గరలో ఉన్నవి
కస్తూరిరంగన్‌ కమిటీ సిఫార్సు

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలకు ఇచ్చే జాతీయ గుర్తింపు, మదింపు కమిటీ(న్యాక్‌) గ్రేడింగ్‌లో కీలక మార్పులు రానున్నాయి. కేంద్రం ఏర్పాటు చేసిన ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరిరంగన్‌ కమిటీ ఇటీవల పలు సంస్కరణలకు సిఫార్సు చేసింది. వచ్చే డిసెంబరు నాటికి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రోడ్‌మ్యాప్‌ అందజేసింది. వచ్చే రెండు నెలల్లో కేంద్రం దీనిపై  తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుందని  న్యాక్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ సహస్రబుద్దే ‘ఈనాడు’తో మాట్లాడుతూ చెప్పారు.

సమ్మిళిత అక్రిడిటేషన్‌...

ప్రస్తుతం 4 పాయింట్లకుగాను ఆయా విద్యాసంస్థలు పొందిన పాయింట్ల ఆధారంగా ఎనిమిది రకాల గ్రేడ్లు ఇస్తున్నారు. ఏ ++, ఏ +, ఏ, బీ++, బీ+, బీ, సి, డి గ్రేడ్లు ఉన్నాయి. డి అంటే గుర్తింపు పొందలేదని అర్థం. ఇక నుంచి అక్రిడిటేషన్‌కు ‘మూడు రకాల’ విధానం ఉంటుంది. విద్యా సంస్థల్ని గుర్తింపు దక్కించుకున్నవి, గుర్తింపు పొందటానికి దరిదాపులో ఉన్నవి, గుర్తింపు పొందనివిగా పరిగణిస్తారు. ప్రస్తుతం విద్యాసంస్థల వారీగా న్యాక్‌... ఆయా బ్రాంచీల వారీగా నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) గుర్తింపు ఇస్తోంది. వాటన్నింటిని మిళితం చేసి ఒకటే అక్రిడిటేషన్‌ ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది.

ఆరు కేటగిరీలుగా విద్యాసంస్థలు

విద్యాసంస్థలను ఆరు కేటగిరీలుగా విభజిస్తారు. అవి.. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇంటెన్సివ్‌; పరిశోధన; విద్యాబోధన; స్పెషలైజ్‌డ్‌ కోర్సులున్నవి; ఒకేషన్‌ అండ్‌ స్కిల్‌ ఇంటెన్సివ్‌; కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ అండ్‌ సర్వీస్‌. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా అన్ని విద్యాసంస్థలను బహుళ కోర్సుల విద్య, పరిశోధనా సంస్థలుగా మార్చేందుకు ప్రయత్నిస్తారు.

ఒక దేశం - ఒక డేటా

ఇక నుంచి ఒక దేశం - ఒక డేటాను అమలు చేస్తారు. విద్యా సంస్థలు ఏ సమాచారమైనా ఆ పోర్టల్‌కు పంపించాలి. ఆయా కేంద్ర సంస్థలు దాని నుంచి డేటాను స్వీకరించి అక్రిడిటేషన్‌ ఇస్తాయి.దీనిపై హెచ్‌సీయూ సీనియర్‌ ఆచార్యుడు బెల్లంకొండ రాజశేఖర్‌ మాట్లాడుతూ ఇలా చేస్తే విద్యాసంస్థలపై భారం తగ్గుతుందని, విద్యాపరమైన వ్యవహారాలపై ఆచార్యులు దృష్టి పెట్టడానికి వీలవుతుందన్నారు.


ముఖ్య సిఫార్సులు ఇలా...

  • ప్రస్తుతం ఐఐటీలు న్యాక్‌ గుర్తింపు పొందటం లేదు. ఇక నుంచి అవి కూడా జాతీయ అక్రిడిటేషన్‌ విధానంలోకి రావాలి.
  • విద్యాసంస్థలు ఇచ్చే సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. దానివల్ల యాజమాన్యాలు ఇచ్చిన సమాచారం తప్పు అయితే ఫిర్యాదులు వస్తాయి. సమాచారం తప్పని రుజువైతే భారీ జరిమానా విధిస్తారు.
  • అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఏటా విద్యాసంస్థలకు అనుమతులు ఇచ్చే విధానాన్ని విరమించుకోవాలి.
  • తొలిసారి అక్రిడిటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మరీ కఠినంగా వ్యవహరించకుండా ప్రోత్సహించేలా ఉండాలి. ప్రస్తుతం అక్రిడిటేషన్‌ను అయిదేళ్లకు ఇస్తుండగా ప్రతి మూడేళ్లకు ఇవ్వాలి.
  • సంస్థలకు గుర్తింపు ఇచ్చేముందు విద్యార్థుల అభిప్రాయాలను మాత్రమే న్యాక్‌ పరిగణనలోకి తీసుకుంటోంది. ఇక నుంచి నిధులిచ్చే సంస్థలు, పరిశ్రమల అభిప్రాయాలనూ తీసుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని