Russia: ఐదు దశాబ్దాల తర్వాత.. మళ్లీ జాబిల్లిపైకి దూసుకెళ్లిన రష్యా రాకెట్‌

దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి ‘లునా - 25’ పేరుతో రాకెట్‌ను రష్యా ప్రయోగించింది. మన చంద్రయాన్‌-3 కంటే ముందే ఇది జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండ్‌ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Updated : 11 Aug 2023 09:54 IST

(Image Source: RT Twitter)

మాస్కో: దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత చంద్రుడిపైకి రష్యా మళ్లీ ప్రయోగం చేపట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువమే లక్ష్యంగా ‘లునా - 25’ పేరుతో రాకెట్‌ను ప్రయోగించింది. ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్‌ విడుదల చేసిన చిత్రాల ప్రకారం.. మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ ప్రాంతం నుంచి శుక్రవారం వేకువజామున 2.10 గంటలకు ‘లునా - 25’ నింగిలోకి దూసుకెళ్లింది.

కేవలం ఐదు రోజుల్లోనే ఇది చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఆ తర్వాత జాబిల్లి (Moon)పై ఎవరూ చేరని దక్షిణ ధ్రువంలో.. మరో 3 లేదా 7 రోజుల్లో ల్యాండర్‌ను దిగేలా ఈ ప్రయోగం చేపట్టారు. అన్ని అనుకూలంగా జరిగితే ఆగస్టు 21వ తేదీన ఈ ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనున్నట్లు రోస్‌కాస్మోస్‌ అధికారులు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ తర్వాత ఏడాది పాటు ఇది జాబిల్లిపై పరిశోధనలు జరపనుంది. 1976 తర్వాత రష్యా చేపట్టిన తొలి లూనార్‌ ల్యాండర్‌ ప్రయోగం ఇదే.

ఇప్పటివరకు ఏ దేశ అంతరిక్ష నౌక కూడా చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై ‘చంద్రయాన్-3’ ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న ఇస్రోకు (ISRO).. ‘లునా-25’ ప్రయోగంతో రష్యా (Russia) పోటీ ఇస్తోంది. చంద్రయాన్-3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న ల్యాండ్ కానుండగా.. అంతకంటే ముందే రష్యా పంపిన లూనా-25 అక్కడే అడుగుపెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే, చంద్రయాన్‌-3 మాదిరి కాకుండా ఇది కేవలం ల్యాండర్‌ మిషన్‌ మాత్రమే. కేవలం 30 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్తోంది. ఇందులో చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్‌ చేతులు, డ్రిల్లింగ్‌ హార్డ్‌వేర్‌తో పాటు ఇతర శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి.

చంద్రయాన్‌-3కి ఇబ్బందులుంటాయా?

జాబిల్లి దక్షిణ ధ్రువంలో గణనీయమైన పరిమాణంలో మంచు ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడ ల్యాండింగ్‌ సవ్యంగా జరిగితే ఆక్సిజన్‌, ఇంధనం, నీరు వంటి వనరులపై సమాచారం సేకరించే అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలోనే దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23 కంటే ముందే లూనా-25 ల్యాండర్‌ దిగితే అక్కడ అడుగుపెట్టిన తొలి దేశంగా రష్యా చరిత్ర సృష్టించనుంది. అయితే చంద్రయాన్‌-3, లూనా-25 రెండూ దక్షిణ ధ్రువంపై ల్యాండ్‌ అయితే అవి ఢీకొనే ప్రమాదం ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రష్యా స్పష్టతనిచ్చింది. ఈ రెండు అంతరిక్ష సంస్థలు ల్యాండింగ్‌ చేయాలనుకున్న ప్రాంతాలు వేర్వేరని పేర్కొంది. అందువల్ల అవి ఢీకొనే ప్రమాదం లేదని వెల్లడించింది.

ఇక, చంద్రయాన్‌-3లో ల్యాండర్‌, రోవర్‌ ప్రొపల్షన్‌ మాడ్యూల్స్‌ ఉన్నాయి. గతంలో చంద్రయాన్‌-2 ప్రయోగం సందర్భంగా ఇస్రో పంపించిన ఆర్బిటర్‌ ఇంకా కక్ష్యలో తిరుగుతోంది. చంద్రయాన్‌-3కి కూడా అదే ఆర్బిటర్‌ను వినియోగించుకోనున్నారు. ఇక, చంద్రయాన్‌-3 పంపే ల్యాండర్‌ జాబిల్లిపై 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. రష్యా పంపే లూనా-25 ఏడాదిపాటు జాబిల్లి ఉపరితలంపై పనిచేయనుంది.

ఇస్రో అభినందనలు

లూనా-25ని విజయవంతంగా ప్రయోగించడంపై రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్‌కు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అభినందనలు తెలియజేసింది. ‘‘ఈ అంతరిక్ష ప్రయాణంలో మనకు మరో మీటింగ్‌ పాయింట్‌ ఉండటం అద్భుతం’’ అని ట్విటర్‌లో రాసుకొచ్చింది. చంద్రయాన్‌-3, లూనా-25 మిషన్లు తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని