TTD: తిరుమలలో పెరుగుతున్న రద్దీ ... సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఈవో ఆదేశం

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో సేవలు అందించాలని తితిదే ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు. అన్నమయ్య భవన్‌లో శుక్రవారం

Updated : 24 Jun 2022 18:46 IST

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో సేవలు అందించాలని తితిదే ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు. అన్నమయ్య భవన్‌లో శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీ శనివారం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్లలోని భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదాలకు ఇబ్బంది లేకుండా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత కొన్నినెలలుగా గురువారం నుంచి ఆదివారం వరకు తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోందని ఈవో వివరించారు. రద్దీ వేళ రోజుకు దాదాపు 90 వేల మంది శ్రీవారి దర్శించుకుంటున్నారని వెల్లడించారు. 

పోలీసులతో సమన్వయం చేసుకోవాలి...

క్యూలైన్ల నిర్వహణలో తితిదే విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ధర్మారెడ్డి సూచించారు. ఆరోగ్యాధికారి తిరుమలలో పరిశుభ్రతతో పాటు భక్తులకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రిసెప్షన్ అధికారులు గదుల కేటాయింపులో అలస్యం లేకుండా చూడాలన్నారు. మరోవైపు భక్తుల రద్దీ కారణంగా తిరుమలలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కల్యాణకట్టలో రోజుకు సుమారు 40 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారని, రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని ఈవో స్పష్టం చేశారు. చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్‌ఈ2 జగదీశ్వర రెడ్డి, వీజీవో బాలిరెడ్డితో పాటు పలువురు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని