World Sight Day 2021: కంటి ఆరోగ్యం.. ఓ ఆస్తి

మనిషి శరీరంలోని సున్నితమైన అవయవాల్లో ‘కళ్లు’ ముఖ్యమైనవి. అవి ఆరోగ్యంగా ఉంటేనే కదా! రోజూ ప్రపంచాన్ని చూడగలుగుతాం. అందుకే కళ్ల రక్షణకు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.ఇక రోజురోజుకూ పెరుగుతోన్న టెక్నాలజీ వినియోగం విశ్వానికి వరంగా మారినప్పటికీ.. అదే మనకు తెలియని శాపంగా మారుతోంది.

Updated : 14 Oct 2021 16:32 IST

నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం

ఆరోగ్యమైన కళ్లకోసం ఈ సూత్రాలు పాటిస్తే సరి!

ఇంటర్నెట్‌ డెస్క్: మనిషి శరీరంలోని సున్నితమైన అవయవాల్లో ‘కళ్లు’ ముఖ్యమైనవి. అవి ఆరోగ్యంగా ఉంటేనే కదా! రోజూ ప్రపంచాన్ని చూడగలుగుతాం. అందుకే కళ్ల రక్షణకు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.ఇక రోజురోజుకూ పెరుగుతోన్న టెక్నాలజీ వినియోగం విశ్వానికి వరంగా మారినప్పటికీ.. అదే మనకు తెలియని శాపంగా మారుతోంది. గంటల తరబడి డిజిటల్‌ పరికరాలకు అతక్కుపోవడం.. ఆ కారణంగా దృష్టిలోపం బారినపడటం ఇటీవలీ కాలంలో మరింత ఎక్కువైంది. భారత్‌లో సుమారు 55 కోట్ల మంది కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది. కంటి సమస్యలపై, నేత్ర రక్షణపై అవగాహన పెంచేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఏటా అక్టోబర్‌ రెండో గురువారం ‘World Sight Day’ నిర్వహిస్తోంది. నేడు అక్టోబర్‌14, 2021 ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’ సందర్భంగా కంటి ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం!

 20:20:20 ఫార్ములా పాటించండి
 కంప్యూటర్ల ముందు లేదా ఇతర డిజిటల్‌ పరికరాలకు అతుక్కుపోయే వారి కళ్లకు విశ్రాంతినిచ్చేలా 20:20:20 ఫార్ములాను నిపుణులు రూపొందించారు. దీని ప్రకారం 20నిమిషాలు తదేకంగా డివైస్‌ను చూశాక బ్రేక్‌ తీసుకొని ఆ సమయంలో 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్లపాటు చూడాలి.అలా చేసినట్లేతే.. కంటికి కాస్త ఉపశమనం లభిస్తుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు

యాంటీ రిఫ్లెక్టివ్ కళ్లద్దాలతో మేలు

ప్రతీరోజూ బ్లూ లైట్‌ని (నీలి కాంతి) ఎక్కువగా చూడటం వల్ల కంటి చూపు సంబంధిత సమస్యలు, వస్తువులు అస్పష్టంగా కనిపించడం, కంప్యూటర్‌- విజన్‌ సిండ్రోమ్‌, డిజిటల్‌ ఐ స్ట్రైన్ సమస్యలకు దారితీస్తుంది. అందుకే కంప్యూటర్‌, టీవీ, ల్యాప్‌టాప్‌, సెల్‌ఫొన్స్‌ వంటి డిజిటల్‌ పరికరాలు వాడేసమయంలో కచ్చితంగా యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ అద్దాలు వాడాలి. ఇవి మార్కెట్‌లో  అందుబాటులో ఉంటాయి. వాడటానికి ముందు కచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవాలి.

పొడిబారకుండా ఉండేందుకు
కళ్లు పొడిబారకుండా నివారించేందుకు.. స్ర్కీన్‌ చూస్తున్నప్పుడు మధ్యమధ్యలో రెప్పలు వేయడం మర్చిపోవద్దు. ఇక మీకంటి కండరాలకు విశ్రాంతి ఇచ్చేందుకు మధ్యమధ్యలో విరామం తీసుకోండి. అలాగే కళ్లకు, మొబైల్‌ స్ర్కీన్‌కు కనీసం రెండు అడుగుల దూరం ఉండాలి.కంప్యూటర్‌పై ఎక్కువ సమయం పనిచేసేవారు కాంటాక్ట్ లెన్సులను ఉపయోగించకపోవడం ఉత్తమం. ఎందుకంటే వాటివల్ల కూడా కళ్లు పొడిబారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోజుకి ఎక్కువ మోతాదులో నీరు తీసుకుంటే కళ్లు పొడిబారకుండా ఉంటాయి.

వెలుతురు ఉండేలా..
పత్రికలు, పుస్తకాలు చదివే గదిలో వెలుతురు ఎక్కువ ఉండాలి. డిజిట్‌ స్ర్కీన్లపై నుంచి వచ్చే కాంతి ( బ్రైట్‌నెస్‌) కూడా నార్మల్‌గా ఉండేలా చూసుకోవాలి. మొబైల్‌ఫోన్లలో ఫాంట్‌ పరిమాణాన్ని పెద్దదిగా, స్పష్టంగా ఉంచండి. 

పడుకునే ముందు ఇవి వద్దు
చాలా మందికి పడుకునే ముందు ఫొన్‌ పట్టుకునే అలవాటు ఉంటుంది. అదే కంటి ఆరోగ్యం పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకే మెల్లగా స్ర్కీన్‌ సమయాన్ని తగ్గించుకోవడం లేదా నచ్చిన పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. నిద్రలేమి కూడా వివిధ కంటి సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి తగినంత సమయం నిద్రపోవాలి.

విటమిన్‌ ‘ఎ’ తీసుకొండి
విటమిన్‌ ‘ఎ’ మీ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇందులో ఉండే రెటినాల్‌, బీటా కెరోటిన్‌ కళ్ల ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తాయి. క్యారెట్‌, ఆకుకూరల్లో ఈ విటమిన్‌ ‘ఎ’ పుష్కలంగా లభిస్తుంది.  ఇక కళ్ల మంట, దురదగా అనిపిస్తే చల్లని నీటితో మృదువుగా కడగాలి. ఆకు కూరలు, నట్స్‌ అండ్‌ సీడ్స్‌, చిక్కుళ్లను మీ ఆహారంలో చేర్చితే కళ్లకు ఆరోగ్యాన్ని ఇస్తుంది.  

ఈ కంటి వ్యాయామం చేయండి
కంటి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చిన్నపాటి వ్యాయామాలు ఎంతో సహాయపడతాయి. అందుకు ఏం చేయాలంటే.. చేతి మునివేళ్లను కళ్లపై ఉంచి సవ్యదిశలో మూడుసార్లు, ఆ తర్వాత అపసవ్య దిశలో మరో మూడుసార్లు గుండ్రంగా తిప్పుతూ మర్దన చేసుకోవాలి. ఆపై మూడుసార్లు కళ్లు మూస్తూ తెరవాలి. తరచూ ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి కళ్లకు సాంత్వన లభిస్తుంది.

ఈ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌తో కాస్త ఉపశమనం
గదిలో ఉండే వెలుగుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కలర్ సెట్టింగులను మార్చే సాఫ్ట్‌వేర్‌లను కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వీటి వల్ల గది వెలుతురుకు అనుగుణంగా స్క్రీన్ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ మారుతూ ఉంటాయి. ఫలితంగా కళ్లపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చు. సాధ్యమైనంత వరకు ఫాంట్ సైజు పెంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని