PM Modi: ‘ఆ పాత ఫోన్‌ను 2014లోనే వదిలేశారు’.. కాంగ్రెస్‌పై మోదీ వ్యంగ్యాస్త్రాలు

2014 కేవలం తేదీ మాత్రమే కాదని, అదో మార్పు అని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఆ మార్పు కోసమే ‘అవుట్‌డేటెడ్‌ ఫోన్‌’ లాంటి కాంగ్రెస్‌ను ప్రజలు వదిలించుకున్నారని మోదీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

Updated : 27 Oct 2023 17:00 IST

దిల్లీ: ‘ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (India Mobile Congress)’ ఏడో ఎడిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) శుక్రవారం ప్రారంభించారు. దిల్లీలో జరిగిన ఈ సదస్సులో ప్రధాని మాట్లాడుతూ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ (Congress) పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీని ‘కాలం చెల్లిన ఫోన్‌’తో పోల్చుతూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. 2014లోనే ప్రజలు ఆ ఫోన్లను వదిలేసి.. దేశ గతిని మార్చే ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని అన్నారు.

‘‘కాలం చెల్లిన ఫోన్లలో స్తంభించిన స్క్రీన్లపై.. ఎన్నిసార్లు స్వైప్‌ చేసినా, ఎన్ని బటన్లు నొక్కినా ఫలితం ఉండదు. రీస్టార్ట్‌ చేసినా, బ్యాటరీకి ఛార్జింగ్‌ పెట్టినా.. చివరకు బ్యాటరీ మార్చినా ఆ ఫోన్లు పనిచేయవు. గత ప్రభుత్వం (కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు) కూడా అలాంటి స్థితిలోనే ఉండేది. 2014లోనే ప్రజలు అలాంటి కాలం చెల్లిన ఫోన్లను వదిలించుకున్నారు. ఈ దేశానికి సేవ చేసేందుకు మాకు అవకాశం కల్పించారు. 2014 కేవలం తేదీ మాత్రమే కాదు. అదో పెను మార్పు’’ అని మోదీ (PM Modi) కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.

జియో నుంచి ఇక శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు

ఈ సందర్భంగా సాంకేతిక రంగంలో భారత్‌ సాధించిన విజయాలను ప్రధాని గుర్తుచేశారు. ‘‘వేగవంతమైన 5జీ టెలిఫోన్‌ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత.. ఇప్పుడు 6జీ దిశగా భారత్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. 5జీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏడాదిలోపే దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 5జీ బేస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసుకోగలిగాం. బ్రాడ్‌బ్యాండ్‌ వేగంలో భారత్‌ గతంలో 118 ర్యాంక్‌లో ఉండగా.. ఇప్పుడు 43వ ర్యాంక్‌కు ఎగబాకింది. ఇటీవలే గూగుల్‌.. భారత్‌లో పిక్సెల్‌ ఫోన్‌ను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. శామ్‌సంగ్‌ ఫోల్డ్‌ 5, యాపిల్‌ ఐఫోన్‌ 15 ఇప్పటికే దేశంలో తయారవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచమంతా మేడ్‌ ఇన్‌ ఇండియా ఫోన్లను ఉపయోగిస్తుండటం గర్వంగా ఉంది’’ అని మోదీ కొనియాడారు.

భారత టెక్‌ విప్లవంలో యువత పాత్ర కీలకమని మోదీ అన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. ‘‘గతంలో 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్లో (యూపీఏ హయాంలోని 2జీ కుంభకోణాన్ని ఉద్దేశిస్తూ) ఏం జరిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. మా హయాంలో 4జీ విస్తరించాం. కానీ మాపై ఒక్క మచ్చా పడలేదు’’ అని కాంగ్రెస్‌ పార్టీని ప్రధాని దుయ్యబట్టారు. 6జీ టెక్నాలజీలో భారత్‌ ప్రపంచానికి మార్గనిర్దేశంగా నిలుస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు