JioSpaceFiber: జియో నుంచి ఇక శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు

JioSpaceFiber: ఇప్పటికే జియోఫైబర్‌, జియోఎయిర్‌ఫైబర్‌ పేరిట బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తున్న జియో తాజాగా శాటిలైట్‌ నెట్‌వర్క్‌ ఆధారిత సర్వీసులను కూడా ప్రారంభించింది.

Updated : 27 Oct 2023 15:37 IST

దిల్లీ: భారత్‌లో తొలి ఉపగ్రహ ఆధారిత గిగా ఫైబర్‌ సర్వీస్‌ను విజయవంతంగా అమలు చేసినట్లు ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) ప్రకటించింది. భారత్‌లో ఇప్పటి వరకు ఇంటర్నెట్‌ సదుపాయం లేని ప్రాంతాలకు దీని ద్వారా వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ సేవల (broadband services)ను అందించనున్నట్లు తెలిపింది. జియోస్పేస్‌ఫైబర్‌ (JioSpaceFiber)గా పిలుస్తున్న ఈ సర్వీస్‌ను భారత మొబైల్‌ కాంగ్రెస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో శుక్రవారం రిలయన్స్‌ జియో (Reliance Jio) విజయవంతంగా ప్రదర్శించింది.

జియో (Reliance Jio) ఇప్పటికే భారత్‌లో 45 కోట్ల కస్టమర్లకు ఫిక్స్‌డ్‌ లైన్‌, వైర్‌లెస్‌ మార్గాల ద్వారా వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ సేవల (broadband services)ను అందిస్తోంది. దేశంలోని ప్రతి ఇంటికీ డిజిటల్‌ సేవలను చేరువ చేయడంలో భాగంగానే జియోఫైబర్‌ (JioFiber), జియోఎయిర్‌ఫైబర్‌ (JioAirFiber) వంటి బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల సరసన జియోస్పేస్‌ఫైబర్‌ (JioSpaceFiber)ను కూడా చేర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఎలాంటి జాప్యం లేని, వేగవంతమైన ఇంటర్నెట్‌ను, ఎంటర్‌టైన్‌మెంట్‌ సేవలను ప్రాంతంతో సంబంధం లేకుండా అందిస్తున్నట్లు పేర్కొంది. తాజా శాటిలైట్‌ నెట్‌వర్క్‌తో జియో ట్రూ5జీ సేవలు సైతం దేశంలోని ప్రతి ప్రాంతానికి అందుతాయని వివరించింది.

ప్రపంచంలో తాజా ‘మీడియం ఎర్త్‌ ఆర్బిట్‌ (MEO)’ శాటిలైట్‌ టెక్నాలజీ కోసం జియో ఎస్‌ఈఎస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జియో తెలిపింది. గిగాబిట్‌ (Gigabit), స్పేస్‌ నుంచి ఫైబర్‌ తరహా సేవలను అందించగల ఎంఈఓ ఉపగ్రహాల కూర్పు ఇదొక్కటేనని పేర్కొంది. తద్వారా జియో (Reliance Jio)కు ఎస్‌ఈఎస్‌కు చెందిన ఓ3బీ, ఓ3బీ ఎంపవర్‌ శాటిలైట్ల నెట్‌వర్క్‌కు యాక్సెస్‌ లభిస్తుందని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా అత్యంత కచ్చితత్వంతో ఈ అత్యాధునిక సాంకేతితతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవల (broadband services)ను అందిస్తున్న ఏకైక సంస్థగా జియో నిలుస్తుందని పేర్కొంది.

జియోస్పేస్‌ఫైబర్‌ (JioSpaceFiber) సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఇప్పటికే నెట్‌వర్క్‌లో గుజరాత్‌ గిర్‌, ఛత్తీస్‌గఢ్‌ కోర్బా, ఒడిశా నవరంగాపూర్‌, అసోం ఓఎన్‌జీసీ జోర్హట్‌ వంటి మారుమూల ప్రాంతాలను చేర్చినట్లు జియో తెలిపింది. ‘‘భారత్‌లో లక్షలాది ఇళ్లు, వ్యాపారాలకు జియో బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవలను ప్రారంభించాం. ఇప్పటి వరకు ఇంటర్నెట్‌ అనుసంధానతకు దూరంగా ఉన్న లక్షలాది మందికి కూడా జియోస్పేస్‌ఫైబర్‌ (JioSpaceFiber) ద్వారా సేవలను విస్తరిస్తున్నాం. జియోస్పేస్‌ఫైబర్‌తో ఎవరైనా, ఎక్కడి నుంచైనా కొత్త డిజిటల్‌ సమాజంలో చేరి గిగాబిట్‌ యాక్సెస్‌తో ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ, విద్య, ఆరోగ్య, వినోదాత్మక సేవలను పొందొచ్చు’’ అని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ (Akash Ambani) అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని